స్వప్నాల సకారంకై
నెత్తుటి త్యాగాలు చేస్తూ…
దేశంలో ఒక్క పూటకు
తిండికి నోచుకోని
52 కోట్ల మంది
అభాగ్యుల కోసం
నెత్తుటి గాయాలతో
పోరాడుతున్నాం!
కుల అహంకారపు
అంటరాని, అణిచివేత గోడలను
బద్దలు చేయ
ఆత్మగౌరవం కోసం…
ఆడబిడ్డపై జరుగుతున్న
అత్యాచార ఆకృత్యవమానాలను
బద్దలు చేస్తూ
ఆకాశంలో సగమంటూ…
డిగ్రీ పట్టాల చదువులు కాదు
నిరుద్యోగ బ్రతుకులు మార్చే
చదువుల కొలువులు కావాలని…
చెమట చుక్కలతో
దేశ సంపదను సృష్టించే
కార్మికుల కష్టాల కోసం
కనీస వేతనాల కోసం
శ్రమకు తగిన గుర్తింపు కోసం…
అప్పుల ఊబిలో చిక్కుకొని
ఆత్మస్థైర్యం కోల్పోతున్న
అన్నదాతల బతుకుల కోసం
గిట్టుబాటు ధరల కోసం
సాగునీటి హక్కుల కోసం…
విద్య, వైద్యం
అందరికీ అందాలని
పేదవాడి బిడ్డకు సైతం
నాణ్యమైన చదువు రావాలని
ఆరోగ్యం అమ్మకపు సరుకు కాకూడదని…
మతం పేరుతో విద్వేషాలు
కులం పేరుతో విభజనలు
ప్రాంతం పేరుతో వివక్షలు
మనుషుల మధ్య గోడలుగా మారితే
మానవత్వపు విలువల కోసం…
ప్రజాస్వామ్య విలువల కోసం
ప్రశ్నించే గొంతుల కోసం
భావప్రకటనా స్వేచ్ఛ కోసం
అధికారాన్ని ప్రశ్నించే
ప్రజల హక్కుల కోసం…
మేం పోరాడి
సైనికంగా ఓడిపోయాం!
కానీ మాది రాజకీయ ఓటమి కాదు!
మా ఆశయాలు ఓడిపోలేదు!
మా ఆలోచనలు చావలేదు!
మా పోరాటపు అడుగులు ఆగిపోలేదు!
మా గొంతులో రగిలి అగ్నికణ జ్వాలా నినాదాలు
ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి!
అమరుల ఆశయం సాధనకై
ఈ సైనిక ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ
బడుగు జీవుల గెలుపు కోసం
మళ్లీ మేం నిలబడతాం
ఇది మరో పోరాటానికి ఆరంభం!
మా కలలు సాకారమయ్యే వరకు
సమసమాజం నిర్మితమయ్యే వరకు
అణగారిన మనిషికి న్యాయం జరిగే వరకు
మేం మళ్లీ మళ్లీ పోరాడుతూనే ఉంటాం!





వెన్నెల మనసంతా వెలిగించావు. మళ్ళీ కొత్తగా పుట్టించావు.