1. నాలుగు దుఃఖాలు

రుతువులు రాలిపోయాక
ఆమె గతంలోకి ప్రయణించలేం

ఒంటరి నది నిశ్శబ్దంగా సాగిపోతుంటే
కాగితపు పడవల్లో ఆమె
మనసు రాసే ప్రేమ లేఖలు వొదులు తోంది

అవి ప్రియుని చేరుతాయో లేదో కానీ
సమాంతరంగా
స్నేహితుడు, భర్త వీక్షిస్తారు

ఇక్కడ నాల్గు దారులు
వేర్వేరు గమ్యాల వైపు పయనిస్తున్నాయి

ఆమె కన్నీటి ధారలు
శీతల నదులుగా ప్రవహిస్తున్నాయి

ఆకురాలు కాలంలో భర్త
సంధ్య లోకి వాలిపోతున్నాడు

ఉదయించని సూర్యోదయం లో
స్నేహితుడు ధ్యానిస్తున్నాడు

ఆచూకీ లేని ప్రియుడు
నది చివర మునిగి వున్నాడు

మౌనం ముద్రలో
నాల్గు దుఃఖాలు ఈదుతున్నాయి.
0 0 0

  1. ఏంటో

ఏంటో నీ మాట వింటే చాలు
నిశ్శబ్ద ప్రవాహాలు తడిపి పోతుంటాయి

అలసిన హృదయానికి
లేపనం పూసినట్టు
అనుభూతులు పరవళ్ళు తొక్కుతుంటాయి

ఈ అనంత విశ్వంలో
ఆశ బతికిస్తుంది
ఈ క్షణం సంతృప్తి
మనిషి ని పరిపూర్ణం చేస్తుంది

ఏమీ ఆశించని
స్వచ్ఛమైన ఆహార్యం కదా
ఆనంద నిలయంలో నిలిపి ఉంచేది.

నాలో సగం భాగం గా
నీతో పరవళ్ళు తొక్కిన జీవితం కదా
జీవన సాఫల్యాన్ని
రసమయం చేసింది

నీ మాట వింటే చాలు
సప్త వర్ణ శోభిత మైన
జీవ నదిలో ప్రవహిస్తాను.

Leave a Reply