విప్లవ రచయితల సంఘం (విరసం) 30వ మహాసభలు 2026 జనవరి 24, 25 తేదీల్లో హైదరాబాద్లో అత్యంత ఉత్సాహంగా జరిగాయి. “భావజాల, సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాటం” అనే ప్రధాన నినాదంతో జరిగిన సభలు ప్రజల్లో నూతన ఉత్సహాన్ని రేకెత్తించాయి.
భారతదేశ ప్రజా రాజకీయాల్లో వర్గపోరాట చైతన్యాన్ని రగిలించిన నక్సల్బరీ ఉద్యమ స్ఫూర్తితో 1970లో విప్లవ రచయితల సంఘం (విరసం) ఆవిర్భవించింది. అప్పటి నుండి నేటి వరకు 55 ఏళ్లుగా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం,నక్సలిబరీ,శ్రీకాకుళం, ఉత్తర తెలంగాణ జగిత్యాల జైత్రయాత్ర , దండకారణ్య పోరాటాల కొనసాగింపుని, అమరవీరుల త్యాగాల చరిత్రను ప్రజలకు రచనలు, కథలు, పాటల ద్వారా ప్రజలకు అందిస్తూ మరియు దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా విరసం తన కలం ద్వారా పీడిత ప్రజల పక్షాన నిలబడి పోరాడుతోంది. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన 30వ మహాసభలు వర్గపోరాట అవసరాన్ని మరియు ప్రస్తుత సంక్షోభ కాలంలో విద్యార్థులు, ప్రజల మేధావుల బాధ్యతను, విప్లవ రచయితల బాధ్యతల గుర్తు చేసాయి.
విరసం 30 వ మహాసభల ప్రధాన నినాదం”భావజాల, సాంస్కృతిక రంగాల్లో వర్గపోరాటం”. సమాజంలో వేళ్లూనుకున్న దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా కేవలం రాజకీయ పోరాటమే కాకుండా, సాంస్కృతిక మరియు భావజాల రంగాల్లో కూడా యుద్ధం చేయాలని, వర్గపోరాటం అనేది ఒక చారిత్రక,వాస్తవికమైనదని అది మానవ సమాజ పురోగతికి వంతెన వంటిదని ఈ విరసం సభలు చాటిచెప్పాయి.
కార్పొరేట్ పెట్టుబడి దారుల వంచన చేరిన పాలకులు చేపట్టిన ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా జల్, జంగిల్ ,జమీన్ ఆదివాసీ హక్కుల కోసం అంతిమంగా పీడిత ప్రజల విముక్తి కోసం సాగుతున్న వర్గపోరాటమే ప్రత్యామ్నాయమని ఈ సభలు నిరూపించాయి.ఈ మహాసభల్లో జెండా ఆవిష్కరణ అమరవీరుల కుటింబికులు చేయగా ప్రారంభోపన్యాసం ప్రముఖ తమిళ కవయిత్రి సుకీర్తారాణి చేశారు. కీ నోట్ విరసం కార్యదర్శి రివేరా ప్రవేశపెట్టారు.సమాజ పరివర్తనాక్రమంలో నక్సల్బరీ ప్రయోగాలు,విజయాలు ,కళా,సాహిత్య రంగాల్లో వర్గపోరాటం మేదో రంగం-వర్గపోరాటం 21వ శతాబ్ది విప్లవోద్యమాలు అంశాలపై వక్తలు అజిత్,,ప్రో కాసీం,N. రవి లు ప్రసంగించారు.ఈ రెండు రోజులు జరిగిన సభల్లో ‘చుక్క పొడుపు (నవల),మోదుగు పూల సవ్వడి (పాటలు),నిశిత (సమీక్ష వ్యాసాలు) – చెంచయ్య’,మనుషులుంటారు (కథా సంకలనం),ఈ శతాబ్దపు కవిత్వ సంతకం,కగార్ రిపబ్లిక్,మంజీరా అడుగుజాడలు,అన్ సైలెన్స్ డ్,కవిత్వం గతి తార్కికత కవిత్వ విమర్శ ( వ్యాసాలు),కె.ఎస్. సమగ్ర రచనలు,పాలపుంత ( దీర్ఘ కవిత) ,తొలకరి ,మచ్చ వీరయ్య ( మడమ తిప్పని మహాయోధుడు),జనజీవనం దారి పొడవునా,విభజన రేఖ ( కథా సంకలనం),ద పాథ్ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ ప్రజెంట్ కాంటెక్స్ట్( ఆంగ్ల పుస్తకం) – ఫార్మర్ ఆర్ ఎస్ ఎఫ్,లవ్ జిహాద్ – తెలుగు అనువాదం: రవి నర్ల 50 వసంతాల అరుణోదయం సావనీర్,అవునా? నువ్వు దళిత్ వా? పుస్తకాల ఆవిష్కరణ జరిగింది.
ఈ సభల్లో పాల్గొన్న పౌర హక్కులనేత ప్రొఫెసర్ హరగోపాల్ మధ్యభారత దేశంలో ఉన్న అపారమైన ఖనిజసంపదను అంబానీ, ఆదాని, వేదాంత లాంటి కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టి ఆదివాసీ ప్రజలను అడవులనుంచి వెల్లగొట్టడానికి కేంద్ర బీజేపీ మతోన్మాద ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ అక్రమయుద్ధాన్ని అక్కడ జరుగుతున్న ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనను ఖండించించాలని ప్రజలను కోరారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం దమనకాండను, అది అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న మేధావులు, రచయితల,విద్యార్థుల అరెస్టులను నిరసిస్తూ విరసం ఈ సభల వేదికగా వక్తలు ముక్తకంఠంతో ఖండించారు.
దేశంలో పెరుగుతున్న మతోన్మాదం, కార్పొరేట్ శక్తుల ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి విప్లవ ప్రజా సాహిత్యం ,రచనల ద్వారా విద్యార్థులు మేధావుల శ్రామిక రైతు కూలి ప్రజలను ప్రశ్నించే చైతన్యం తేవాలని, విరసం 30వ మహాసభలు కేవలం ఒక సంఘం వార్షికోత్సవం లాగా కాకుండా, విప్లవ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే వేదికగా నిలిచాయి. సాయుధ పోరాట వారసత్వాన్ని అందిపుచ్చుకుని, ఎర్రజెండా నీడన అణచివేత లేని సమాజం కోసం ప్రజాయుద్ధ పంథానే ఏకైక మార్గమని దోపిడీ పీడనలు లేని సమాజం కోసం తమ కలం, గళం ద్వారా పోరాడుతామని విరసం మరోసారి చాటి చెప్పింది.రెండు రోజులు జరిగిన విప్లవ రచయితల సంఘం మహాసభలు విప్లవ శ్రేణుల్లో, విప్లవాభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని, ఆలోచనలు నింపాయి.




