1
వడివడిగా...
అంగలే వేసానో
ఒక 'క(౦)గారు' లో ..
దూరమే ఎగిరిపడ్డానో..
అయినా..
చాలా ముందుకే వెళ్ళిపోయాను
జీవితం అనేది 'వన్ వే' నో కాదో కానీ..
పోరాటానిది మాత్రం ఒక్కటే దారి
సాగిల పడిపోయిన నీకోసం
నేను.. ఎప్పటికి వెనక్కి రాలేను
నా వెనక వెనకే అయినా నువ్వే
కదిలి రావాలి...
కాని..
నీ చెయ్యి పట్టి నేను నడవలేను
వెలుగు వెంట సాగే నా నీడ దారినైనా
నువ్వే నడిచి రావాలి
ఎద(ర) పరుచుకున్న రక్త తర్పణ దారి తప్ప
నీ 'విశాల హృదయం' కానరాదు నాకు
అవును..
నా దృష్టిలో ఒక స్పష్టమైన విభజన
నీ వల్లే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది
దప్పిక ఎరగని ఒంటె.. ద్దు పోకడ
ఏకాకి ఎడారి ఓడ.. నా ప్రయాణం
నీతో కలిసి ఇప్పుడు నేను నడవలేను
2
నా కలల ప్రపంచం మీదికి రాయి వేయకుండా
వాడికి .. అవును ..వాడికే ..పూట గడవదు
వసంతాన్ని వాగ్దానం చేసిన ప్రతి పువ్వును
తెంపకుంటే వాడికి క్షణం నిద్ర పట్టదు
తెగిపడ్డ పువ్వుల రక్తం... అత్తరు
వాడికి .. అవును.. వాడి పాడుబడ్డ లోకానికి...
కంపుకొట్టే ఈ వాసన
అలవాటు లేక నేను
చటుక్కున ముక్కు మూసుకుంటాన్
అప్పుడే..
అక్కడే.. దొరికిపోతాన్ ..
అర్బన్ నక్సల్ .




