దేఖ్ నా హై జోర్ కిత్నా హై బాజు ఏ కాతిల్ మే  
- ప్ర‌ముఖ హిందీ క‌వి
(ఉరిశిక్ష అమలు చేసే వాడి చేతిలో ఎంత బలం ఉందో చూద్దాం)


ఆరు పుట్టిన రోజులు
ఎత్తైన గోడల మధ్య గడచి పోయాయి
ఆరు సుదీర్ఘ సంవత్సరాలు
ప్రతిరోజూ సూర్యుడు తీహార్ ఎత్తైన గోడలను తాకాడు
కానీ నీ స్వేచ్ఛ కు మాత్రం ఊతమీయలేక పోయాడు

ఉమర్..
నిన్ను ఇనుప తలుపుల వెనుక బంధించారు
కానీ నీ చిరునవ్వును బంధించ గలిగారా?

నీ స్వరాన్నీ దాని ధైర్యాన్నీ
దేశం గాయపడుతున్నప్పుడు దేశపు వీధుల్లోకి
నిన్ను తీసుకొచ్చిన కలనూ
బంధించలేకపోయారు

ఆరు కొవ్వొత్తులు
ఆరు సంవత్సరాల నిరీక్షణ

బయట స్నేహితులు నీ పుట్టినరోజు గుర్తు చేసుకుంటున్నారు
నీ తల్లి నీ ముఖం గుర్తు చేసుకుంటుంది
నిన్ను ఎప్పుడూ కలవని వేలాది మంది
ఒకే కోరికను గుసగుసలాడుతున్నారు
బయటికి రా ఉమర్..

ఇది కేవలం
ఒక వ్యక్తి కోసం ఆరాటం కాదు

ఇది భయం లేకుండా
ఊపిరి పీల్చుకోవాలని ఆరాటపడే దేశం..
స్వేచ్భగా నిర్భీతిగా
మాట్లాడాలని ఆరాటపడే ప్రజలు..
అసమ్మతి నేరం కాని
ప్రశ్నలు అడగడం నేరం కాని
ఒక ఉదయం కోసం ఆరాటపడే తరం..

ఎత్తైన గోడలు
సుదీర్ఘ రాత్రులు
కానీ ఆ గోడలకు అవతల
రగులుతున్న పోరాటాలు

ప్రతి ఖైదీకి
బయట గొంతుల సాయం ఉంది
ప్రతి మూసిన తలుపుకి
తాళం తెరవాలనే చాచిన చేతులు ఉన్నాయి
ప్రతి అణచివేయబడిన స్వరానికి
మాట్లాడటం నేర్చుకుంటున్న
వేల ఇతర గళాలు ఉన్నాయి

బహుశా ఇదే..
ఇదే ఈ పాలకుల్ని తీవ్రంగా భయపెడుతుంది

ఉమర్ నువ్వు ఆరు సంవత్సరాలు జైలులో గడిపావు
కానీ నీ ఖైదు
ఆ గోడల వెలుపల నువ్వు మొదలుపెట్టిన పోరాటాన్ని
ఈ రాజ్యం అంతం చేయలేదు

ఈ పాలన
నీ ఆలోచనను
అవమానంగా చూసింది
నీ వాదనకు ఖైదుతో
నీ ప్ర‌శ్న‌కు నిర్భంధంతో
నీ అసమ్మతికి జైలుతో
సమాధానం ఇవ్వాలనుకుంది

కానీ దేశమే మాట్లాడుతోంది

షాహీన్ బాగ్‌ మాట్లాడింది
మహిళలు రోడ్లపై కూర్చుని
తమ ధైర్యాన్ని
భయానికి వ్యతిరేకంగా కవచంగా మార్చారు

భీమా కోరేగావ్‌ మాట్లాడింది
న్యాయం కోసం డిమాండ్ చేసింది
అన్యాయం అదృశ్యం కావడాన్ని నిరాకరించింది

రైతుల పోరాటాలలో
కార్మికుల పోరాటాలలో
అడవులు భూములు జీవితాలు
వాళ్ళు వదులుకోవాల్సినవి కావన్నాయి
ఆదివాసీ సమాజాలు
పెరుగుతున్న ప్రతిఘటనలో మాట్లాడింది

జూలై 20న జరిగిందే
అణచివేయడాన్ని నిరాకరించేదానికి
మరో వ్యక్తీకరణ మాత్రమే

ఇవన్నీ విడివిడి గొంతులు కావు

ఇవి ప్రతిఘటన తీరు వేరు ప్రవాహాలు
ఒక పెద్ద నదిలోకి ప్రవహిస్తాయి
ప్రతి పోరాటం మరొక పోరాటాన్ని బలపరుస్తుంది
ప్రతి నిరసన ధైర్యాన్ని వదిలివెళ్తుంది
ప్రతి ప్రతిఘటన చర్య
భయాన్ని రిపబ్లిక్ భాషగా
మార్చాలని చూసే పాలనను
ఎదుర్కోవాలనే సంకల్పాన్ని బలపరుస్తుంది

అందుకనే ఉమర్
జైలు గోడల వెనుక నీ ఆరో పుట్టినరోజున
నీ స్వేచ్ఛ అనేది కేవలం
ఒక వ్యక్తి కోసమే డిమాండ్ కాదు

భయం లేకుండా మాట్లాడాలనుకునే
అనుమతి లేకుండా ఆలోచించాలనుకునే
నేరస్తుడిగా ముద్ర పడకుండా నిరసన చేయాలనుకునే
శిక్షించబడకుండా ప్రశ్నలు అడగాలనుకునే
ప్రతి ఒక్కరిదీ

స్వేచ్ఛ నిన్ను మర్చిపోయిందా?
లేదు
జైలు గేట్ల వెలుపల వేచి ఉంది
తెల్లవారుజాము వలె ఓపికగా
వీధుల్లో
విశ్వవిద్యాలయాల్లో
పొలాల్లో
కర్మాగారాల్లో
అడవుల్లో
లొంగిపోవడానికి నిరాకరించే
వారి హృదయాల్లో బలాన్ని పోగు చేస్తోంది

ఒకరోజు తలుపులు తెరుచుకుంటాయి

నువ్వు బయటకు అడుగు పెట్టినప్పుడు
నువ్వు వదిలి వచ్చిన గోడలు కాకుండా
ఉదయపు వెలుగులో నిలబడి ఉన్న
లోతుగా ఊపిరి పీల్చుకుంటున్న
తన గొంతును మళ్ళీ కనుగొంటున్న
స్వేచ్ఛ అనేది
పాలకులు ఇచ్చే బహుమతి కాదని
ఇది ఒక హక్కు
కాపాడుకోవాల్సిన హక్కని నొక్కి చెప్పాలి

ఒక వ్యక్తి స్వేచ్ఛ కాదు
కొంతమంది స్వేచ్ఛ కాదు

ఒక దేశపు స్వేచ్ఛ

ఆ రోజు వచ్చినప్పుడు
ఉమర్
ఆ ఆరు సంవత్సరాలు
కలల్ని విచ్ఛిన్నం చేయలేదని
దాన్ని బలపరిచాయని
నువ్వు ఆ గేట్ల నుండి బయటకు నడుస్తూ చూడవచ్చు

దేశం ఊపిరి పీల్చుకోవడం మళ్ళీ నేర్చుకుని
మనందరి స్వేచ్ఛ కోసం
పోరాడటానికి లేచి నిలబడుతుంది.

11 ఆగ‌స్టు 2026

Leave a Reply