ప్రజలే చరిత్ర నిర్మాతలు :
చరిత్ర నిర్మాతలు ఎవరు? వీరులా? బానిసలా? భావ, భౌతిక వాదాలకు చరిత్ర వ్యాఖ్యానం గురించి ఏనాటి నుంచో జరుగుతున్న సంఘర్షణలో తేలకుండా మిగిలిపోయిన ప్రశ్నలివి. దోపిడీ వర్గాలు, తమ పాలన కొనసాగించుకునేందుకు వేలాది ఏళ్ల నుంచి వీరులే చరిత్ర నిర్మాతలు అంటూ భావవాద దృష్టిని ప్రచారం చేస్తున్నారు. దోపిడీ వర్గాల కొమ్ము కాసే కొద్దిమంది కథానాయకులే మేధావులని అదే దైవ నిర్ణయం అని వాళ్లే చరిత్ర నిర్మాతలని చెబుతున్నారు. జనం ఉత్త గొర్రెల మంద అని, మంద బుద్ధులని, వారు కథానాయకుల కనుసన్నలలో మెలగవలసిన వారేనని కూడా అంటున్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తే, దోపిడీ వర్గాల పెత్తనం కొనసాగినప్పుడు చారిత్రక అభివృద్ధి కొద్దిమంది పాలకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. సామాన్య జనం వాళ్లకు లొంగిపోయి తూర్పుకు తిరిగి దండం పెట్టి ఎవడో వచ్చి ఏదో చేసి తమను కాపాడుతాడని కలలు కంటూ కూర్చోవలసిందే. ఇలాంటి భావవాద దృష్టి కష్టజీవులకు ఆధ్యాత్మిక గుదిబండ.
కొత్త చరిత్ర:
మానవజాతి చారిత్రక అభివృద్ధిని నిర్ణయించే సామాజిక సూత్రాలను మొట్టమొదటిసారిగా మార్క్సిజమే వెలుగులోకి తీసుకువచ్చింది. అలగాజనమే చరిత్రను నిర్ణయిస్తారని శాస్త్రీయంగా రుజువు చేసింది. దోపిడీ వర్గాలను తారుమారు చేసి చరిత్రను మార్క్సిజమే నిటారుగా నిలబెట్టి భావవాద దృష్టిలోని దివాలా కోరుతనాన్ని బట్టబయలు చేసింది. అంతేకాదు దోపిడీ వర్గాల పాలన వేలాది యేండ్లుగా కొనసాగుతూ ఉంది. ఆ పాలనకు సిద్ధాంత పునాది ఉంది. ఆ పునాదిని పెకలించి వేసింది మార్క్సిజమే. చైనా విప్లవం నడిపేప్పుడు మావో పార్టీ సభ్యులకు ప్రజలకు కూడా భౌతిక వాద దృష్టి నూరి పోశాడు. ప్రజలే చరిత్ర నిర్మాతలన్నదే ఆ దృష్టి. అదే సమయంలో చారిత్రక భావవాదానికి వ్యతిరేకంగా అతను ఎడతెగని పోరాటం సాగించాడు. పార్టీకి ప్రజాపంథాను రూపొందించడమే గాక మావో ఏమన్నాడంటే, “జనం అపారమైన సృజనాత్మక శక్తి కలవారు. మనం జనాన్ని నమ్మాలి. పార్టీని నమ్మాలి. ప్రజలే నిజమైన వీరులు మనమే ఏమీ తెలియని వాళ్ళం. కళ్ళు తెరవని వాళ్ళం.” ఇలాంటి సూక్తులన్నీ కూడా భావవాద చారిత్రక దృష్టిని గట్టి దెబ్బ దీసాయి. బానిస యజమానులు, భూస్వాములు, పెట్టుబడిదారులు అందరు కలిసి ప్రజలే చరిత్ర నిర్మాతలనే నిజాన్ని, నొక్కి వేయాలని చూశారు.
దోపిడీ వర్గాలు తమంత తాముగా ఎప్పుడూ గద్దె దిగవు. వాళ్ల పాలన కూలిపోయాక కూడా తమ పాడు సిద్ధాంతాలను ఒక పట్టాన వదులుకోరు. లీషావు చీ మొదలైన దివాళాకోరు రాజకీయవాదులు భావవాద జాలంలో పడిపోయారు. కథానాయకులే చరిత్ర నిర్మాతలని ప్రచారం చేశారు. ఈ ప్రచారమే చైనా సోషలిస్టు విప్లవంలో రెండు వర్గాలకు రెండు పంథాలకు జరిగిన పోరాటంలో వినిపించింది. ఈ తప్పుడు సిద్ధాంతాన్ని మనం గట్టిగా తూర్పార బట్టేసరికి ఈ దివాళా కోరు రాజకీయ వాదులే ” చరిత్రను కథానాయకులు ప్రజలు కలిసి నిర్మిస్తార” ని కొత్తరాగం మొదలెట్టారు. మార్క్సిస్టు మూల సూత్రాన్ని ద్వైదీ భావం కింద మార్చివేసి ఎందుకూ పనికి రాకుండా చేయాలని వీళ్లు వ్యర్ధ ప్రయత్నం చేస్తున్నారు.
తత్వశాస్త్రంలో ద్వైతం ఏం చెబుతుందంటే భావన, పదార్థం అనేవి రెండూ కూడా ప్రపంచంలో రెండు సూత్రాలు. లీషావ్ చీ వగైరాలు ప్రచారం చేసిన సూత్రం “చరిత్రను కథానాయకులు ప్రజలు కలిసి నిర్మిస్తార” నేది ఈ ద్వైతంలో భాగమే.
ఇంతకీ ఈ ద్వైత సిద్ధాంతం చరిత్రలో ప్రజల పాత్రను నిజంగా గుర్తిస్తుందా? ముమ్మాటికి గుర్తించదు. లీషావ్ చీ వగైరాల దృష్టిలో “మామూలు జనం షావుకారులై కులాసాగా కాలక్షేపం చేయాలని చూస్తారు.” కూలీలంతా “ఒళ్ళు దాచుకొని ఎక్కువ డబ్బు గడించాలని చూస్తారు.” వాళ్ళ లెక్క ప్రకారం సామాన్య జనం అంటే ధన దాహంతో పరుగులెత్తే గొర్రెల మందే గాని చరిత్ర నిర్మాతలు కానేకారు. దోపిడీ వర్గాల ప్రతినిధులు మాత్రం ముందుచూపు ఉన్న దొడ్డవారు. కనుక దేశం ఆ దొడ్డవారి వల్లనే మన కలుగుతుంది. మళ్లీ మళ్లీ పతనమైన జాతిని వాళ్లే బ్రతికిస్తున్నారు. ఒక వంక మామూలు జనాన్ని తిట్టి దిగబారబోసి మరోవంక దొడ్డ ప్రభువులను ఆకాశానికి ఎత్తేసే వీళ్ళ వైఖరి చూస్తే మనకు ఓ సంగతి కచ్చితంగా తెలుస్తుంది. “చరిత్రను కథానాయకులు మామూలు జనం కలిసి నిర్మిస్తార” నేది తమ చారిత్రక భావవాద ధోరణికి కేవలం ఓ ముసుగు మాత్రమే.
సామాన్య జనం చరిత్ర నిర్మాతలనే మాట ఒప్పుకోకపోతే కథానాయకులే చరిత్ర నిర్మాతలని నువ్వు చెబుతున్నట్టే. కానీ “కథానాయకులు సామాన్య జనం కలిసి చరిత్ర నిర్మిస్తార” నే సిద్ధాంతాన్ని బాకా ఊదడం ద్వారా, రెండు పరస్పర వ్యతిరేక వాదాలను నిష్పాక్షికంగా సమన్వయం చేయడానికి కృషి చేస్తున్నట్టు కనిపిస్తారు. కానీ రాజకీయ దివాళా కోరులు అవలంబించే కుతర్కం ఇది.
ఆదిమ సమాజం అంతరించి పోయినాక ఎంగిల్స్ చెప్పినట్టు చరిత్ర యావత్తూ వర్గ పోరాటాల చరిత్రే.” సామాజిక అభివృద్ధి వివిధ దశల్లో పీడితులు, పీడకులు పనిచేసేవారు, పెత్తనం చేసేవారు నిరంతరం ఘర్షణ పడ్డారు. సామాజిక భౌతిక అవసరాలను ఉత్పత్తి చేసే పద్ధతే చారిత్రక అభివృద్ధికి భౌతిక ప్రాతిపదిక. అన్ని సమాజాల్లోనూ కూడా ఉత్పత్తి శక్తులకు, ఉత్పత్తి సంబంధాలకూ జరిగే సంఘర్షణే ప్రధానమైనది. ఉత్పత్తి శక్తుల అభివృద్ధి ఉత్పత్తి సంబంధాల్లో మార్పు తెస్తుంది. పాత ఉత్పత్తి పద్ధతి పోయి కొత్త ఉత్పత్తి పద్ధతి వస్తుంది. ప్రాథమిక సామాజిక వ్యవస్థ పోయి ఉన్నత సామాజిక వ్యవస్థ వస్తుంది.
” ఉత్పత్తి శక్తులన్నింటిలోకి గొప్పది విప్లవ వర్గమే” అన్నాడు మార్క్స్. వర్గ సమాజంలో ఉత్పత్తి శక్తులకు ఉత్పత్తి సంబంధాలకు మధ్య సంఘర్షణ జరుగుతుంది. సామాజిక ఉత్పత్తి శక్తులను పెంపొందించాలనే విప్లవ వర్గాలకు, పాత ఉత్పత్తి సంబంధాలను అలాగే అట్టి పెట్టాలని చూసే విప్లవ ప్రతిఘాతకులకు జరిగే ఈ వర్గ సంఘర్షణలో ప్రజలే నిర్ణయాత్మక శక్తి. సామాజిక మార్పులన్నీ ప్రజల విప్లవ పోరాటాల వల్లనే జరుగుతాయి. పురోగామి ఆలోచనలు, సిద్ధాంతాలు అన్నీ కూడా ఈ పోరాటాల ఫలితమే. ప్రజల విప్లవ పోరాటాల ప్రతిబింబమే. శాస్త్రీయ సాంకేతిక పురోభివృద్ధి అంతా ప్రజల ఆచరణ అనుభవాల జోడింపే. అభ్యుదయ సంస్కృతి, కళలు అన్నీ కూడా ప్రజల జీవితం నుంచి ప్రజా పోరాటాల నుంచీ పుట్టేవే. ఉత్పత్తి కోసం ప్రజలు పోరాడకపోతే అసలు సమాజమే లేదు. చరిత్ర ముందుకు పోదు. వర్గ సమాజంలో ప్రజల వర్గ పోరాటాలు లేనిదే చారిత్రక అభివృద్ధి గుండు సున్నా. కేవలం ప్రజలే చరిత్ర చోదక శక్తి ఇది తిరుగులేని సత్యం.
వీరుల పాత్ర:
అలాంటప్పుడు వీరుల పాత్ర పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి? చారిత్రక భౌతిక వాదం, వాళ్ల పాత్రను తీసిపారేస్తుందా! లేదు. వాళ్ళ పాత్ర గొప్పదని ఒప్పుకుంటుంది. ఉన్న చిక్కల్లా ఒక్కటే. వీరులంటే ఏమిటి? సరైన వెలుగులో వాళ్ళ పాత్రను ఎలా మదింపు వేయాలి? వీరుల పాత్రకు చరిత్ర నిర్మాతలైన ప్రజల పాత్రకు ఉన్న సంబంధ బాంధవ్యాల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? లీషావ్ చీ వగైరాలతో మనం భేదించేది మనం బాగా తగాదా పడేది కూడా ఈ ప్రశ్నల దగ్గరే.
వర్గ సమాజంలో వీరుల స్వభావం వారి వర్గాలను బట్టి ఉంటుంది. వర్గాలకు అతీతంగా వీరులుండరు. ప్రతి వర్గానికి వీరుల గురించి తనదైన ఒక దృష్టి ఉంటుంది. శ్రామిక వర్గానికి కష్టజీవులకు వీరులు ప్రజల విప్లవ పోరాటాల నుంచి పుడతారు. ఆ వీరులే ప్రజల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. చరిత్ర గమనానికి తోడ్పడతారు. ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్నమాట నిజం కనుక వీరుల పుట్టుక అలాగే ఉంటుంది. దోపిడీ వర్గాల వైఖరి దీనికి భిన్నమైనది. వాళ్ల ప్రయోజనాలను కాపాడి దోపిడీ వ్యవస్థను పదిలంగా ఉంచగలిగే వారే వీరులని వాళ్ళు అంటారు. దోపిడీ పాలకవర్గాలు ప్రజా వీరులను ఎన్నటికీ గుర్తించవు. అలాగే శ్రామిక జనం దోపిడీ పాలకవర్గాల కొమ్ము కాసే వీరులను కొలవరు. ఉదాహరణకు ఆధునిక చైనా చరిత్రలో హుంగ్ హే చిన్ విప్లవోద్యమానికి నాయకుడు. సామ్రాజ్యవాద దురాక్రమణకు భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరుడతడు. అతడే ప్రజావీరుడు కానీ దోపిడీ పాలకవర్గాలు అతన్ని దేశద్రోహి కింద జమ కట్టారు. అంతేకాకుండా ఈ పాలకవర్గాలు యాంగ్ కుషాన్ ను వీరుడని కొనియాడుతారు. తైవాన్ విప్లవోద్యమాన్ని అణచింది ఇతగాడే. శ్రామిక వర్గాలు అతగాడిని దోపిడీ వర్గాల తొత్తని దేశద్రోహని ఖండిస్తాయి.
మావో అన్నట్టు “ప్రజల కోసం ప్రాణం ఇవ్వడమనేది తాయ్ శిఖరం కన్నా ఉన్నతమైనది కానీ ఫాసిస్టుల కోసం దోపిడీ గాళ్ళ కోసం దొరల కోసం ప్రాణం ఇవ్వడం అనేది గడ్డిపోచ కన్నా హీనమైనది” పీడక వర్గాల పీడిత వర్గాల ప్రయోజనాల మధ్య ఉన్న ప్రధాన విభేదమే వీరుల పాత్ర గురించిన దృష్టి భేదానికి కారణం. పీడక వర్గానికి ఆటుపోటులు ఉంటాయి. వివిధ చారిత్రక దశల్లో దాని స్థానం మారుతూ ఉంటుంది. అలాగే దాని కొమ్ముకాసే వీరుల పాత్ర అన్ని దశల్లో ఒకే మోస్తరుగా ఉండదు.
వీరులు శూన్యంలోంచి పుట్టరు. చారిత్రక అభివృద్ధి నుంచి వర్గ పోరాటం నుంచే వారు పుడతారు. మార్క్స్ చెప్పాడు, ప్రతి సామాజిక దశకు దాని మహనీయులు కావాలి. ఒకవేళ అలాంటి మహనీయులు ఎక్కడా కనిపించక పోతే వాళ్లను సమాజమే సృష్టిస్తుంది. ఈ శాస్త్రీయ సిద్ధాంతాన్ని చరిత్ర రుజువు చేసింది. ప్రాచీన చరిత్రలో రోమ్ సామ్రాజ్యపు రోజుల్లో స్పార్టకసును గొప్ప వీరుడిగా కొనియాడాడు మార్క్స్. స్పార్టకస్ మామూలు బానిస గానే పుట్టాడు. ఆనాటి బానిసల తిరుగుబాటులే అతన్ని వీరుడిగా మలిచాయి. అతని నాయకత్వం కిందే బానిస వ్యవస్థను గట్టి దెబ్బ తీశారు. చైనాలో చిన్ వంశం వారి రోజుల్లో ఛెన్ ఫెంగ్, వూకాంగ్ ఇద్దరూ కూడా మామూలు రైతు కుటుంబాన్ని నుంచి వచ్చిన వాళ్లే. కానీ పెచ్చు పెరిగిన వర్గ వైరుధ్యాలు రైతుల తిరుగుబాట్లు, వాళ్లను ఉద్యమ నాయకులుగా తయారు చేశాయి.
బూర్జువా విప్లవాల్లో కూడా కొందరు నాయకులు సామాన్య జనం నుంచే వస్తారు. ఫ్రెంచ్ విప్లవంలో గొప్పసేనానులు చాలా మంది అంతకు ముందు మామూలు వాళ్లే. మంగళ్ళు, అద్దకం పనివాళ్ళు, చిల్లర మల్లర అమ్మకంగాళ్లు. వీళ్ళందరినీ అంతకు ముందు చాలా హీనంగా చూసేవారు. విప్లవం రానిదే అంత తక్కువ వాళ్ళు అంత మంచి సేనానులు ఎలా అవ్వగలరు? నిజమైన విప్లవం యొక్క గుర్తు ఏమిటంటే, ఇబ్బడి ముబ్బడిగా పాటక జనం, పీడిత ప్రజలు రంగం మీదకు రయ్ రయ్ మని ఉరకడమే” అన్నాడు లెనిన్. శ్రామిక విప్లవంలో ఈ మాట మరింత నిజం. వివిధ దశల్లో ప్రజా పోరాటాలకు ముందు నిలబడి, ప్రజల ప్రయోజనాలు తీర్చగలిగిన వారే నిజమైన వీరులు. చరిత్ర ప్రతిసారి నూతన కర్తవ్యాలు నిర్దేశిస్తుంది. ప్రజలకు నాయకత్వం వహించే వీరులు పుట్టి తీరుతారు.
వీరులు ప్రజల నుంచే పుడతారు:
విప్లవ వర్గాలకు అభివృద్ధి శక్తులకు ప్రాతినిధ్యం వహించి, ప్రజల అవసరాలు పసిగట్టి వాళ్ళ మద్దతు సంపాదించడం వల్లనే వీరులు చరిత్రలో ముఖ్యమైన పాత్ర నిర్వహించగలుగుతారని మార్క్సిజం చెబుతుంది. వీరుడైన ధీరుడైనా ఎవరైనా సరే ప్రజల నుంచే బలం సంపాదించుకుంటారు. ప్రజల ప్రయోజనాలను ప్రతిబింబించలేని వాడు ఎందుకూ కొరగాడు. మానవుడి సామాజిక స్థితి అతని ఆలోచనను నిర్ణయిస్తుంది. విప్లవ వర్గాల తాలూకు సరైన ఆలోచనలు జనం బాగా వంటబట్టించు కుంటే అవి భౌతిక శక్తులంత బలంగా పనిచేస్తాయి.
వీరుడు పురోగామి వర్గం కొమ్ముకాయాలి. సామాజిక అభివృద్ధిలో సూత్రాలు, సమాజాన్ని ప్రపంచాన్ని మార్చే విప్లవ కార్యాచరణ వీటన్నిటిని వీరులు కొనసాగించాలి. ఇదే కీలకమైన సంగతి. “వీరులు ప్రజలు కలిసి చరిత్ర నిర్మిస్తార” ని చెప్పే దొంగ మాట వర్గ ప్రయోజనాలను దాటవేస్తుంది. విప్లవ వర్గాన్ని, విప్లవ ప్రతీఘాత వర్గాన్ని ఏకం చేయడానికి ఈ భావవాద కుతర్కం ప్రయత్నిస్తుంది.
శ్రామిక వర్గాలు, విప్లవ ప్రజల వీరులే విప్లవ భావాలను వెదజల్లుతారు. వారే విప్లవ భావాలను కొనసాగిస్తారు. మామూలు జనం కన్నా వారు మరింత దూరదృష్టి కలిగి ఉంటారు. వాళ్ళు చాకచక్యంగా జనాన్ని సమీకరించ గలుగుతున్నారా లేదా అనేది పోరాటాల జయాపజయాల మీదే ఆధారపడి ఉంటుంది. అన్ని అవకాశాలు, పరిస్థితులు ఉండి కూడా కేవలం నాయకత్వం లోపం వల్ల చరిత్రలో చాలాసార్లు పోరాటాలు అపజయం పొందాయి. దీన్నిబట్టి చూస్తే వీరులు కొంత వరకు పోరాటాలను తుంచగలరు, పెంచగలరు అనిపిస్తుంది. అయితే, వీరులు వేగాన్ని పెంపొందించగలరే గాని చరిత్ర గతిని మార్చలేరు. విప్లవ పోరాటాల నుంచి వీరులు పుడతారు. ప్రజలను అంటిపెట్టుకు ఉన్నంతవరకే వాళ్లు తమ పాత్ర నిర్వహించగలుగుతారు. పురోగామి భావాలు సిద్ధాంతాలు అనేవి ప్రజల విప్లవ ప్రయోజనాలకు ప్రతిబింబమే. ప్రజల పోరాటానుభవాల పొందికయే. వాటిని ప్రజలు పూర్తిగా వంటబట్టించు కున్నప్పుడే అవి భౌతిక శక్తిగా రూపొందుతాయి.
“చారిత్రక భావవాదపు దివాళా కోరుతనం” అన్న తన వ్యాసంలో మావో చాలా నిశితంగా చెప్పారు.”చైనాలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నందు వల్లనే మార్క్సిజం- లెనినిజం అక్కడ గట్టిగా కాలూన గలిగింది. చైనా ప్రజల విప్లవ కార్యాచరణతో అది గట్టిగా ముడిపడి ఉంది. చైనా ప్రజలు దాన్ని ఆకలింపు చేసుకున్నారు. ఏ సిద్ధాంతం అయినా సరే చివరకు మార్క్సిజం-లెనినిజం అయినా సరే వాస్తవ పరిస్థితులతో ముడిపడి ఆ అవసరాలు తీర్చగలిగి, ప్రజలు ఆకలింపు చేసుకో గలిగితేనే ప్రయోజనం. లేకపోతే దండగ. మనం చారిత్రక భౌతిక వాదులం. భావవాదులం కాదు.” మావో మాటలు చారిత్రక భావవాదాన్ని ఇలా తుత్తునియలు చేశాయి.
మొట్టమొదట విప్లవంలో పాల్గొని బాగా పేరు పొందిన వీరులు చరిత్రలో చాలామంది ఉన్నారు. కానీ తరువాత వాళ్లు ప్రజలకు దూరమై ఓడిపోయారు. జనం వాళ్ళని ఎప్పుడూ తలవరు కూడా.
బూర్జువా విప్లవకారుల్లో అలాంటి వాళ్లు మరీ చాలామంది ఉన్నారు. ఫ్రెంచి విప్లవం అప్పుడు రాబర్ట్ పెరి బాగా వెలుగులోకి వచ్చాడు. విప్లవం తొలి రోజుల్లో ప్రజల అవసరాలు తీర్చడానికి కొంత పాటుపడ్డాడు. అందువల్ల ప్రజల మద్దతు వారికి లభించింది. అందుకే లూయీ రాజును వాళ్ళు ఊచకోత కోయగలిగారు. కానీ రాబర్ట్ పెరి బూర్జువా విప్లవకారుడు మాత్రమే. విప్లవం విజయం పొందగానే అతను జనాన్ని ఖాతరు చేయడం మానేశాడు. అంతేకాదు వాళ్లను అణగదొక్కాడు. అందువల్ల అతను ప్రజల మద్దతు కోల్పోయి చివరకు విప్లవ ప్రతీఘాతకులను ఎదిరించలేక పోయాడు. చివరకు విప్లవ ప్రతీఘాతకుల చేతుల్లో తానే బలైపోయాడు. అలాగే చాంగ్ తై యేన్ 1911 చైనా విప్లవంలో అతన్ని ఎన్నోసార్లు వేటాడారు. మూడుసార్లు జైల్లో పెట్టారు. అయినా అతని ఉత్సాహం చల్లారలేదు. కొంతకాలం అతను గొప్ప పాత్ర నిర్వహించాడు. ప్రజల్లో మంచి పలుకుబడి కూడా ఉండేది, కానీ విప్లవం తరువాత సమాజానికి జనానికి దూరమైపోయి విప్లవ చేవ చచ్చిపోయి కాలగర్భంలో కలిసి పోయాడు. జనం అతని సాంతం మర్చిపోయారు.
బూర్జువా విప్లవకారుల ఈ లక్షణం వారి వర్గ స్వభావం బట్టి నిర్ణయమవుతుంది. భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ఇద్దరూ కలిసి పోరాడేప్పుడు కూడా బూర్జువాలకు కష్టజీవులకు మధ్య ఎంతో తేడా ఉండేది. విప్లవం జరుగుతున్న కాలంలో బూర్జువాలు వాళ్ల వర్గ ప్రయోజనాలకే పరిమితం అయ్యేవారు. జనాన్ని చూసి బెదిరే వారు, ఊగిసలాడేవారు శత్రువుని బుజ్జగించేవారు, జనాన్ని దగా చేసేవారు.
ప్రజలతో వారి శత్రుత్వం చాలా ప్రధానమైనట్టిది. రాజకీయాధికారం వాళ్లు గుంజుకున్నాక, ఇది మరింత తేటతెల్లమయింది. అందుకనే 18, 19 శతాబ్దాల్లో బూర్జువా ప్రతినిధులు విప్లవాలు నడిపినా, జనం అందులో బలమైన శక్తులుగా ఉన్నారు.
బూర్జువా ప్రజాస్వామ్య విప్లవంలో తాత్కాలికంగా నైనా వారి ఆశయాలు నెరవేరాలంటే బూర్జువా నాయకులు ఏదో మేరకు జనం మీద ఆధారపడక తప్పదు. అలా కాకపోతే శత్రువు పరాజయం చెందడు. అలాగే శ్రామిక విప్లవంలో కూడా మొదట్లో మనకు చాలామంది సహాయ పడతారు. విప్లవం ఒక దశకు చేరగానే ఆగిపోతారు. అంతేకాదు రంగు మార్చేస్తారు కూడా. వీళ్లు బూర్జువా విప్లవకారులు. బూర్జువా విప్లవ నాయకులు. ప్రజలకు చరిత్ర ప్రవాహానికి అభివృద్ధికి అడ్డుగోడలు. చరిత్ర ముందుకు పోవాలంటే ప్రజలు ఇలాంటి నాయకులను కూలదోయాలి.
ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, చరిత్ర నిర్మాతలు వీరులు కాదు. చరిత్ర వీరులను తయారుచేస్తుంది. చరిత్ర నిర్మాతలు, ఉమ్మడిగా వీరులు ప్రజలు కూడా కాదు. కేవలం ప్రజలు మాత్రమే చరిత్ర నిర్మాతలు.
శ్రామికవర్గ నాయకుల పాత్ర:
మానవజాతిలో పురోగామి విప్లవాత్మక వర్గానికి నాయకత్వం వహించేవారు శ్రామిక నేతలు. శ్రామిక నాయకులకు ఇతర వర్గాల నాయకులకు ఉన్న పెద్ద తేడా ఇదే. కార్మికుల కష్టజీవుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజానీకంతో సంబంధాలు పెట్టుకుంటూ, ప్రజా పోరాటాల నుంచి అనుభవాలు గడిస్తారు. చారిత్రక అభివృద్ధి సూత్రాలు తెలుసుకుంటూ మార్క్సిజంను బాగా వంట పట్టించుకుని విప్లవ కార్యాచరణలో రాటు దేలుతారు. అందువల్ల వారు బాగా దూరదృష్టి గలవారు. మామూలుగా అన్ని వర్గాల నాయకులు లాగా వీరికి పరిమితులు లేవు. కనుక కార్మిక నాయకులు చరిత్ర నిర్మాతలైన ప్రజల పాత్రను పూర్తిగా రంగం మీదకు రప్పించగలుగుతారు. సుదీర్ఘ విప్లవ పోరాటాల్లో రాటుదేలడం వల్ల వారికి ప్రజల్లో గౌరవ ప్రతిష్ఠలుంటాయి. అయితే, శ్రామిక విప్లవంలోనైనా నాయకులు ప్రజలు కలిసి చరిత్ర నిర్మిస్తారనడం సరైనదేనా? కాదు. శ్రామిక నాయకులు కేవలం ప్రజల కార్మికుల కార్య కలాపాలు నిర్వహించే వారే. నాయకులు రంగం మీదకు రావడం వారి ఆలోచనా ధోరణి చరిత్ర గతిలో చాలా గొప్పది. ముఖ్యమైనది కూడా. ఆచరణ అనే తన రచనలో మావో చెప్పాడు కూడా. విప్లవాన్ని గురించిన మార్క్సిస్టు సిద్ధాంతం విప్లవ పోరాటాల ఆచరణ రెండో దశకు చేరుకున్నాకే రూపొందింది. పూర్తి చైతన్యంతో నిర్మాణాత్మకంగా ఆర్థిక రాజకీయ పోరాటాలు చేపట్టిన దశ అదే. ప్రజలే చరిత్రలో చోదక శక్తి అనే మార్క్సిస్టు అవగాహన శ్రామిక నాయకుల చారిత్రక పాత్రను గుర్తిస్తుంది. లీషా వ్ చీ వగైరాలు, నాయకులు ప్రజలు కలిసి చరిత్రను నిర్మిస్తారు అని అంటున్నారంటే, దాని అర్థం నాయకులు ప్రజలకు అతీతంగా ఉంటారని వాళ్ల భావన. వాళ్లకు మనకు ప్రధానమైన తేడా ఇదే. ప్రజలే చరిత్ర నిర్మాతలని మార్క్సిజం చెబుతుంది. అయితే ప్రజా ఉద్యమాలు వాటంత అవే పెల్లుబుకు తాయని దీని భావం కాదు. లీషావ్ చీ వగైరాలు చారిత్రక భావవాదాన్ని ప్రచురం చేస్తూ, వీరులే చరిత్ర నిర్మిస్తారని చెబుతూ ప్రతీ ప్రజా ఉద్యమం సబబైన దేనని చెబుతున్నారు. ఉద్యమాలు వాటంతటవే వస్తాయనే మాట మరో రూపంగా చెప్పడం అంటే ఇదే. ప్రజలే చరిత్ర నిర్మాతలని చెప్పే చారిత్రక భౌతిక వాదానికి, దీనికి చుక్కెదురు. సరైన నాయకత్వం సరైన పంథా లేకుండా ఏ ప్రజా ఉద్యమమూ ఎక్కువ కాలం సాగలేదు. ఏమీ సాధించలేదు. దోపిడీ వ్యవస్థను కూకటి వేళ్ళతో పెకలించి వేసేదే శ్రామిక విప్లవం. ఇంతకుముందు ఏ విప్లవంతోనూ దీన్ని పోల్చలేము. అన్నింటికన్నా ఇది గాఢమైంది. ఇది విశాలమైంది. అందుకే ఈ విప్లవానికి మరింత గట్టి నాయకత్వం సరైన పంథా అవసరం. సవ్యమైన సైద్ధాంతిక రాజకీయ పంథాయే ప్రతి దాన్ని నిర్ణయిస్తుంది. చైనా విప్లవ చరిత్ర చూస్తే అటు అతివాద, ఇటు మితవాద పెడ ధోరణులకు వ్యతిరేకంగా మావో సరైన పంథాను ఎలా రూపొందించాడో తెలుస్తుంది. మావో పంథా లేకుండా, చైనా విప్లవం విజయవంతం అయి ఉండేది కాదు. శ్రామిక విప్లవ దశలో దానంతటకు అదే ఉద్యమం విస్తరణ చెందడం అంటే, శ్రామిక వర్గ నాయకత్వ పాత్రను నిరాకరించడమే. ప్రజా ఉద్యమాన్ని పక్కదారిలో పట్టించేది ఇలాగే. చరిత్ర గతిలో ప్రజలు క్రమక్రమంగా చైతన్యవంతులయ్యారు. చారిత్రక భౌతిక వాదం సామాజిక చారిత్రక అభివృద్ధి సూత్రాలను గొప్పగా పసికట్టింది. ప్రజల పాత్రను రంగం మీదకు తెచ్చింది. ప్రజలు తడుముకోకుండా ఒక తీరు-తెన్నూ చూపించింది. మావో అన్నాడు: మానవజాతి చైతన్యంతో తనను, ప్రపంచాన్ని మార్చుకున్నప్పుడే ప్రపంచ కమ్యూనిస్టు యుగోదయం జరుగుతుంది. ఆరోజు రావాలంటే విప్లవం విజయం పొందాలంటే, శ్రామిక వర్గ నాయకత్వం కింద ప్రజలు మరింత గట్టిగా దీక్షగా పోరాడాలి. జనం మీద మనం విశ్వాసం ఉంచాలి. వాళ్ళ చొరవను గౌరవించాలి. అదే సమయంలో నిరంతరం మార్క్సిజం-లెనినిజం చైతన్యాన్ని ప్రజలకు కలిగించాలి. లెనిన్ చెప్పాడు: వర్గంలో పురోగామి భాగమే పార్టీ. ప్రజలను నడపడమే దాని కర్తవ్యం. అంతేగాని యాంత్రికంగా ప్రజల భావాలను క్రోడీకరించడం కాదు. ప్రజలే చరిత్ర నిర్మాతలన్న మార్క్సిస్టు సూత్రానికి కట్టుబడి, పార్టీ నాయకత్వాన్ని అనుసరించితే, విప్లవ పథంలో మనకు విజయ పరంపరలు చేకూరుతాయి.




