పల్లె నుంచి పట్నం దాకా దాదాపు అన్ని నగదు లావాదేవీలు ఇప్పుడు డిజిటల్ పద్ధతిలోనే జరుగు తున్నాయి. అది రూపాయి అయినా వేల రూపాయ లైనా సరే.. స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు చిటికెలో చెల్లింపు జరిగిపోతోంది. అదీ ఎలాంటి చార్జీ లేకుండా. కానీ ఇప్పుడా పరిస్థితి మారనున్న‌ది. డిజిటల్ పద్ధతిలో సులువుగా చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పిస్తున్న యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) విధానం ఇకపై ఆర్థికంగా భారం కానుంది. ఇప్పటివరకు ఉచితంగా కొన సాగుతున్న ఈ సర్వీసు మీద చార్జీలు విధించటానికి స‌న్నాహాలు జ‌రుగు తున్నాయి. యుపిఐ చెల్లింపుల పై ఫీజులు విధించడానికి బ్యాంకులు, పేమెంట్ సిస్టం ప్రొవైడర్స్‌ని అనుమతించేలా ప్రభుత్వానికి అధి కారమిచ్చే చట్టసవరణను ఆగష్టు 6న లోక్‌సభ ఆమోదించింది. యుపిఐ వ్యవస్థ నిర్వహణ భారం తడిసి మోపెడవుతోందని, చార్జీలు వసూలు చేసుకునేందుకు వీలు కల్పించాలంటూ బ్యాంకులు, పేమెంట్ ప్రాసెసర్లు చాన్నాళ్లుగా అడుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఆ మేరకు వ‌సూలు చేసుకొనేందుకు వీలు క‌ల్పిస్తూ చర్యలు చేపట్టింది. అందరినీ డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించే లక్ష్యంతో ముందుగా యుపిఐ ఉచితమనే తాయిలం చూపించిన ప్రభుత్వం.. దాదాపుగా దేశమంతా దానికి అలవాటు పడ్డాక ప్లేటు ఫిరాయించటం ద్రోహ‌పూరితం.

      ప్రపంచవ్యాప్తంగా అత్యంత విజయవంతమైన ఈ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ యుపిఐను కూడా కేంద్ర ప్రభుత్వం తన ఆదాయ మార్గంగా మార్చేందుకు పావులు కదుపుతున్నది. సామాన్యుడి నడ్డి విరిచేందుకు మరోసారి సిద్ధమవుతున్నది. ‘పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు-2026’ ఈ పరిస్థితిని మార్చే దిశగా అడుగు వేసింది. ఇప్పటివరకు యుపిఐ వంటి డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండి ఆర్) లేదా ఇతర సేవా రుసుములు విధించకుండా అడ్డుకుంటున్న చట్టపరమైన నిబంధనను తొలగించింది. ఈ అవరోధం తొలగిపోవడంతో బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, డిజిటల్ చెల్లింపు సంస్థలు యుపిఐ లావాదేవీలపై రుసుములు వసూలు చేయవచ్చు. ‘ప్రభుత్వం ఇప్పుడే ఛార్జీలు విధించడం లేదు’ అనే ప్రభుత్వ ప్రకటన కేవలం మ‌భ్య‌పెట్టేందుకు మాత్రమే. ఎందుకంటే చట్టం మారింది. ఇప్పటి వరకు ప్రజలకు ఉన్న హక్కు ఇప్పుడు ప్రభుత్వ అనుమతిపై ఆధారపడే సౌకర్యంగా రూపాంతరం చెందింది. ఇక మీదట రూ.2 వేల వరకు చెల్లింపులపై మినహాయింపు ఉండొచ్చని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. 

    యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యుపిఐ) లావాదేవీలతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఆధారిత చెల్లింపులపై బ్యాంకులు చార్జీలు విధించ బోతున్నాయి. ఈ మేరకు బ్యాంకులకు అధికారం కల్పిస్తూ పేమెంట్, సెటిల్‌మెంట్స్ చట్టం-2007లో కేంద్ర ప్రభుత్వం సవరణ చేసింది. సవరణ బిల్లును ఆగష్టు 6న లోక్‌సభలో ఆమోదించారు. ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ప్రస్తుతం యుపిఐ పేమెంట్లు ఉచితమే. గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌ల ద్వారా డబ్బులు పంపించినా లేక స్వీకరించినా ఎలాంటి రుసుములు వసూలు చేయడం లేదు. ఇకపై వీటికి రుసుములు కట్టాల్సిందే. బ్యాంకులు ఈ రుసుములు వసూలు చేస్తాయి. ఆర్‌టిజిఎస్, నెఫ్ట్ ద్వారా చేసే తక్షణ చెల్లింపులకు సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫైడ్ ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండిఆర్) వసూలు చేయకుండా బ్యాంకులు లేదా చెల్లింపు సేవా సంస్థలను నిరోధించే ప్రస్తుత చట్టపరమైన నిబంధనను తొలగించడమే ఈ సవరణ బిల్లు లక్ష్యంగా ఉంది. 

 ఇప్పటివరకు, చెల్లింపు, పరిష్కార వ్యవస్థల చట్టంలోని సెక్షన్ 10ఎ, 1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 269 ఎస్‌యు కింద ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించినందుకు ఎవరిపైనా ఛార్జీలు విధించకుండా బ్యాంకులను, చెల్లింపు సేవా ప్రదాతలను (పిఎస్‌పిలను) నిరోధించింది. అంతేకాకుండా, సెక్షన్ 269ఎస్‌యు ప్రకారం రూ.50 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపారాలు, రూపే డెబిట్ కార్డులు, భీమ్-యుపిఐ క్యూఆర్ కోడ్‌లతో సహా నిర్దిష్ట ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా చెల్లింపులను స్వీకరించాల్సి ఉండేది. అయితే ఇప్పుడు “చెల్లింపు, పరిష్కార వ్యవస్థల చట్టం 2007లోని సెక్షన్ 10ఎలో, ‘ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 269ఎస్‌యు క్రింద సూచించబడిన ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలు’ అనే పదాలు, అంకెలు, అక్షరాల స్థానంలో, ‘కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించ గల ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలు’ అనే పదాలను ఈ చట్టం అధికారిక గెజెట్‌లో ప్రచు రించబడిన తేది నుండి అమలులోకి వచ్చేలా ప్రతిక్షేపించాలి”, అని బిల్లు పేర్కొంది. అలాగే దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూట ర్లు, టాబ్లెట్లు, సర్వర్లు, వాటి కీలక భాగాలు, అనుబంధ పరికరాల వంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులను భారత దేశంలో ఉత్పత్తి చేయడానికి కాంట్రాక్ట్ తయారీదారులను నియమించుకునే విదేశీ కంపెనీలకు ఈ బిల్లు 2040-41 వరకు ఆదాయపు పన్ను మినహాయింపును పొడిగించింది.

ప్రభుత్వం యుపిఐ పేమెంట్స్ కు సంబంధించి 2 రకాల చార్జింగ్ మోడళ్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొదటి మోడల్ ప్రకారం, రూ. 2,000 కంటే ఎక్కువ ఉన్న యుపిఐ చెల్లింపులపై దాదాపు 0.25-0.5 శాతం వరకు యండిఆర్ వర్తించవచ్చు. అంటే ఇప్పటిదాకా ఫోన్ పే, గూగుల్ పే వంటి పద్ధతుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లించే వారిపై ఇక నుండి ఛార్జీలు ఉంటాయి. చిన్న లావాదేవీలు, వ్యక్తి నుండి వ్యక్తికి చేసే చెల్లింపులు మాత్రం ఉచితంగానే ఉంటాయి. రెండవ మోడల్ ప్రకారం, కోటి యాభై లక్షల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారులు స్వీకరించే  చెల్లింపులకు మాత్రమే ఛార్జీలు వర్తించవచ్చు. అంటే నెలకు 12 లక్షల కంటే ఎక్కువ వ్యాపారం చేసే దుకాణాలలో మనం యుపిఐ ద్వారా చెల్లిస్తే మనం కొన్న సరుకుల బిల్లుకు అదనంగా ఛార్జీలు వర్తిస్తాయన్న మాట. ఈ రుసుమును అధికారికంగా  వ్యాపారస్తులే భరించాల్సి ఉంటుంది.

భవిష్యత్‌లో ఎలక్ట్రానిక్ పేమెంట్లపై ఛార్జీలు వసూలు చేస్తారు. ఏ తరహా పేమెంట్‌పై ఎంత ఛార్జీ అనేది నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్తారు. బ్యాంకులకు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ కు, పేమెంట్స్ విధానాన్ని నిర్వహించే సంస్థలకు స్థిరమైన ఆదాయం అందాలనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చినట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులకు మాత్రమే వ్యాపార సంస్థలు పరిమిత ఫీజు చెల్లిస్తున్నాయి. దీంతో ప్రజలు మళ్లీ ఎటిఎంల చుట్టూ తిరగాల్సి వస్తుందని, చిల్లర సమస్య సైతం తరుముకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండిఆర్ అమలులోకి వస్తే సగం మందికి పైగా వినియోగదారులు అధిక విలువ కలిగిన లావాదేవీలకు యుపిఐని వాడటం మానేయవచ్చునని ఇటీవల 322 జిల్లాల్లో జరిగిన ఒక సర్వేలో తేలింది. ఆ పరిస్థితే వస్తే, అది డిజిటల్ ఇండియా లక్ష్యాల సాధనకు విఘాతమవుతుంది.

     బ్రెజిల్‌పై సైతం అమెరికా ఈ మాదిరి ఒత్తిడే తెచ్చినా అది అంగీకరించలేదని కూడా చెబుతున్నారు. వాటి నిజానిజాల సంగతలా ఉంచి, ప్రభుత్వం చెప్పే కారణాలు మాత్రం ఎప్పటినుంచో వింటున్నవే. యుపిఐ వ్యవస్థ నిర్వహణ తడిసిమోపెడు భారమవుతున్నదని బ్యాంకులూ, పేమెంట్ ప్రాసెసర్లూ గగ్గోలు పెడుతుండటం వల్ల ఇది తప్పడం లేదట! అందువల్లనే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యుపిఐ) ద్వారా జరిగే డిజిటల్ చెల్లింపులపై ఇప్పటివరకు ఉన్న ఉచిత విధానానికి మోడీ సర్కార్ స్వస్తి చెప్పాలని నిర్ణయించింది.

ఎవరి ప్రయోజనాల కోసం ఈ బిల్లు :

యుపిఐ సేవలు ప్రారంభమైన తర్వాత డెబిట్, క్రెడిట్ కార్డుల స్థానంలో ఉచిత యుపిఐ చెల్లింపు లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. దీంతో వీసా, మాస్టర్‌కార్డ్ వంటి అమెరికా కార్డు నెట్‌వర్క్‌లకు లభించే ఫీజు ఆధారిత వ్యాపార అవకాశాలు తగ్గుతున్నాయి. మరోవైపు దేశీయ కార్డు నెట్‌వర్క్ రూపేకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడం, రూపే క్రెడిట్ కార్డులను యుపిఐతో అనుసంధానించడం కూడా అమెరికా అభ్యంతరాలకు కారణమయ్యాయని స్పష్టమవుతోంది. భారతదేశపు యుపిఐ మార్కెట్‌లోనూ అమెరికా సంస్థలైన గూగుల్ పే, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫోన్‌పే ఇప్పటికే 80 శాతానికి పైగా లావాదేవీలను నియంత్రిస్తున్నాయి. ఏ ఒక్క యాప్ కూడా 30 శాతానికి మించి మార్కెట్ వాటా కలిగి ఉండకూడదన్న ఎన్‌పిసిఐ నిబంధనను కూడా కలిగి ఉండకూడదన్న ఎన్‌పిసిఐ నిబంధనను కూడా అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ నిబంధన అమలును ప్రభుత్వం డిసెంబర్ 2026 వరకు వాయిదా వేస్తూ వచ్చింది. దీనికి తోడు డేటా లోకలైజేషన్ నిబంధనలను కూడా అమెరికా కంపెనీలు తప్పుబడు తున్నాయి.

వినియోగదారులపై అదనపు భారం :

ఈ యుపిఐ సవరణ బిల్లు ద్వారా వినియోగదారులు, చిన్న వ్యాపారాల కోసం డిజిటల్ చెల్లింపు సేవలపై రుసుము విధించడంతో పాటు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను నడిపించే బ్యాంకులు, చెల్లింపు సేవా ప్రదాతలు, చెల్లింపు మౌలిక సదుపాయాల సంస్థలకు స్థిరమైన ఆదాయం వచ్చేలా చేయడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి సెక్షన్ 269 ఎస్‌యు కింద నిర్దేశించిన ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలను ఉపయోగించినందుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి రుసుము విధించడం లేదు. బిల్లు చట్టంగా మారిన తర్వాత ఇలాంటి చెల్లింపులపై బ్యాంకులు ఛార్జీలు విధించబోతున్నాయి. వినియో గదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. తక్షణమే వర్తించకపోయినా భవిష్యత్తులో ఎప్పుడైనా యుపిఐ లావాదేవీలపై రుసుము వసూలు చేసేందుకు ఈ బిల్లు అధికారమిస్తోంది. ఫీజంటూ వసూలు చేస్తే రూ.2,000కు మించిన లావాదేవీలపై, అది కూడా వార్షిక టర్నోవర్ కోటిన్నర మించే వ్యాపారులకే వర్తిస్తుందని సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. విధించబోయే ఫీజు కూడా ఒక్కో లావాదేవీ కి 0.25 శాతం లేదా 0.5 శాతం ఉండొచ్చన్నది మరో మాట. దీనివల్ల మళ్లీ నగదు లావాదేవీలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుపిఐ చెల్లింపుల వంటి ప్రజా మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి అవసరమని, దానికి ఎవరో ఒకరు రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.

పదేళ్ల కిందట ఉనికిలోకి వచ్చిన యుపిఐ- మహానగరాల నుంచి మారుమూల పల్లెల వరకు అన్ని వర్గాల ప్రజలకూ చేరువైంది. ఈ క్రమంలో మొన్న జూన్ నాటికి దేశవ్యాప్తంగా యుపిఐ వినియోగదారుల సంఖ్య 55.49 కోట్లకు చేరింది. అయిదేళ్లలోనే యుపిఐ లావాదేవీల పరిమాణం 425 శాతం పెరిగింది. కిందటి ఆర్థిక సంవత్సరంలో వాటి సంఖ్య 24 వేల కోట్లకు పైబడింది. 2021-22లో రూ.84 లక్షల కోట్లుగా ఉన్న యుపిఐ లావాదేవీల విలువ 2025-26లో సుమారు రూ.314 లక్షల కోట్లకు చేరింది. అలవాటు చేసినట్లే చేసి, దాన్నుంచి కూడా ఆదాయం పొందాలనుకోవటం సరికాదు. ప్రస్తుతం దేశంలో డిజిటల్ లావాదేవీల వినియోగదారుల సంఖ్య 50 కోట్లని చెబుతున్నారు.  దేశీయ డిజిటల్ చెల్లింపుల్లో యుపిఐ వాటా 85 శాతం అయినప్పటికీ, వాటిలో చిన్న మొత్తాల బట్వాడాలే ఎక్కువ. లెక్కకుమిక్కిలిగా జరుగు తున్న ఆ చెల్లింపులను సజావుగా పూర్తిచేయడానికి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు సర్వర్లూ నెట్‌వర్క్ నిర్వహణ, సైబర్ భద్రతా ఖర్చులు బాగా అవుతున్నాయం టున్నారు. ఎండిఆర్ రూపంలో తమపై పడే భారాన్ని వస్తువుల ధరల పెంపు ద్వారా వినియోగదారులపై మోపడానికి బడా వ్యాపారులు ప్రయత్నించవచ్చు. లేదంటే నగదు లావాదేవీలపై మొగ్గుచూపవచ్చు. అదే జరిగితే నల్లధనం, పన్ను ఎగవేతల ముప్పు తీవ్రతరమవుతుంది.  

ముగింపు :

ఈ బిల్లును చర్చ లేకుండానే లోక్‌సభ ఆమోదించడం ఆందోళన కలిగించే అంశం. కోట్లాదిమంది ప్రజల రోజవారీ ఆర్థిక జీవితాన్ని ప్రభావితం చేసే మార్పుపై విస్తృత చర్చ జరగాలి. వినియోగదారుల సంఘాలు, చిన్న వ్యాపారుల ప్రతినిధులు, బ్యాంకింగ్ నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోవాల్సింది. అలాంటి ప్రజా చర్చ లేకుండా తీసుకున్న నిర్ణయాలు తరువాత పెద్ద సామాజిక వ్యతిరేకతకు దారితీ స్తుంది. ప్రజలకు ఉచితంగా, అందరికీ సమానంగా అందుబాటులో ఉన్న యుపిఐని ఆదాయ వనరుగా మార్చే ప్రతి ప్రయత్నాన్ని ప్రజలు అప్రమత్తంగా గమనించాలి. ఈ రోజు చిన్న రుసుముతో ప్రారంభమ య్యే మార్పు, రేపు ప్రతి డిజిటల్ లావాదేవీపై కొత్త భారంగా మారే ప్రమాదం ఉందని గ్రహించాలి. సాంకే తిక పురోగతి పేరుతో ప్రజలపై కొత్త ఆర్థిక భారం మోపడం అభివృద్ధి కాదు.

నిజానికి యుపిఐ లావాదేవీల వ్యయాల భారంలో కొంత భాగాన్ని బ్యాంకులు, పేమెంట్ ప్రాసెసర్లు భరిస్తుండగా, మిగతాదంతా ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తోందని, ఇదంతా పన్ను చెల్లింపుదారుల సొమ్మేనని నిపుణులు చెబుతున్నారు. ఈ భారం ఏటా దాదాపు రూ.20 వేల కోట్లు ఉంటుందని అంచనా. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు ఆ వ్యవస్థను పోషించడానికి అదనపు మూల్యం చెల్లించే పరిస్థితి రాకూడదు. అందుకే యుపిఐపై రుసుములు విధించే అవకాశాన్ని కల్పించిన ఈ చట్ట సవరణను ప్రభుత్వం పునఃపరిశీలించాలి. డిజిటల్ భారత్ విజయగాథను ఖర్చుతో కూడిన సేవగా మార్చకుండా కాపాడుకోవడం ఇప్పుడు ప్రజాస్వామ్య బాధ్యతగా మారింది.

యుపిఐ, రూపే వంటివి ఉచిత సేవలు అందించటం వల్ల తమ వీసా, మాస్టర్‌కార్డ్ వగైరా ప్లాట్ ఫామ్‌లు ఎదగటంలేదన్న అమెరికా ఆక్రోశమే తాజా నిర్ణయానికి కారణమనే విమ‌ర్శ‌లున్నాయి. గత దశాబ్దకాలంలో బ్యాంకింగ్ సేవల చార్జీలు, కనీస మొత్తం ఖాతాలో లేదన్న కారణంతో వసూలు చేసే ఫెనాల్టీ, పరిమితికి మించిన లావాదేవీలపై చార్జీలు, ఎస్ఎంఎస్ సందేశాలకని, డెబిట్ కార్డు నిర్వహణ వ్యయమని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ చాలకనా ఈ కొత్త ఆలోచనలు! ఎంతో వెసులు బాటుగా, ఉపయోగకరంగా ఉన్న ఈ లావాదేవీలు మరింత విస్తరించాల్సిన తరుణంలో వాటిని నిరుత్సా హపరిచేలా, జనం మళ్లీ నగదు వైపు మొగ్గేలా చేయటం ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోస‌మో అర్థ‌మ‌వుతూనే ఉన్న‌ది. భారత ప్ర‌జ‌ల‌ దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడాల‌నే ఏమాత్రం నిబ‌ద్ధ‌త ఉన్నా కేంద్ర ప్ర‌భుత్వం  ఎండిఆర్ విషయంలో  ఆచితూచి అడుగులు వేయాలి. సేవా చార్జీలు వ‌సూలు చేసే విధానానికి స్వ‌స్తి చెప్పాలి.

Leave a Reply