మే 16,2026 న సిజెపి ఆవిర్భావం తర్వాత తొలిసారి జూన్ 6 న డిల్లీ లో దాదాపు 30 వేల మందితో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా జరిగింది. దీన్ని అనుసరిస్తూ ఓ పది రోజుల పాటు దేశంలోని ముఖ్యమైన పట్టణాలు ప్రదర్శనలు సభలు సమావేశాలతో హోరెత్తిపోయాయి. తమ అవగాహన, డిమాండ్లను ప్రచారం చేస్తూ యువత తమను తాము చెక్ చేసుకుంటూ హిందూత్వ ఫాసిస్టు పాలకుల పై తీవ్రమైన అసంతృప్తితో రగిలి పోయారు. ఇప్పటి వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బద్ధలై దేశంలో ఎటు చూసినా పోరాట వాతావరణం నెలకొంది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు, పార్టీలు, సంస్థలు ఈ యువత ఆందోళనల పై అనుమానాలు వ్యక్తం చేస్తే దేశంలోని వివిధ వైరుధ్యాలు తీవ్రతరమౌతున్న తీరు సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న కొద్ది మంది ప్రజానుకూల శక్తులు, మేధావులు ఏదో మేరకు ఉద్యమం పెల్లుబుకే అవకాశం ఉందని గ్రహించారు. అది పక్కదారి పట్టకుండా, ఎవరి కుట్రలకో బలికాకుండా సాగాలని ఆశించారు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం బ్రద్దలౌతుందని, అన్ని కులాల,వర్గాల మద్ధతుతో ప్రభుత్వ మెడలు వంచి విజయం సాధిస్తుందని ముఖ్యంగా సంక్షోభంలో కూరుకుపోయిన సమాజాన్ని, భయకంపితులైన ప్రజలను ఈ నవ యువత తట్టి లేపి పోరాటం మార్గంలో పెడుతుందదని అంచనా వేయలేకపోయారు. ప్రభుత్వ క్రూరమైన అణచివేత, దుష్ప్రచారం, కుట్రలను అధిగమించి డిల్లీ ధర్నా విజయవంతం అయిన తరువాత సిజెపి నాయకత్వం దేశ వ్యాప్త ప్రతినిధులతో సమావేశమై ఉద్యమ పరిస్థితి భవిష్యత్తు కర్తవ్యాల నిర్వాహహణకు గాను ఒక కమిటీని ఎన్నుకున్నారు, పని విభజన చేసుకొని బాధ్యతలను సమష్టిగా పంచుకున్నారు. ఈ సందర్భంగా జెన్ జీల నాయకుడు అభిజిత్ దీప్కే మీడియా తో మాట్లాడుతూ “రాజకీయ పార్టీలు, సంస్థలు దర్యాప్తు ఏజెన్సీల పట్ల దేశంలోని యువతలో ప్రజల్లో అపనమ్మకం పెరుగుతుంది. ప్రజాస్వామిక సంస్థల పై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఈ మార్పు ఎన్నికల రాజకీయాల ద్వారా రాదు. విస్తృత ప్రజానీకం భాగస్వామ్యంతో జరిగే ఉద్యమాలతోనే సాధ్యమౌతుంది. తాము విద్యా రంగానికే పరిమితం కాబోమని, దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, ఆర్థిక అంతరాలు వంటి ఇతర అంశాల మీద కూడా దృష్టి పెడతాం. ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించే బదులు ప్రజా ఉద్యమ వేదికగానే సీజేపి కొనసాగుతుంది” అని ప్రకటించాడు. తక్షణ కార్యక్రమంగా విద్యా వ్యవస్థను మెరుగు పరచడానికి నవతరాన్ని మేల్కోల్పడానికి ‘స్కూల్ టీక్ కరో’ అనే నినాదంతో మహానగరాలు, గ్రామాలు, ఆడవులలోని పాఠశాలలను సందర్శించి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు కృషి చేస్తున్నారు. సిజెపి అవగాహన ప్రకటనలు, పోరాట కార్యక్రమం ఆర్ ఎస్ ఎస్ – బిజెపి నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేయడంతో తమ హిందూత్వ ఫాసిస్టు భావజాలం-భౌతిక దాడులు- సామాజిక అణచివేతతో కూడిన కౌంటర్ దాడితో దేశ యువత పై యుద్ధాన్ని ప్రారంభించారు‌.

ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా సిజెపి కేడర్లపై భౌతిక దాడులకు దిగుతున్నారు. ప్రభుత్వాధికారాన్ని అడ్డం పెట్టుకుని విద్యా సంస్థల్లోకి అడుగు పెట్టకుండా ఆర్డర్లు జారీ చేసి పాఠశాలల దుస్థితిని అధ్యయనం చేయకుండా అడ్డుకుంటున్నారు. పంద్రాగస్టు సందర్భంగా మోదీ చేసిన ఉపన్యాసంలో దేశ ప్రజలను ముఖ్యంగా యువతను మభ్యపెట్టి భయపెట్టే అనేక అంశాలను నిస్సిగ్గుగా ప్రకటించారు. అందులో మొదటిది దిమాగీ నక్సల్స్ అణచివేత. రెండవది బలమైన శక్తి వంతమైన వాలంటరీ యంత్రాంగం/ ప్రైవేటు సైన్యం నిర్మాణం. వీటికి తోడుగా అప్రకటితంగా రిజర్వేషన్ అనే కీలకాంశం పై తమ కాషాయ మూకను ఉసిగొల్పి రిజర్వేషన్లు రద్దు చేయాలనే డిమాండ్ తో ఇన్ స్టాగ్రామ్ ను ప్రారంభించి అభిప్రాయ సేకరణకు పూనుకున్నారు. జంతర్ మంతర్ వద్ద జూన్ 20 న ప్రారంభమై ధర్నా జూలై 20 పార్లమెంట్ వద్ద మార్చ్ తో విజయం సాధించడం, ఆ తర్వాత విద్యా రంగ ప్రక్షాళనకై మరో ఉద్యమాన్ని ప్రారంభించి కుల, మతాలకు అతీతంగా ఐక్యంచేస్తూ జెన్ జీ నే గాక జెన్ ఆల్ఫాను కూడా పెద్ద ఎత్తున కదిలిస్తుండడంతో భీతిల్లిన సంఘ్ పరివార్ యువతలో చీలికను సృష్టించడం కోసం మరోసారి అగ్రకులతత్వాన్ని, అహంకారాన్ని, హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే లక్ష్యంతో రిజర్వేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ నిర్మాణానికి ప్రయత్నిస్తుంది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన హర్షత్ దూబే అనే వ్యక్తి ద్వారా రిజర్వేషన్ హటావో ఆందోళన్ (ఆర్ హెచ్ ఏ) పేరుతో ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఉద్యమాన్ని ప్రారంభించింది. రణవీర్ సేన, కర్ణిసేన, అఖిల భారత క్షత్రియ మహాసభ, కాళీసేన మొదలగు అగ్రవర్ణ సంస్థల మద్దతుతో ఆగస్టు 21 న జంతర్ మంతర్ వద్ద ధర్నా ప్రారంభించారు. వీరు దేశ ప్రజల పై విషం కక్కుతూ కుల ఆధారిత రిజర్వేషన్ల రద్దు, రిజర్వేషన్ల పై శ్వేత పత్రంతో పాటు రిజర్వేషన్లతో సంబంధమేలేని ఎస్ సి, ఎస్ టి (అత్యాచారాల నిరోధక) చట్టం రద్దు, యూజిసి ఈక్విటీ నిబంధనలలో మార్పులు, ఆర్ధికంగా బలహీన వర్గాలకు మెరుగైన ప్రయోజనాలు మొదలగు హిందూత్వ డిమాండ్లను ప్రదర్శించారు. వీరితో తెరవెనకుండి ఆడిస్తున్న ఆర్ ఎస్ ఎస్ – బిజెపి ప్రభుత్వం ఆగస్టు 7 న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డాను పంపించి చర్చలను జరిపింది. ఈ అగ్రవర్ణ సంస్థ పెట్టిన డిమాండ్లలో అంగ వైకల్యం మరియు అమరవీరుల పిల్లలకు విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్, ఇతర ప్రయోజనాలు కల్పించాలనే డిమాండ్ ఇప్పటికే అమలు జరుగుతుంది. ఈ డిమాండును పునర్ధాటించడంలో వీరి ఉద్దేశం ప్రజలను పక్కదారి పట్టించడమే. ఎస్ సి ఎస్ టి అత్యాచారాల నిరోధక చట్టం రిజర్వేషన్లతో సంబంధం లేనిది. ఆర్ధికంగా బలహీనులైన వారికి రిజర్వేషన్లు అనే డిమాండ్ అగ్రకులాల జనాభాకు మించి పది శాతం రిజర్వేషన్లు అమలు జరుపుతామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాగా సర్వ రంగాలు ప్రైవేటీకరించబడుతూ ఉద్యోగాలు, ఉపాధి, రిజర్వేషన్ అవకాశాలు తగ్గిపోతున్న సందర్భంలో ఈ ఆర్ హెచ్ ఏ రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఉద్యమం యొక్క అసలు లక్ష్యం అగ్రకులాల పేదలను ఉద్ధరించడానికి గాక ఉద్యమిస్తున్న దేశ యువతను ప్రతీఘాతుక ఎత్తుగడలతో కుల, మత ప్రాతి పదికన చీల్చి దెబ్బతీయడం, తమ ఫాసిస్టు ఎజెండాకు అనుకూలంగా యువతను పునః సంఘటితం చేసుకోవడమని స్పష్టమౌతుంది.

రిజర్వేషన్ల రద్దు ఉద్యమం ఈనాటిది కాదు.

రిజర్వేషన్లకు ఎంత చరిత్ర ఉన్నదో వాటి వ్యతిరేకతకు కూడా అంతే చరిత్ర ఉన్నది. నిచ్చెన మెట్ల కులాలతో కూడిన మన సామాజికార్ధిక వ్యవస్థ వేల సంవత్సరాలుగా మెజారిటీ ప్రజలను పశువుల కంటే హీనంగా, అంటరానివారిగా చూసింది. ప్రత్యేకమైన, విలక్షణమైన ఈ కుల పరమైన అణచివేతే రిజర్వేషన్లకు మూలం. ఇటువంటి కులాధారిత భూస్వామ్య వ్యవస్థలోకి వ్యాపారం పేరుతో ఈస్ట్ ఇండియా కంపెనీ చొరబడిన కాలంలో పీడిత కులాల పై అన్ని రంగాల్లో బ్రాహ్మణుల నిషేదం కొనసాగుతుండేది. ముఖ్యంగా విద్యాభ్యాసం పై కఠినమైన ఆంక్షలుండేవి. 1885 లో వలసవాదులు ఇక్కడి కుల వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని తన అవసరాల కోసం అణచబడ్డ కులాలకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. 1919 లో మాంటేగ్-చేమ్స్ ఫర్డ్ సంస్కరణల పేరుతో అణచివేతకు గురవుతున్న అణగారిన కులాలకు ప్రత్యేక రక్షణ చర్యలు సిఫార్సు చేసింది. ఈ విధంగా దేశ స్థాయిలో రిజర్వేషన్ విధానం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఆనాడు ఇవి ఎస్సీ, ఎస్టీలకే గాక ముస్లింలకు, సిక్కులకు, క్రిస్టియన్లుకూ వర్తించేవి. 1921 లో మద్రాసు ప్రభుత్వం విద్యా సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తూ, ఉద్యోగాలలో బ్రాహ్మణేతరుల ప్రాధాన్యతను పెంచింది. 1927 లో ప్రకటించిన విధానం ” కమ్యూనల్ ఆర్డర్” పేరుతో ఈ పద్ధతిని ఆమోదించింది. ప్రస్తుత రిజర్వేషన్ విధానానికి మూలం ఇదేనంటారు కొందరు. జనాభాను ఐదు తరగతులుగా విభజించి ఏ తరగతికి ఎంత ప్రాతినిధ్యం ఉండాలో నిర్ధేశించింది. 1950 లో సుఫ్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని కొట్టేసే వరకూ ఇవి కొనసాగాయి. వలసవాదుల 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం ‘సాంఘీకంగా వెనుకబడిన వర్గాలకు ‘ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. దళితుల పట్ల వివక్షకు,వారి వెనుకబాటుతనానికి కారణం కుల వ్యవస్థయని గుర్తించే విద్యా,ఉద్యోగ రంగాల్లో దళితులకు ప్రాధాన్యత పద్ధతిగా ప్రారంభమైన రిజర్వేషన్లు ఆ తరువాత కోటా పద్ధతిగా రాజ్యాంగంలో చేర్చబడి నేడు ఫాసిస్టుల చేతిలో అణగారిన కులాల ఉద్యమాలను చీల్చడానికి సాధనంగా మార్చబడ్డాయి. రిజర్వేషన్ వ్యతిరేకులు అణగారిన కులాలను అణగదొక్కాలని, సామర్థ్యం, ప్రతిభ సిద్ధాంతాన్ని సృష్టించారు. రిజర్వేషన్లను, రూపొందుతున్న నూతన రాజ్యాంగంలో చేర్చడానికి రాజ్యాంగ పరిషత్ లో జరిగిన చర్చల సందర్భంగా అగ్రవర్ణాల ప్రతినిధులు తీవ్రంగా ప్రతిఘటిస్తూ పెద్ద యుద్ధమే చేశారు. రిజర్వేషన్ల వల్ల పరిపాలనా సామర్థ్యం దెబ్బ తినకుండా చూడాలని కుతర్కం చేస్తూ రాజ్యాంగంలోనే (ఆర్టికల్ 335 గా మారిన ఆర్టికల్ 296)తమ వాదనను నమోదు చేసుకోగా కులం పేరుతో సాగుతున్న అంటరానితనం, వివక్షత, దోపిడికి ‘పరిహారంగా’ రిజర్వేషన్లు ఇవ్వాలని అంబేద్కర్ బలంగా వాదించి రిజర్వేషన్లు సాధించాడు. “అణగారిన వర్గాలను కేవలం ప్రభుత్వ ఉద్యోగాలలోకి రానివ్వకపోవడమే కాదు,వారిని కనీస విద్యను అభ్యసించకుండా నిషేధించారు. ఈ వెనుకబాటుతనాన్ని అధిగమించడానికి ప్రత్యేక నిబంధనలు చేయాలి.” అని ఆయన రాజ్యాంగ పరిషత్ ను కోరగా సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధిని సాధించే లక్ష్యం కోసం రాజ్యాంగంలో ప్రాధమిక హక్కుల కింద వీటిని ఆర్టికల్ 15(4),16(4),17,23,335 లలో చేర్చారు. 15(4),16(4) ఆర్టికల్స్ విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు, 17,23 అధికరణలలో అంటరానితనం, వెట్టిచాకిరీల గూర్చి పేర్కొన్నారు. దళితులకు, ఆదివాసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కొరకు 330, 332 ఆర్టికల్స్ వచ్చాయి. వీరికి పరిపాలనలో భాగస్వామ్యం కొరకు 335 ఆర్టికల్ తెచ్చారు. 1951 లో రాజ్యాంగ సవరణ ద్వారా వెనుకబడిన కులాలకు కూడా రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించారు. 1978 మండల్ కమీషన్ సిఫార్సులను ఆధారం చేసుకొని 1990 లో విపి సింగ్ ప్రభుత్వం సాంఘీకంగా, విద్యా పరంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సంస్థలలో 27 శాతం రిజర్వేషన్లు కల్పించింది. పాలకులు పీడిత కులాలకు, ఇతర సామాజిక తరగతులకు రిజర్వేషన్లు కల్పించడం కేవలం అపరాధ భావనే కారణం గాక పాలక వర్గాలలోని వివిధ ముఠాల మధ్య ప్రజలపై ఆధిపత్యం, దోపిడీలో వాటా కోసం పెరిగిన పోటీ, కుమ్మక్కు ఫలితం కూడా. విపి.సింగ్ బిసీలకు రిజర్వేషన్ల నాటకం ఇందులో భాగంగానే చూడాలి. అయితే మన సమాజంలో కొద్ది శాతంగా ఉన్న పీడక కులాలు,పీడిత/అణగారిన కులాలను అణగదొక్కుతూ చేసిన అసంఖ్యాక ఘోరాలకు, నేరాలకు పరిహారంగా సామాజిక విప్లవకారుల కృషి వారి ఆధ్వర్యంలోని ప్రజా పోరాటాల ఫలితంగా రిజర్వేషన్లు రూపొందించబడ్డాయనేది గమనార్హం. నిచ్చెన మెట్ల కులాలతో కూడిన మన సమాజం సామాజిక సమానత్వానికి, స్వేచ్ఛకు, సోదరభావానికి, స్వాతంత్ర్యానికి వ్యతిరేకం. చారిత్రకంగా అమలు జరుగుతున్న ఈ అన్యాయానికి వ్యతిరేకంగానూ, దాన్ని సరిదిద్దిడానికే ఈ రిజర్వేషన్లు అవసరమైనవి కాగా అగ్రవర్ణాలలోని ఫాసిస్టు మూకలు నేడు ఈ రిజర్వేషన్లను రద్దు చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి. శ్రమ చేయకుండా దోపిడీ చేయడమే వృత్తిగా కలిగిన ఈ పీడక మూకలు మళ్ళీ ఉద్యమాలెందుకు ప్రారంభించారు. రిజర్వేషన్ల వల్ల పీడిత కులాల ప్రజలు విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాల్లోకి ప్రవేశించి ఎంతో కొంత లబ్ధి పొందడాన్ని, ఆత్మ గౌరవాన్ని ప్రదర్శించడం సహించలేక పోవడమే గాక ఈ పేరుతో జరుగుతున్న కుట్రలకు తక్షణ, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నాయి. నేటి జెన్ జీ ఉద్యమం లాగే గతంలో పెళ్ళుబుకిన అనేక ఉద్యమాలలో పీడిత వర్గాల, కులాల, మతాల, జాతుల, తరగతుల మధ్య నెలకొన్న ఐక్యత వల్ల భారత పాలకుల ఆధిపత్యాన్ని సవాల్ చేసి అనేక విజయాలు సాధించాయి. ఈ ఉద్యమాలు బ్రద్ధలైన ప్రతి సందర్భంలోనూ పాలకులు ప్రత్యామ్నాయ ప్రతీఘాతుక ఎత్తుగడలతో ప్రజా ఐక్యతను చెదరగొట్టి తీవ్రంగా నష్టం చేశారు. పీడిత కులాల ఐక్యతకు ప్రతిగా  మండల్ కమీషన్ సిఫార్సులను రద్దు చేయాలని ‘ప్రతిభ’ సిద్ధాంతంతో అగ్రకులతత్వాన్ని రెచ్చగొట్టి మండల్ కు వ్యతిరేకంగా మందిర్ ఉద్యమాన్ని చేపట్టి దేశ వ్యాప్తంగా రథయాత్ర జరిపి భారీ విధ్వంసాన్ని సృష్టించడం చూశాం. దేశ సమైక్యత, సమగ్రత సాకుతో కుహనా భరత జాతి తత్వాన్ని పోటి పెట్టి జాతుల స్వయం పాలన, నిర్ణయాధికార డిమాండ్ల సాధన కై సాగుతున్న పోరాటాలను రక్తపుటేరుల్లో ముంచుతున్నారు. మైనారిటి మత ప్రజల పోరాటాలకు పోటీగా హిందూ మతతత్వాన్నే జాతీయవాదంగా చెలామణీ చేస్తూ కుహనా దేశభక్తిని రెచ్చగొట్టి ముస్లిం, క్రిస్టియన్, సిక్కు తదితర మైనారిటీ మత ప్రజల పై సాగిస్తున్న మారణకాండకు అంతే లేకుండా పోయింది. మహిళల సమానత్వ డిమాండ్ కు పోటీగా అడుగడుగునా మహిళలను కట్టడి చేస్తూ బ్రాహ్మణీయ/మనువాద పితృస్వామ్యాన్ని రెచ్చగొట్టి మొరల్ పోలీసింగ్ కు పాల్పడుతున్నారు. ఈ వరుసలో భాగమే ఫాసిస్టు హిందూత్వ శక్తులు జెన్ జీ ఐక్యతను చెదరగొట్టి ఆ ఉద్యమ స్పూర్తితో కదులుతున్న విశాల ప్రజానీకాన్ని చీల్చి నిరాశవాదంలోకి నెట్టేయడానికి రిజర్వేషన్ల రద్దు పేరుతో ప్రతీఘాతుక ఉద్యమమని, అంబేద్కర్ చెప్పిన కౌంటర్ రెవల్యూషన్ లో భాగమేనని అర్ధం చేసుకోవచ్చు.

మన ఆర్థిక వ్యవస్థ ప్రైవేటీకరించబడుతూ కేంద్రీకరణకు గురవుతున్న సంధర్భంలో రిజర్వేషన్లు నిర్వీర్యం చేయబడుతున్నాయి. విద్యా,ఉద్యోగ రంగాలను పరిశీలిస్తే విషయం బోధపడుతుంది. రిజర్వేషన్లు అమలు జరుగాల్సిన విద్యా రంగాన్ని వ్యాపారంగా మార్చుకుని దేశ బడా కార్పొరేట్ సంస్థలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవేశించి కళాశాలలు యూనివర్సిటీలను నెలకొల్పాయి. పాఠశాలలు 48 శాతం, ఇంజనీరింగ్ వైద్య కళాశాలు 80 శాతం, ఉన్నత విద్య లో 78 శాతం కళాశాలలు, వృత్తి, సాంకేతిక విద్య ప్రైవేటురంగపు గుప్పిట్లో ఉన్నాయి. అణగారిన కులాల విద్యార్థులను దూరం నెడుతున్నాయి. ఈ సంస్థలలో రిజర్వేషన్లు వర్తించక పోవడం, కోఠారీ కమీషన్ సిఫార్సులను అన్ని పార్టీలు, ప్రభుత్వాలు బుట్ట దాఖలు చేయడం వల్ల నాణ్యమైన విద్య లభించక విద్యార్థుల డ్రాపౌట్స్ రేటు పెరుగుతుంది. ముఖ్యంగా ఉన్నత విద్యా రంగం పై పీడక కులాలు గుత్తాధిపత్యం వహిస్తున్నాయి. 2019 గణాంకాల ప్రకారం 40 కేంద్ర విశ్వవిద్యాలయాలలోని ప్రోపెసర్ల లో 3.7 శాతం అసోసియేట్ ప్రొఫెసర్ లలో కేవలం 0.7 శాతం మాత్రమే ఎస్సీ, ఎస్టీ లు ఉన్నారు. 2021 నాటికి ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు వంటి సంస్థలలో మూడవ వంతు కంటే ఎక్కువ ఎస్సీ అధ్యాపక పోస్టులు, దాదాపు సగం ఎస్టీ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐఐటీలలో కేవలం 1.68 శాతం మాత్రమే ఎస్సీ/ఎస్టీ అధ్యాపకులు ఉన్నారు. ఐఐఎంలలో 0.23 శాతమే. ఈ సంస్థలలో చేరగల అర్హత కలిగిన పీడిత కులాల విద్యార్థులు ఉన్నప్పటికీ మనువాదులు అడ్డుకుంటున్నారు. బ్రాహ్మణభావజాల ఆధిపత్యం, సంస్థాగత నాయకత్వం, బౌద్ధిక ప్రాధాన్యత అనేవి వేల సంవత్సరాలుగా పీడక కులాల ఆధిపత్యంలోనే ఉండేటట్లు చేసిందని, దీనివల్ల అకడమిక్ రంగంలో శత్రుత్వం కొనసాగుతూ రిజర్వేషన్ల ప్రాధమిక అవగాహననే దెబ్బ తీస్తుందని ప్రముఖ విశ్లేషకులు అనంద్ తేల్ తుంబ్డే వ్యాఖ్యానించాడు. ఈ సంస్థలలో రిజర్వుడు పోస్టులను భర్తీ చేయకుండా తిరస్కరించడంతో లేదా తాత్కాలిక పద్ధతిలో నియమించడం ద్వారా అర్హత ప్రమాణాలను మారుస్తుండడం వల్ల ఈ రంగంలో రిజర్వేషన్లు పూర్తిగా విఫలమయ్యాయి. అత్యధిక విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ విద్యా రంగం ధ్వంసం కావడంతో పీడిత కులాల విద్యార్థుల విద్యా హక్కు పై మనువాద నిషేదం కొనసాగుతుంది. ఉద్యోగాలలో రిజర్వేషన్ వర్తించే ప్రభుత్వం రంగం చాలా తక్కువ. 1991 లో 69 శాతంగా ఉన్న ప్రభుత్వ ఉపాధి నేడు 32 శాతానికి పడిపోయింది. శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోయి కాంట్రాక్టు ఉద్యోగాలు 40 శాతానికి పైగా పెరిగాయి. కొత్త నియామకాలన్నీ రిజర్వేషన్లు వర్తించని తాత్కాలిక, అవుట్ సోర్సింగ్ మార్గాల్లోకి మారడంతో పాటు దళితులను ఎంపిక చేసిన స్థానాల్లోకి నెట్టడంతో రిజర్వేషన్లకున్న సామాజిక పునాది ఎగిరి పోయింది. ఈ విధంగా రిజర్వేషన్ విధానం పీడిత కులాల జీవితాలను మార్చడంలో విఫలమై, అంతర్గత పోటీని పెంచింది. ఈ దుస్థితి వల్ల ప్రస్తుత సమాజం తన వివక్షను వదులుకోనంత కాలం రిజర్వేషన్లు అవసరం కాగా వీటిని రద్దు చేయాలని ఉద్యమించడం వివక్షను కొనసాగించడానికే దారి తీస్తుంది. అణగారిన కులాలకు ముఖ్యంగా అంటరాని దళిత కులాలకు ఒక పరిహారంగా ఇస్తున్న రిజర్వేషన్లు ఆచరణలో విఫలమైనాయి. రిజర్వేషన్లు కేవలం ప్రభుత్వ రంగాలకే వర్తించడం, ఈ రంగం నేడు నామ మాత్రంగా ఉండగా రాజ్యాంగంలో వీటికి పరిష్కారం కనిపించడం లేదు. ఏనిమిది దశాబ్దాల అనంతరం ఒకవైపు అన్ని రంగాలలో పీడక కులాల ఆధిపత్యం కొనసాగుతుండగా మరోవైపు అణగారిన కులాలలో రిజర్వేషన్ల కోసం పోటీ పెరుగుతుంటే రాజ్యాంగ బద్ద రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేయడం రాజ్యాంగ వ్యతిరేకం.

అధికార మార్పిడి అనంతరం అమలు జరుగుతున్న సామ్రాజ్యవాద ప్రాయోజిత విధానాల వల్ల వర్తమాన భారత సమాజం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. ప్రజలను పీడిస్తూ, దోపిడీ చేస్తూ, ఆధిపత్యం చెలాయిస్తున్న బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు పాలకులకు ప్రజా విప్లవ ప్రత్యామ్నాయం కొరవడిన కారణంగా అడ్డూ అదుపు లేకుండా పోయింది. నూతనంగా తలెత్తుతున్న ప్రతీ ప్రజాస్వామిక ఉద్యమాన్ని పాలకులు కౌంటర్ ఎత్తుగడలతో పక్కదారి పట్టించడం, అణచివేయడం జరుగుతుంది. ఈ నేపధ్యంలో ప్రజాస్వామిక శక్తులందరూ రిజర్వేషన్ల రద్దు కోరుతూ జరుగుతున్న ఉద్యమాన్ని బంద్ పెట్టాలని డిమాండ్ చేయాలి. దేశ ప్రజల అభివృద్ధిని కోరుతూ బ్రద్ధలౌతున్న ప్రతీ ప్రజాస్వామిక ఉద్యమానికి మద్దతుగా నిలిచి బలోపేతం చేయడానికి కృషి చేయాలి.

సెప్టెంబర్ 26,2026.

Leave a Reply