ప్రపంచంలో ఏ సమాజమూ కూడా ఇతర సమాజాల ప్రభావాలు లేకుండా ఉండదు. సమాజం రూపు దిద్దుకుంటున్న క్రమంలో ఇతర ప్రాంతాల భాష, ఉత్పత్తి విధానాలు, ఆహార అలవాట్లు, వేషభాషలు, మతాలు, సంస్కృతుల ప్రభావం తప్పకుండా పడుతుంది. ఇది వివిధ ప్రాంతాల ప్రజల మధ్య రాకపోకలతో, సాధారణ సామాజిక, చిరు వ్యాపార కార్యకలాపాలతో జరిగితే దానిని సహజంగా జరిగిందని అనుకోవచ్చుననుకుంటాను. కానీ ఈ రకమైన సాధారణ రాకపోకలు పెద్దగా లేని ఆదివాసీ సమాజంలో జరిగితే అది తప్పనిసరిగా స్వార్ధ దోపిడీ ప్రయోజనాల కోసమేనని అనుకోవాలి. ఈ ప్రయోజనాలు అంతిమంగా ఆదివాసుల అస్తిత్వాన్ని, మనుగడను ప్రమాదంలో పడవేస్తాయి. గడచిన దశాబ్దాలుగా పెరుగుతూ వచ్చిన ఈ ప్రమాదం ఇప్పుడు పరాకాష్టకు చేరుకుంది.
భారతదేశంలో అనేక ఆదివాసీ ప్రాంతాలలో తరాలుగా వారికంటూ ఉన్న మత విశ్వాసాల మీద ప్రధానంగా క్రైస్తవం, హైందవం చొరబడుతూ వచ్చాయి. ఇది యాధృచ్ఛికంగా జరగలేదు. సుమారు 2500 సంవత్సరాల క్రితం భారత దేశంలో శ్రమను దోచుకోవడానికి ఒక సైద్ధాంతిక సాధనంగా ముందుకు వచ్చిన చాతుర్వర్ణ వ్యవస్థలో భాగంగా ఉన్న హిందూ మత ఆచారాల వంటివి కొన్ని ఆదివాసులలో కనిపిస్తాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తమ వలస పాలనా దోపిడీ వ్యాపార ప్రయోజనాలు నేరవేర్చుకోవడంలో భాగంగా దేశంలోకి సంస్థల ద్వారా చొప్పించిన క్రైస్తవం ఆదివాసీ ప్రజలను తమ మతంలోకి మార్చుకుంటూ వచ్చింది. ఈ రెండూ మూలవాసీ ప్రజలలో విభజనలు తీసుకువచ్చాయి.
ఆదివాసులు హిందువులేనంటూ దేశంలో హిందుత్వ సంస్థలు ప్రచారం చేస్తుంటే, చారిత్రక వాస్తవం మాత్రం వారి విశ్వాసం అమ్మ దేవతలేనని తెలియజేస్తున్నది. బస్తర్ లో నేను చూసిన మేరకు ఆదివాసులలో క్రైస్తవం, హిందూ మతం, హిందుత్వం ఏ రకంగా ఉన్నాయో, ప్రజల మత విశ్వాసంపై వాటి ప్రభావం ఎలా ఉన్నదో చెప్పడం ఈ వ్యాసం ఉద్దేశ్యం. ముందుగా బస్తర్ లో కోయ-గోండ్ ఆదివాసులలో ఉన్న మత విశ్వాసం గురించి కొద్దిగా తెలుసుకుందాం.
బస్తర్ ఆదివాసులు ఆచరించే మతంలో ఉన్నవి, ‘పేన్’, ‘మాతల్’. వీటికి ఆకృతి ఉండదు. పేన్ అంటే ఒక రాయి ఉంటుంది. గ్రామాన్ని ఆనుకుని ఉన్న అడవిలో పేన్ ఉన్న ప్రదేశాన్ని ‘రానీ జాగ’ అంటారు. ఆ ప్రదేశంలోకి ఎవరు బడితే వాళ్ళు, ఎలా బడితే అలా వెళ్లకూడదు. మాతల్ అంటే నలుచదరంగా పొడవాటి దుంగల చివర రంగు రంగుల బట్టలు, మువ్వలు కట్టి ఉంటాయి. మాతల్ కూడా గ్రామ పరిసరాలలో ఉంటాయి. పేన్ కి చేసే పండుగను ‘కర్సడ్’ అంటారు. మాతల్ కి చేసే పండుగను ‘జాతర’ అంటారు. పేన్ కొన్ని గ్రామాలకు కలిపి ఉంటుంది. మాతల్ కొన్ని కుటుంబాలకు కలిపి ఉంటుంది. మాతల్ ను అమ్మ దేవతగా చెప్పుకోవచ్చు. దీనికి స్త్రీ పేర్లు మాత్రమే ఉంటాయి. పేన్ లకు పురుష పేర్లు, స్త్రీ పేర్లు కూడా ఉంటాయి. ఈ పేన్ ల మధ్య చుట్టరికాలు ఉంటాయి. ఉదాహరణకు నారాయణపూర్ జిల్లాలో ఛోటా డోంగర్ సమీపంలో ఇప్పుడు గని తవ్వకాలు చేస్తున్న ఆమ్ దాయి పర్వత శ్రేణిలో ఉన్న తూలాడ కొండపై ఉన్న ‘రాజా ముదియాల్’. ఇది చాలా పెద్ద పేన్. ఏడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పేన్ కర్సడ్ కు సుమారు మాడ్ ప్రాంతమంతటి నుంచి ప్రజలు వెళతారు. ఛోటా డోంగర్ కు దగ్గరలో నారాయణపూర్-ఓర్చా రోడ్డు మీద ఉన్న బడగాం గ్రామంలో ఉన్న ‘బుడియా ముత్తి’ ఈయన భార్యగా చెప్పుకుంటారు. వీరి కొడుకు ఆ దగ్గరలోనే కొండపైన ఉన్న తాడ్ నార్ అనే గ్రామంలో ఉన్న ఒక పేన్. వీరి కూతురు తండ్రితో పోట్లాడి ఇంటి నుంచి వెళ్లిపోయి అక్కడికి దూరంగా ఈకిమెట్ట అనే గ్రామంలో వాగులో దాక్కుంది. ఆమెను అక్కడి వారు కనిపెట్టి నీళ్ళల్లో నుంచి బయటికి తీసుకువచ్చి బతికించారు. ఇప్పుడు ఈమె ఈ గ్రామ పేన్. ఒక గ్రామంలో కర్సడ్ జరిగే ముందు గ్రామ పెద్దలు ఇతర గ్రామాలకు పిలుపులకు వెళతారు. ఇలా వెళ్లడాన్ని ‘బడి దాయనా’ అంటారు.
ఈ పేన్ కథల ద్వారా మనకు ఒకప్పటి సంచార జీవనం కనిపిస్తుంది. బస్తర్ ఆదివాసులు గ్రామాలుగా స్థిరపడి బహుశా ఇప్పటికి నాలుగైదు తరాలు అయి ఉండవచ్చుననుకుంటాను. సంచార జీవనంలో ఉన్న ఆదివాసులు ఎక్కడెక్కడ తిరిగారో ఈ పేన్ ల కథల నుంచి కొంత వరకు అర్ధం చేసుకోవచ్చు. వేసవి కాలంలో బియ్యం, పప్పులు, గిన్నెలు మూట గట్టుకుని బస్తర్ పశ్చిమ ప్రాంత గ్రామాల నుంచి చాలా దూరాల వరకు ‘జుడుం’ (సామూహిక వేట)కు వెళ్ళేవారు. ఇలా పరిచయం అయిన కొండ ప్రాంతమయిన మాడ్ లో నీరు, భూమి చూశారు. తరువాత కాలంలో తమ ప్రాంతంలో ఇవి తగినంతగా లేకపోవడం వల్ల ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. అలా వచ్చిన వారు తమ పేన్ లు తీసుకువచ్చి పెట్టుకున్నారు. అలా మాడ్ ప్రాంతంలో మాడియా గోండ్ వారి పేన్ లతో పాటుగా జుడుం వచ్చినప్పుడు చూసి స్థిరపడ్డ మురియా గోండ్ వారి పేన్ లు వచ్చి కూర్చున్నాయి. వీటి మధ్య కలహాలు లేవు. అంటే మాడియా, మురియా ప్రజల మధ్య కలహాలు లేవు. ప్రారంభ కాలంలో తమ ప్రాంతంలో స్థిరపడాలనుకున్న మురియా ప్రజలను ఆనాటి మాడియా గ్రామాల పెద్దలు గొడ్లు, పందులు ఇవ్వమని అడిగేవారని మురియా ప్రజలు చెబుతారు. ఉద్యమానికి గత కాలంలో పేన్ ల గురించి స్థానిక మాడియా ప్రజల మధ్య గొడవలు జరిగిన సందర్భం ఒక్కటి విన్నాను.
బస్తర్ లో చాలా కాలంగా తెలుగు రాష్ట్రాలలో గొల్ల కులంగా చెప్పుకునే గైరాదివాసీ యాదవ కులస్తులు అల్పసంఖ్యలోనే అయినా ఉన్నారు. వీరిని స్థానికంగా ‘కోపా’ అంటారు. వీరు కూడా ఆదివాసీ ప్రజల పేన్ కర్సడ్ లలో పాలు పంచుకుంటారు. తమ పేన్ ఇది అని చెప్పుకుంటారు. మరో పక్క హిందూ మత పండుగలయిన కృష్ణాష్టమి, హోలీ జరుపుకుంటారు. ఆవు తమకు జీవనాదాయ వనరు కాబట్టి వీరు గొడ్డు మాత్రం తినరు. ఇతరత్రా వేట చేయడం దగ్గర నుంచి అన్ని సామాజిక కార్యకలాపాలలో ఆదివాసులు, ఈ కోపా గైరాదివాసులు కలిసే పాల్గొంటారు.
కోయ-గోండ్ సమాజంలో హైందవ లక్షణాలు
బస్తర్ ఆదివాసీ సమాజంలోకి లాంఛనమైన హిందూ మతం కొందరు బాబాల ద్వారా ప్రవేశించింది. వీరిప్పుడు ప్రత్యక్షంగా లేరు. వారి ఆచారం కూడా అతి కొద్ది గ్రామాలకు, కొందరు వృద్ధులకు పరిమితం అయింది. ఉద్యమం ప్రారంభం కాక ముందు గాయత్రి పేరుతో హిందూ మత ప్రచారం జరిగింది. ఆ కాలంలో ఈ మతం పుచ్చుకున్న ఒక మాడియా గ్రామం నేటికీ ఆచరిస్తుంది. ఈ గ్రామంలో ఒక చిన్న గుడి ఉన్నది. ఈ గ్రామ పెద్దలను మహారాజా అని పిలిచేవారు. అయితే ఉద్యమ ప్రభావంతో వీరి మత ప్రభావం ఇతర చోట్లకు వ్యాపించలేదు. మాడ్ కు తూర్పు దిశగా కొన్ని గ్రామాలలో హిందూ మతం ఒక సన్యాసి ద్వారా ప్రచారమయ్యింది.
రామకృష్ణా మిషన్ ఆశ్రమాలు మాడ్ ప్రాంతంలో ఉద్యమ ప్రవేశానికి ముందు నుంచే నడుస్తూ ఉన్నాయి. వీరు ఆదివాసీ బాలలకు విద్యను అందించడం, ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడం చేస్తారు. ఈ పాఠశాలలలో విద్యార్థులతో సంస్కృత శ్లోకాలు చదివించడం, ప్రార్థన చేయించడం ఉంటుంది. పిల్లల పేర్లు కూడా మార్చి హిందూ మతాన్ని సూచించే పేర్లు పెడతారు. ఇది ఒక రకమైన హిందూ మత ప్రచారమే. అయితే ఇవేవీ మత మార్పిడుల రూపంలో వ్యాపించలేదు. హిందూత్వం మరో స్థాయిలో బస్తర్ సమాజంపై దాడి చేసింది.
చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా హిందూ మత ఆచారాలు శతాబ్దాల క్రితమే భారతదేశ ప్రజల జీవనంలో ఒక భాగంగా మారిపోయాయన్నది మనకు తెలిసిన విషయమే. బస్తర్ ఆదివాసులు హిందువులు కాకపోయినా బయటి ప్రాంతాల నుంచి భారతదేశంపై జరిగిన దాడులు, ఈ క్రమంలో ముందుకు వచ్చిన చాతుర్వర్ణం ఆదివాసీ సమాజాలలో చొరబడలేదని అనుకోలేం. ఇందులో ప్రధానమైనవి మహిళలకు సంబంధించినవి. మహిళలు విత్తనాలు జల్లరాదు, నూర్పిళ్ల పనిలో పాలు పంచుకోవద్దు, ‘వంజి లోన్’ (ధాన్యం గది)లోకి పోవద్దు అన్న నియమాలు ఉండేవి. మహిళలకు ఆస్తి హక్కు ఉండరాదన్న పితృస్వామ్య భావనే ఇందులో స్పష్టంగా కనిపించే విషయం. విప్లవ కృషిలో భాగంగా మతపరమైన, మహిళలకు సంబంధించిన అంశాలపై అందించిన అవగాహనతో ఈ విషయాలలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చింది.
బస్తర్ లోకి క్రైస్తవం
2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ అమలయిన కాలం నుంచి క్రైస్తవం బస్తర్ లో ఎక్కువ కావడం యాధృచ్ఛికం అనుకోలేం. బ్రిటిషు సామ్రాజ్యవాదుల రాకతో క్రైస్తవం నేటి భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్న ఆదివాసీ ప్రజలలో ప్రవేశించింది. ప్రజల నిత్యావసరాలైన విద్య, వైద్యం పేరుతో అనేక గ్రామీణ మైదాన, పట్టణ ప్రాంతాలలో బడులు, ఆసుపత్రులు ప్రారంభించి నేటికీ నడుపుతున్న క్రైస్తవ సంస్థలు ప్రారంభ కాలంలో ఈశాన్య, ఉత్తర, తూర్పు భారత రాష్ట్రాలలో గ్రామ గ్రామానా చర్చిలు నిర్మించాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్ మొదలయిన రాష్ట్రాలలో పట్టణ, మైదాన ప్రాంతాలలో అక్కడక్కడా ఉన్న క్రైస్తవం తరువాత కాలంలో అటవీ ప్రాంతాలలోకి చొరబడసాగింది. ప్రజలలో విభజనలు తీసుకువచ్చి, వారిపై దాడి చేసే వ్యూహంలో భాగంగానే నిధులు సమకూర్చి సామ్రాజ్యవాదం, అండనిచ్చి రాజ్యం క్రైస్తవాన్ని ప్రోత్సహించాయని నాకు అనిపిస్తుంది. తరువాత కాలంలో హిందుత్వ పాలనలో, హిందుత్వ ఎజెండాలో భాగంగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కూడా క్రైస్తవుల మీద దాడులు పెరగడం చూస్తున్నాం.
ప్రజలలో ఉన్న అశాస్త్రీయ భావాలను అవకాశంగా తీసుకుని క్రైస్తవం బస్తర్ లోకి ప్రవేశించింది. అనారోగ్యం ఉన్న ప్రజలకు ఒక మార్గంగా క్రైస్తవ ప్రార్థనను పరిచయం చేశారు. వారపు సంతలకు వెళ్లే ప్రజలను కలిసి తమ ప్రచారం చేసుకున్నారు. ప్రార్థన చేస్తే అనారోగ్యం తగ్గిందని ప్రజలను నమ్మించిన తరువాత, ప్రార్థన ఆపివేస్తే తిరగబెడుతుందని చెప్పారు. ఇలా క్రైస్తవం ప్రచారం కాసాగింది. గ్రామ పెద్దలు క్రైస్తవాన్ని వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకత ఏ రకంగా సాగిందన్న దానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక మాడియా గ్రామంలో క్రైస్తవంలోకి వెళ్లిన కుటుంబాలను గ్రామ పెద్దలు రోజూ సాయంత్రం పూట గోటుల్ (గ్రామ ప్రజలందరూ కూడే ఒక పెద్ద గుడిసె, సామాజిక భవనం వంటిది) వద్దకు పిలిచి వారిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. వారు వినకపోతే కొట్టారు. ఇలాంటి సందర్భంలో ప్రజలు పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం, పోలీసు అధికారులు ప్రజలందరినీ పిలిచి వారిని సముదాయించడం కూడా అక్కడక్కడా జరిగింది. ఒక సందర్భంలో ఒక పోలీసు అధికారి ఎందుకు కొట్టారని గ్రామ పెద్దలను అడిగి, వారు కారణం చెప్పినప్పుడు, మంచి పని చేసారని చెప్పి అందరినీ తిరిగి పంపించివేసాడు! అలాగే కొన్ని గ్రామాలలో క్రైస్తవంలోకి వెళ్లిన వారిని ఇతరులు బహిష్కరించారు.
గ్రామాలలో మత పెద్దలలో భాగంగా ఉండి ఒకప్పుడు స్థానిక విశ్వాసాలను మొండిగా ఎత్తి పట్టిన, ఆధునిక వైద్యాన్ని కూడా అనుమతించని ‘పేన్ మాంజీలు’ సయితం క్రైస్తవంలోకి పోవడం ఒక ముఖ్యమైన పరిణామం. ఆదివాసీ సంస్కృతిలో భాగంగా ఉన్న కర్సడ్ లను పారంపరిక పద్ధతిలో జరపడం గతంలా జరగలేదు. ఆట పాటలు ఉధృతంగా సాగే కర్సడ్ లు ముందులా సాగలేదు. ఇది ఆదివాసీ సంస్కృతి పలచబారడానికి దారి తీసింది. ఒక సామూహిక జాతిగా ఉంటూ వచ్చిన ఆదివాసీ ప్రజలలో మత విశ్వాసాల పునాదిపై విభజనలు ఏర్పడ్డాయి.
ఉద్యమ కృషి
పార్టీ క్రైస్తవం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలలో అవగాహన తీసుకువచ్చేందుకు కృషి చేసింది. క్రైస్తవం వెనుక ఉన్న సామ్రాజ్యవాద-రాజ్య ప్రయోజనాలను వివరించింది. తరతరాలుగా వస్తున్న ఆదివాసీ విశ్వాసాలకు ఇది విరుద్ధంగా ఉంటుందని, దీని వల్ల స్థానిక సంస్కృతి నశించిపోతుందని వివరించింది. సుదీర్ఘ గ్రామ ప్రజల సమావేశాల ద్వారా వారికి ఈ పరిస్థితి వల్ల కలిగే ప్రమాదాలు వివరించింది. ప్రధానంగా క్రైస్తవం వల్ల ప్రజలలో వస్తున్న విభజనలను లేకుండా చూసేందుకు పార్టీ కృషి చేసింది. దాని వల్ల ఐక్యత లేకుండా పోవడం చాలా నష్టకరమని చెప్పింది. కొన్ని గ్రామాలలో కొందరు క్రమేపీ ఈ మతం నుంచి దూరమయ్యారు. స్థానిక కమిటీలు చేసిన కృషితో అనేక సార్లుగా ప్రజల మధ్య సాగిన చర్చలతో మరి కొందరు విడిచిపెట్టారు. కొందరు ప్రజలు దాంతో కొనసాగారు.
‘భిన్నత్వంలో ఏకత్వం’ కాదు – హిందుత్వ ఏకత్వం
‘భిన్నత్వంలో ఏకత్వం’గా పేరు పొందిన భారతదేశంలో భిన్నత్వాన్నంతా హిందుత్వ ఏకత్వంగా రూపొందించే ప్రయత్నం రకరకాల పద్ధతులలో సాగుతుండడం మనం చూస్తూ ఉన్నదే. ఇందులో భాగంగానే ఇప్పుడు ఆదివాసులు హిందువులని అంటున్నారు. వారి అమ్మ దేవతల పేర్ల మీద గుడులు కట్టిస్తున్నారు. ఇందులో విగ్రహాలు చాలా వరకు హిందూ మత దేవతైన ఆదిశక్తిగా పేరు పొందిన పార్వతిని పోలి ఉంటాయి. ఇందుకు ఒక ఉదాహరణగా బస్తర్ లో దంతెవాడ జిల్లా దంతెవాడ పట్టణంలో దంతేశ్వరి దేవాలయాన్ని చెప్పుకోవచ్చు. ఇది నిజానికి బస్తర్ కోయ ఆదివాసుల ఒక అమ్మ దేవత. దీనికి హిందూ మత సంప్రదాయాన్ని అనుసరించి గుడి కట్టి, దానికి పండుగలు జరిపి చేసే హడావుడి అంతా ఆదివాసులది కాదు. వారిని దోచుకునే గైరాదివాసీ వ్యాపారులది. ఆదివాసుల తరతరాల సంస్కృతిని నాశనం చేసి వారిని ‘అభివృద్ధి’ పేరిట ‘ప్రధాన స్రవంతి’గా చెబుతున్న హిందుత్వ చట్రంలోకి నెట్టే హిందుత్వ పాలకుల ప్రయత్నమిది. ఇటువంటివే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనూ కనిపిస్తాయి.
‘బస్తర్ దసేరా’ అని పిలిచే పండుగ మరొకటి. బస్తర్ రాజుల కాలంలో ఈ దసేరాను జరపడం ప్రారంభమయింది. ఆదివాసీ గ్రామాలను పరగణాగా విభజించి పాలించిన రాజుల ఆధ్యర్యంలో జరిగే ఈ పండుగకు పరగణా పెద్దలు వెళ్లడం ఆనవాయితీగా మారింది. ప్రజలు కూడా సంబరాలు చూడడానికి పెద్ద ఎత్తున వెళతారు. అయితే ఈ ‘బస్తర్ దసేరా’ను నేడు ఒక భారీ ప్రభుత్వ ఉత్సవంగా మార్చారు. ఆదివాసులను తమలో ఇముడ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ఉత్సవాన్ని వాడుకుంటూ ప్రతి సంవత్సం ఏదో ఒక నూతన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
గణేష్ చతుర్థి జరపడం, మైదాన, పట్టణ ప్రాంతాలలో మాదిరిగా విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయడం నిమజ్జనం చేయడం రోడ్డు పక్క గ్రామాలలో కనిపిస్తుంది. గైరాదివాసులు కూడా ఉండే ప్రాంతాలలో సాయంత్రం పూట రామాయణం (దీనిని స్థానికంగా రామాయండ్ అంటారు) చదవడం ఉంది. ఆదివాసీ గ్రామాలలో ఉద్యోగులతో పాటుగా చదువుకుంటున్న విద్యార్ధులు కూడా పెరగడంతో హోలీ, రాఖీ వంటి పండగలు ఆ ఉత్సవం మేరకు జరుపుకోవడం చూస్తాం.
హిందుత్వ పాలనలో మరో రూపంలో ఆదివాసీ సంస్కృతిపై దాడి జరుగుతున్నది. విద్యార్ధుల పేర్లకు చివర రాం అని, కుమారి అని పెట్టడం హిందుత్వ ప్రభావమే. మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు గొడ్డు మాంసం, పంది మాంసం తినకూడదని, అవి తింటే చదువు రాదని విద్యార్థులతో చెబుతారు. మైదాన ప్రాంత అలవాట్లు చూసి, అదే నాగరికత కాబోలనుకుని విద్యార్థులు ఎవరైనా కలిస్తే కాళ్లకు నమస్కరించడం, నమస్కారాలు చేయడం వగైరాలు నేర్చుకున్నారు. ఆదివాసీ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలలో పని చేసేందుకు ఛత్తీస్ గఢ్ మైదాన, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయుల ద్వారా, కొన్ని హిందూ ఆచారాలు వచ్చాయి. కొన్ని గ్రామాలలో దీపావళి తరువాత గోవర్థన్ పూజ పేరుతో ప్రత్యేక వంటకాలు చేసుకుని తినడం అలవాటయింది. ఆదివాసీ ప్రాంతాలలో పని చేసే ఉపాధ్యాయులకు స్థానిక సంస్కృతిని గౌరవించాలని, ఆదివాసీ ప్రజల తరతరాల ఆచార సంప్రదాయాలను ప్రభావితం చేయకూడదన్న అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. వారిలో ఈ అవగాహన కల్పించడం ప్రభుత్వం బాధ్యత కూడా.
మైదాన, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చి పని చేస్తున్న ఉద్యోగులలో అంగన్ వాడీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఐదు సంవత్సరాల వయసు లోపు పిల్లలకు అక్షరాలు నేర్పడం, మధ్యాహ్నం భోజనం పెట్టడం వీరి విధి. భోజనం వండేందుకు, వడ్డించేందుకు ఉండే ‘సహాయక’ పదవిలో మాత్రం స్థానిక గ్రామ మహిళలే ఉంటారు. అంగన్ వాడీ కార్యకర్తలు మధ్యాహ్నం నుంచి ఇంటింటికీ వెళ్లి మహిళల ఆరోగ్య తనిఖీలు చేయడం, వారికి మందులు ఇవ్వడం, గర్భవతి మహిళలకు ఆరోగ్య జాగ్రత్తలు వివరించడం చేస్తారు. వీరు కాక ఆరోగ్య శాఖ ఉద్యోగులు అడపా దడపా వచ్చి వెళుతుంటారు. వీరి ద్వారా స్థానిక ప్రజలకు తెలియని కొన్ని ఆరోగ్య సంబంధిత విషయాలు, కొద్ది పాటి సాధారణ సామాజిక జ్ఞానం అందడంతో పాటుగా కొన్ని పరాయి అంశాలు కూడా చొరబడుతూ వచ్చాయి. ఉదాహరణకు అంగన్ వాడీలో భర్తీ చేసేటప్పుడు కార్యకర్తలు వారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చి బయటి సంస్కృతికి సంబంధించిన పేర్లు పెట్టడం సాధారణంగా జరుగుతుంది. ఇలా నమోదయిన పేరే ఆ తరువాత వారు పాఠశాలలో చేరినా, ఆధార్ కార్డు తయారు చేయించుకున్నా ఉంటుంది. దాంతో స్థానిక సంస్కృతిలో ఉండే పేర్లు క్రమంగా మాసిపోతున్నాయి. పేరు కూడా పరాయి అయిపోతున్నది.
మూలవాసీ విశ్వాసాలను గౌరవించాలి – పరిరక్షించాలి
నేడు అటవీ భూమిపై అంతర్జాతీయ బహుళ జాతి కంపెనీలు, దేశీయ కార్పొరేట్ కంపెనీల వ్యాపార ప్రయోజనాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బస్తర్ ఆదివాసులను వారి తరతరాల భూమి నుంచి తరిమివేసేందుకు కుట్రపూరితంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వారి అస్తిత్వాన్ని రూపుమాపే దాడి జరుగుతున్నది. వారి సమస్త సంస్కృతిని, భాషను, అలవాట్లను పరాయీకరణ చేసే దుష్ట యోజన సాగుతున్నది. దీని పట్ల ఆదివాసులు, వారి శ్రేయోభిలాషులు అప్రమత్తంగా ఉండాలి. దేశంలో సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఆదివాసీ పోరాటాలు, విప్లవ పోరాటాలు అందించిన స్ఫూర్తితో, అవగాహనతో ఆదివాసుల అస్తిత్వాన్ని, అస్మితను, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సాధ్యమయినన్ని విధాలుగా కృషి చేయాలి.




