దేశం నలుమూలలా

ఒక కొత్త పదం పుట్టింది

“దిమాగి నక్సల్స్!”

ప్రశ్నించే పెదవుల మీద

ఒక ముద్ర

ఆలోచించే మెదళ్ల మీద

ఒక నేరారోపణ!

మొన్న

“జాతి వ్యతిరేకులు” అన్నారు,


నిన్న

“దేశద్రోహులు” అన్నారు,


ఆ తర్వాత
“అర్బన్ నక్సల్స్” అన్నారు

ఇప్పుడు

“దిమాగి నక్సల్స్!”

పేరు మారుతోంది…
నింద మారుతోంది…

కానీ భయం మాత్రం

అదే!

ఎందుకంటే

ప్రశ్నించే మనిషి

ఏ అధికారానికైనా ప్రమాదమే!

“ఎందుకు?” అని అడిగితే

నక్సలా!

“ఎక్కడ ఖర్చు చేశారు?” అని అడిగితే

దేశద్రోహా!

“రాజ్యాంగం ఎక్కడ?” అని నిలదీస్తే

జాతి వ్యతిరేకా!

“ప్రజాస్వామ్యం ఎక్కడ?” అని వెతికితే
అర్బన్ నక్సలా!

ఈ దేశంలో
పౌరుడిగా ఉండటానికి
ముందు
మెదడును సమర్పించాలా?

ప్రశ్నించని తలలు కావాలా?
చప్పట్లు కొట్టే చేతులు కావాలా?

ఆదేశాలు మాత్రమే వినే చెవులు కావాలా?
ఆలోచనలేని జనసమూహమే
దేశభక్తికి కొలమానమా?

ప్రశ్నించడం
దేశద్రోహం కాదు
ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు!

వ్యతిరేకించడం
జాతి వ్యతిరేకత కాదు
అధికారాన్ని జవాబుదారీ చేయడం!

అవినీతిని ఎండగట్టడం
దేశాన్ని బలహీనపరచడం కాదు
దేశాన్ని శుభ్రపరచే పౌరధర్మం!

దేశం అంటే
ఒక నాయకుడి చిత్రం కాదు
ఒక పార్టీ జెండా కాదు
ఒక మతం కాదు
ఒక సంస్థ కాదు

దేశం అంటే
మట్టిలో చెమట చిందించే మనిషి,
పొలంలో విత్తనం వేసే రైతు,
కర్మాగారంలో శ్రమించే కార్మికుడు,
పుస్తకం పట్టుకున్న విద్యార్థి,
న్యాయం కోసం నిలబడే పౌరుడు!

వారిని భయపెట్టడానికి
పదాలు పుట్టించినా

ఆలోచనలను
అరెస్టు చేయగలరా?

పుస్తకాలను కాల్చగలరేమో
మరి ప్రశ్నలను!


గొంతులను నులిమేయగలరేమో
మరి నిజాన్ని!

మతం పేరుతో మనుషులను విడదీసే
మూఢత్వానికి పేరేమిటి?


కులం పేరుతో
మనిషిని మనిషి కంటే తక్కువ చేసే
అహంకారానికి పేరేమిటి?

అధికారాన్ని ప్రశ్నించినవారిని
దేశద్రోహులుగా ముద్రించే
రాజకీయానికి పేరేమిటి?

రాజ్యాంగం కంటే
మతాన్ని ముందుపెట్టి నడిపే
రాజకీయానికి పేరేమిటి?

వాటిని కూడా ప్రశ్నించాలి!
ఎందుకంటే
ప్రజాస్వామ్యంలో
ఎవరూ ప్రశ్నలకు అతీతులు కారు.

మనమే అయినా

మనల్ని మనమే ప్రశ్నించాలి!

మా మెదడును
ఎవరి ఆదేశానికీ అద్దెకు ఇవ్వం

మా గొంతును
ఎవరి భయానికీ తాకట్టు పెట్టం

మా దేశభక్తిని
ఎవరి రాజకీయ ముద్రతోనూ కొలవనివ్వం.

దిమాగి నక్సల్ అనండి
దేశద్రోహి అనండి
అర్బన్ నక్సల్ అనండి…

మా తలలోని
ఒక్క చిన్న ప్రశ్నను మాత్రం
మీరు మాయం చేయలేరు

మా ప్రశ్న ఒక తుపాకీ
అది మీ అధికారపు గోడల్లో
పగుళ్లు పుట్టిస్తుంది.


మా ఆలోచన ఒక బాంబు
అది మీ మూఢత్వపు కోటలను
కూల్చగలదు.

స్వేచ్ఛ నేరం కాదు
అది మా జన్మ హక్కు!

మీరంటున్న
దేశద్రోహులూ జాతివ్యతిరేకులూ
అర్బన్ నక్సల్స్  దిమాగి నక్సల్స్

వారే వారే
నేటి ప్రజాస్వామ్యానికి
చివరి కాపలాదారులు!

Leave a Reply