కొత్తపల్లి సురేశ్ కవి, గాయకుడు,ఉపాధ్యాయుడు, కవిసమ్మేళనం సాహిత్య వేదిక నిర్వాహకుడు, అనంతపురం జిల్లా రచయితల సంఘం అద్యక్షుడు. తన విద్యార్థులతో కవిత్వం రాయిస్తున్న కార్యశీలి. కవిసమ్మేళనం సాహిత్య వేదిక ఫేస్ బుక్ గ్రూప్ లో డైలీ శీర్షికలు నిర్వహిస్తూ సాహిత్యకారులచే వ్యాసాలు రాయిస్తూ,వాటిని పుస్తకాలుగా తెస్తున్న సాహిత్య ప్రేమికుడు. లైఫ్ హాలిడే ( 2019 ) తన తొలి కవితాసంపుటి.

శ్రీనివాస్ గౌడ్ , ప్రొ. జి వి రత్నాకర్ లతో కలిసి “అరాచకుడి స్వగతాలు” పేరుతో గొలుసుకట్టు కవిత్వ సంకలనం తెచ్చారు.

తన అన్న పేరుతో తొమ్మిదేళ్లుగా ఏటా కొత్తపల్లి నరేంద్ర బాబు సాహిత్య పురస్కారం అందజేస్తున్నారు.

“చెనిగ పూల జాజర” తన రెండో కవిత్వ సంపుటి త్వరలో రాబోతోంది

*

1. మీకు పుస్తకాలు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా పరిచయం అయ్యాయి?

నా బాల్యంలో మా ఊర్లో వానలు పడనప్పుడు మా తాతని పిలిచి(అమ్మ తండ్రి) విరాట పర్వం చదివించేవారు మా ఊరి పెద్దలు. అప్పుడు మా తాత నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని పద్యాలు పాడి భావం వివరంగా చెప్పేవాడు. అదిగో అలా అప్పుడు తొలిసారి నేను పుస్తకాలను చూసిన, తాకిన గుర్తు..

ఇంకా మా తాత గారి ఇంట్లో చాలా పుస్తకాలుండేవి.

ఆయన స్వయాన పద్యరచన చేసేవారు, భజన పాటలు రాసి పాడేవారు. ఆ ఇల్లు ఎప్పుడూ ఏదో ఒక పద్య సందోహంలో తేలుతుండేది. పాటల తేరై సాగుతుండేది. నాకు గుర్తుండి, ఆయన కూడేటి సంగమేశ్వరుని మీద కంద పద్యాల్లో ఒక శతకం రాశారు. ఇప్పుడది దొరకడం లేదు.

2. మీరు పుస్తకాలను ఎంపిక చేసుకునే పద్ధతి, సేకరించే విధానం గురించి, భద్రపరిచే పద్ధతుల గురించి.

   నాకు కవిత్వమన్నా, కథలన్నా చాలా ఇష్టం.

 నాటి శ్రీశ్రీ నుంచి నేటి శ్రీనివాస్ గౌడ్ దాకా అలరించే కవిత్వం ఎక్కడున్నా వదలకుండా చదివాను. ఇప్పట్లో తెలుగు వెంకటేష్, పల్లిపట్టు, భుజంగరావు, సామూ,అంకే శ్రీనివాస్,మెట్టా, మునాసు వెంకట్, మానస కవిత్వం ఇష్టం.

అలాగే నాకు కథలు కూడా చాలా ఇష్టం. తిలక్ కథలు చాలా ఇష్టంగా చదువుకున్నా. చలం కథల్లో కొసమెరుపులు చాలా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సీరియస్ సాహిత్యంకు సంబంధించిన చాలా కలెక్షన్ నా దగ్గరుంది. మా ఇంట్లో ఒక గదిని చిన్నపాటి లైబ్రరీ గా మార్చుకున్నాను. సింగమనేని, దేవపుత్ర, అట్టాడ, శాంతి నారాయణ,G వెంకటకృష్ణ, ఖదీర్ బాబు ఇలా చెప్తూ పోతే లిస్ట్ చాలా పెద్దదే అవుతుంది నా అభిమాన రచయితలది.

3. మీరు చదవాలనుకుని చదవలేకపోయిన లేదా సేకరించాలనుకుని సేకరించలేకపోయిన పుస్తకాల గురించి

   2015 నాటి మాట.విపరీతంగా అనువాదాలు చదువుతున్న రోజులవి.శివరామ కారంత తో సాగి, అనంత మూర్తి, భైరప్ప దాకా చాలా నవలు చదివాను. ఈ క్రమంలో భైరప్ప ‘పర్వ’ చదవాలని వెతికితే ఎక్కడా దొరకలేదు.కేంద్ర సాహిత్య అకాడమీ బుక్ హౌస్ బెంగళూరు లో కూడా అందుబాటులో లేదన్నారు. బాగా విసిగిపోయిన సమయంలో శాంతి నారాయణ గారు తిరిగి ఇవ్వాలనే కండిషన్ మీద ఇచ్చారు. చదివి ఇచ్చేశాను.

4. ఎంతో ఇష్టమైన, మీరు పోగొట్టుకున్న పుస్తకాల గురించి.

   చాలా మంది మా ఇంటికి వస్తే పుస్తకాలు అడిగి తీసుకుపోతారు. ఐతే కొందరే మళ్ళీ తిరిగి ఇస్తారు.

జి.కళ్యాణ రావు గారి అంటారని వసంతం, S.L భైరప్ప గృహబంగ నన్ను కుదిపేసిన రచనలు. వాటిని ఎంతో మందితో  చవించానుకూడా. ఐతే ఈ రెండు నవలలు ఇప్పుడు నాదగ్గర లేవు.

5. మీకు ప్రాణ సమానమైన పుస్తకాల గురించి.

    నాకు కవిత్వం తర్వాతే ఏదైనా. అలాంటి కవిత్వాన్ని నేను వీలుదొరికినప్పుడల్లా పిల్లలకు పాఠంగా చెప్పేవాన్ని. అలా నా ప్రయత్నంలో నా విద్యార్థులు కొందరు కవిత్వం వైపు అడుగులేశారు. తొలిగా దాదాపు 42 మంది కవితలతో బాలల వనం పేరుతో సంకలనం తెచ్చాను. ఆతర్వాత individual గా ఒకరిద్దరు కవిత్వాన్ని పుస్తకాలుగా తెచ్చాను.

ఆ పుస్తకాలు నాకు ఎప్పటికీ ప్రాణం. నా సొంత కవిత్వపుస్తకం కంటే కూడా ఆ పిల్లల పుస్తకాలు చేత్తో తడిమితే కలిగే తృప్తి మాటలకందదు.

6. ఏ సమయంలో ఎలా ఎక్కడ మీరు పుస్తకాలను    చదివే పద్ధతుల గురించి.

     మొబైల్ రాకముందు ఎక్కడికెళ్లినా చేతిలో పుస్తకం లేకుండా కాలు బయట పెట్టే వాన్ని కాదు. అలాగే డైలీ స్కూల్ జర్నీలో విండో సైడ్ సీట్ వెతుక్కొని చదవడం ఇష్టం. సాయంత్రాలు ఒక్కణ్ణే సిటీ ఔట్స్ కట్స్ లోని cafes లో కూర్చొని ఏమీ పట్టనట్టు చాయ్ ఆస్వాదిస్తూ చదవడం చాలా చాలా ఇష్టం. ఇప్పటికీ అదే పని దాదాపు. ఐతే మొబైల్ లో నే కావలసినంత సరుకు అందుబాటులో ఉంది చదువు యాప్ లాంటి వెబ్సైట్ రూపంలో.

7. మీలో, మీ జీవితంలో పుస్తకాలను చదవడం వల్ల వచ్చిన మార్పుల గురించి.

    పుస్తకం చదువుతున్నప్పుడు నాలో ఏదో కొత్త శక్తి ఆవహిస్తుంది. మనసు తేలికవుతుంది.నా మెదడు కొత్త లోకాలలో విహరిస్తుంది. ఏవో ఆలోచనలు నా చుట్టూ ఉండే లోకాన్ని మరిపిస్తాయి. కొత్త కొత్త thoughts start అవుతాయి. దేన్నైనా అర్థం చేసుకోవడంలో పరిణతి కనబడుతుంది.

అందుకే చదవడం నా ఆస్వాదన క్రీడ..

ఒక ఉర్దూ కవి “పుస్తకం, మన జేబులోని పూలతోట”అన్నాడు.

నిజమే కదా!!

Leave a Reply