అనగ అనగ ఎనుకట ఓ రాజ్జెం ఉండేడిది. దాని పేరు సయోధ్య. దానికో మాంచి రాజు ఉండెటోడు. అయితే ఆ రాజుకు సంతానం లేదు. రాజు బాగా పండు ముసలోడయిండు.
ఓ రోజు రాణితోటి ఇసారిచ్చిండు. మనకు పిల్లలు లేక పోయిరి గదా, ఆడిపిల్లున్నా లక్ష్మీభాయి, దుర్గావతి లెక్క రాణుల్ని చేస్తుంటిమి గని ఎవలూ లేకపాయే. నేను రేపో మాపో కాలం జేత్తే. మన వారసుడుగా రాజ్యం ఎవల కప్పజెపుదాం అని అడిగిండు.
రాణి దీర్ఘంగా ఆలోసించి
“ఇగో మన వంట శాలల గా బైరి గడ్డపాయన లేడా ? చాయి శాన బాగ జేత్తడు జూడు. మంచి తెలివి కల్లోడు. ఆయన చేతి చాయి అంటే నాకు మహా ఇట్టం. గాయన సిన్నప్పుడే ఇంటిని,పెండ్లాన్ని ఇడిసి పెట్టి మన వంటశాలల జేరిండు. గసొంటాయన్ని రాజును జేత్తే ఇల్లు ఇరువాటం లేనోడికి, పెండ్లాం పిల్లలు లేనోడికి ఏం స్వార్థముంటది ? ఎవలకోసం సంపాదన ఎనుకేత్తడు ? ఉన్నదంత పజలకు పంచిబెట్టి మంచి జన రంజకంగా పరిపాలిత్తడు. నాకయితే గాయిననే రాజును జేత్తే మంచిదనిపిస్తాంది అన్నది.
రాజుకు గూడా రాణి చెప్పిన మాట నివద్దే అనిపిచ్చింది.
తెల్లారే, రాజు రాజ దర్బారులో తన వారసుడిగా కొత్త రాజును ప్రకటించిండు. దర్బారులో గూసున్న ,పెద్దలు, పండితులు, మంత్రులు, సేనాపతులు అందరూ ఒక్కసారే ఇసిత్ర పోయిండ్లు. కొందరు నోరెల్ల బెట్టిండ్లు, మరికొందరు ముక్కు మీద ఏలేసుకున్నరు, కొందరయితే శెక్కరొచ్చి కింద బడేటోల్లు గోడలను, మొగురాలను ఆసర జేసుకుని తమాయించుకుని నిలబడ్డరు. శానా మంది తొందరగనే తేరుకుని రాజుల వారి గొప్ప నిర్ణయానికి జేజేలు కొట్టిండ్రు.
మాలోని వాడే, మాలాంటి వాడే రాజయినందుకు ప్రజలు మహా సంబుర పడ్డరు. మనలాంటోళ్ల కట్టసుఖం ఎరిగినోడు మంచిగ పరిపాలిస్తడు. మనకు మంచి రోజులొస్తయని ఆశ పడ్డరు.
కొత్త రాజుకు రంగ రంగ వైభవంగా పట్టాభిషేకం జేసిండ్రు. కొత్త రాజు పేరేందో గని అందరు ఆయన బైరి గడ్డాన్ని జూసి బైరి గడ్డపు రాజు అనే పిలువ బట్టిండ్లు. ఆఖరికి గదే పేరు నికురమయ్యింది.
కొత్త రాజు దేవుని మీద ప్రమాణం చేసి శపథం చేసిండు. ‘ఇయ్యాల్టి నుండి నా రాజ్జెంల ఏ తేడాలు లేకుండా, ఇంటాండ్లా! ఏ తేడాలు లేకుండా అందర్నీ ఒకటే కుటుంబం లెక్క పరిపాలిస్త’ అని గట్టిగ ఒత్తి చెప్పి అభయమిచ్చిండు.
ప్రజలంతా సంకలు గుద్దుకుని సంబురాలు జేసుకున్నరు .
మరునాడే మునీశ్వరుల కాళ్లు గడిగి నెత్తిల జల్లుకున్నడు.
వాళ్ల ఆశీర్వాదం తీసుకున్నడు.వాళ్లతో మంతనాలు జరిపిండు.
అండ్లకేలి ఓ తలపండిన పెద్ద ముని ‘రాజ కుమారా ! నీకు ఈ రాజ దర్బారు వాస్తు ప్రకారం అచ్చిరాదు. దీనికి ఓ మూలన శనీశ్వరుడు కూసున్నడు. ఇదెప్పటికయినా నీ గద్దెకు ప్రమాదం తెస్తది. మా మాట విని వెంటనే మరో బ్రహ్మాండమయిన రాజ దర్బారు నిర్మించి బంగారు సింహాసనం చేయించు’ అన్నాడు.
“అట్లాగే గురు దేవా” – బైరి గడ్డం
పెద్ద పెద్ద శిల్పులను పిలిచి ఆదేశాలిచ్చిండు.
” మీరేం జేత్తరో నాకెర్కలే ఈ రాజు మాటంటే మాటే, ఆరు నెలల్లో కొత్త రాజ దర్బారు నిర్మాణం జరిగి తీరాల్సిందే. దాంట్లోకి గృహ ప్రవేశం జరిగి తీరాల్సిందే” అన్నడు.
అన్నట్టుగనే ఆరు నెలల్ల కొత్త సింహాసనం ఎక్కిండు.
పెద్ద పెద్ద శెట్టీల్ని ,శావుకార్లను పిలిచి మంతనాలు జరిపిండు.
‘మీరే రాజ్జానికి ఎన్నెముక లాంటోల్లు, మీరు మంచిగుంటెనే రాజ్జెం మంచి గుంటది. మీ అరికాళ్లకు ముల్లు ఇరిగితే నా ముని పంటితో పీకుతా ‘అని అభయమిచ్చిండు.
‘రాజ్జెంల జరుగబోయే అభివృద్దంతా మీ చేతుల మీదనే జరగాలే’ గుళ్లు గోపురాలు, కట్టబోయే ప్రాజెక్టులు, తొవ్వబోయే గనులు, ఫోర్ లైన్ రోడ్లు, ఓవర్ బ్రిడ్జీలు, మొబైల్ టవర్లు అన్నిటి కాంట్రాక్టులు మీకే’ – బైరి గడ్డం హామీనిచ్చిండు.
అందరూ “హర హర బైరి దేవ్” నినాదాలు ఇచ్చిండ్లు మరో ఆరు నెలల్లో ఎక్కడ జూసినా పెద్ద పెద్ద నిర్మాణాలు పుట్ట గొడుగుల్లా లేచినయి. అభివృద్ది మూడు పువ్వులు ఆరు కాయలన్నట్లుగా రాకెట్ వేగంతో దూసుక పోతాంది. శెట్టి శావుకార్లంతా మునుపెన్నడూ లేనంత ధనవంతులయిండ్రు. సుట్టు పక్కల రాజ్యాలల్లున్న ధన వంతులను మించి పోయి దశ దిశలా పేరెల్లిండ్లు.
ఓ రోజు రాజు ఆస్థాన కవులు, కళా కారులు, అష్ట దిగ్గజులందరిని ఆహ్వానించి మంతనాలు జరిపిండు. వాళ్లందర్నీ తన ఒడిలో అటిటు కూసో బెట్టుకున్నడు.
రాజుకు కవులు, కళాకారుల కుండే సంబంధం ఈనాటిది కాదన్నడు. రాజు చేసే మంచి కార్యాలు లోకానికంతా తెలిసేలా జేసేది మీరే అన్నడు. అసలు మీరు లేకుంటే ప్రజల్ని మన వైపు తిప్పుకోలేం. అందుకని మన మధుర సంభంధం కలకాలం వర్థిల్లాలే అందరిని తన వైపు కట్టుకున్నడు.
కొందరికి నోటి నిండ బెల్లం గడ్డలు బెట్టిండు. కొందరికి బంగారు గండపెండేరాలు దొడిగిండు. కోరుకున్నోళ్లకు కోరుకున్నన్ని వరాలిచ్చిండు. కోరుకోనివి కూడా తానే గుర్తించి ఇచ్చిండు.
తెల్లారి సంది ఎటుజూసినా రాజు గారి ఘన కీర్తి గురించిన కావ్యాలు, కీర్తనలు, భజనలతో రాజ్యమంతా దద్దరిల్లి పోతాంది. ఈ భూ మండలంలోనే ఈ రాజు అసోంటి రాజే లేడని ప్రచారం జరిగింది.
రాజ్యమంతా ఒకే రకపు గుళ్లు గట్టించిండు. ఒకే రకపోళ్ల ఇగ్రాలు (విగ్రహాలు) బెట్టించిండు. రోడ్లకు, పట్నాలకు, రైలు స్టేషన్లకు పాత పేర్లన్నీ బాగ లేవనీ తీసిపారేసి కొత్త కొత్త పేర్లు, అవి గూడ ఒక్క రకపోళ్ల పేర్లే పెట్టిండు. తన కంటే ముందు రాజ్యమేలినోల్లు అసలు రాజులే కాదు.వాళ్లకు రాజ్యం ఎట్ల ఏలాల్నో తెలువనే తెల్వదు అన్నడు.
గివన్ని జరుగుతాంటే రాజ్యంల అక్కడక్కడ కొంత గుణుగుడు, సణుగుడు మొదలయింది. అక్కడక్కడ బడి పంతుల్లు, బడి పోరగాండ్లు, ప్రజల పక్షానుండే విలేకర్లు జర గట్టిగనే ఇమర్శించుడు పెరగంగనే రాజుగారికి వేగుల వాళ్ల రిపోర్టు అందింది.
రాజుల వారు అగ్గి మీద గుగ్గిలమయిండు.
‘నేను గింత గనం రాజ్జాన్ని అభివృద్ది జేసేందుకు కంటి మీద కునుకు లేకుంట రోజుకు 18 గంటలు పని జేత్తాంటే గీ గుడ్డోల్లకు (అందులకు) కొద్దిగనన్న కనబడుత లేదా? కనబడక పోయినా నా ఆస్థాన కవులు నిద్రాహారాలు మాని 24 గంటలూ చేస్తున్న భజనలు గూడ ఇనబడత లేవా? అసలు వాళ్ల తల కాయల్ల దిమాగున్నదా? పెండ గిట్లున్నదా ? లేకుంటే నా కీర్తి జూడలేక ఈర్ష్యతోటి పక్క రాజ్యపు రాజెవడన్న నాకు వ్యతిరేకంగా కుట్ర జేత్తాండా ? అని గుడ్లెర్ర జేసిండు. గడ్డం నిమిరిండు.
‘ఏయ్ ఎవరక్కడా ? అని కేకేసి వెంటనే మంత్రి అమీర్ షా ను ప్రవేశ పెట్టుండ్లి ‘ అన్నడు.
బట్టతల గోక్కుంట మంత్రి అమీర్ షా వచ్చి పక్కనే ఆసీనుడయిండు.
ఏం సంగతి అమీర్ భాయి మనకు వ్యతిరేకంగా ఎవరెవరో? ఏమేమో? గొణుగుతాండ్లాట గదా – భై.రా
“అరే రాజా భాయి నీ దాక వచ్చిందా ఆ మాట. గిసొంటి చిన్న చిన్న విషయాలల్ల నీ టైం దండగ జేయొద్దని నేను నీకు జెప్పలేదు గనీ గసొంటోళ్లందర్నీ ఎప్పుడో జైళ్ల నూకిన. రామునికి ఆంజనేయుడున్నట్టు నేనుండంగా నీ మీద ఈగ గాదు దోమ గూడ వాలనిత్తనా ? నువ్వు పెద్ద సంగతులు జూస్కో, గిసొంటియి నాకొదిలేయ్ “- అమీర్ భాయి
“కాసేపు నెత్తి గోకి సరే గనీ జైళ్లన్నీ నిండినయి ఏం జేసుడు ? ” అమీర్ షా
“అరే అమీర్ భాయి! దానికేం రంది బడుతానవ్! దేశమంతటా బ్లాకు కొకటి కొత్త జైలు నిర్మాణం పథకం రేపే ప్రకటిస్తా. నువ్వు వాటి నిర్మాణపు పనులు మనోళ్లకే టేక ఇచ్చేటట్టు జూడు” – భై .రా
OK భాయి. – అమీర్ షా
భై .రా – “ఒక్క జైళ్లతోనే ఈ సమస్యను పరిష్కరించలేం అమీర్ భాయి. దీనికి నేను మరో మంత్రం జెప్పుత ఇను .”
‘ఆధ్యాత్మికం ఆధునికం సంయోగమస్తు’
అర్థాత్ – ఆధ్యాత్మికత తోటి ముసలి తరాన్ని, ఆధునికత తోటి యువతరాన్ని మన మైకం లోకి లాక్కోవాలి. అర్థమయిందా? ” అన్నాడు. బైరి గడ్డం
ఈసారి అమీర్ షా బట్ట తలకు బదులు గడ్డం గోక్కున్నడు.
“అర్థమయినట్టే ఉన్నది గని దానికి ఏం చేయాల్నో అర్థం గాకున్నది సామీ” – అన్నడు.
“మరేం లేదు. మన రంబానీ గారికి చెప్పి రాజ్జెమంతా 5 జి నెట్ వర్క్ పెట్టించు. సర్కార్ తరపున 12 ఏండ్ల పిల్లల నుండి సచ్చే ముసలోల్ల దాక అందరికీ ఉచితంగా స్మార్టు పోన్ల పంపిణీ పథకం నేను ప్రకటించేస్తా. 6 నెలలు పైసా ఖర్చు లేకుంటా ఉచిత సేవలు. ముసలోల్లకు కాశాయ సిత్రాలు, పడుసు పోరగాండ్లకు నీలి సిత్రాలు ఫ్రీ.”-బైరి గడ్డం
“బలేగుంది సామీ ఒకే దెబ్బకు రెండు పిట్టలు “- అమీర్ షా .
6 నెలల తర్వాత రాజు సమీక్ష మీటింగుకోసం మంత్రి అమీర్ షా ను బిలిసిండు.
“ఏంటి ? భాయి రాజ్జెంల వృద్దుల, యువత పరిస్థితి ఏట్లుంది ? “-రాజు
“మీ మంత్రం బలే పారింది సామీ !” అమీర్ భాయి
“ఇంగ్లిపీసోడు మనకు చాయ అలవాటు జేసినట్లు, తాగుబోతులంతా సారా సీసాలకు అలవాటయినట్లు, అదేం మహత్యమో గానీ సామీ వయిసోల్లు, ముసలోల్లు అందరూ స్మార్టు పోన్ల కేలి తలకాయలు బైటికి తీస్తలేరు.”
“ఇగ పెండ్లైనోల్లయితే పెండ్లాం పక్కల లేకపోయినా ఉండగల్గుతాండ్లు గని గడియ సేపు పోన్ పక్కల లేకపోతే ఉండలేక పోతాండ్లు సామీ !”
“తాగుబోతులు పొద్దంత జేసిన కట్టం సారా సీసకు తగిలేసినట్లు, కూలి దొరుకన్నాడు పెండ్లాం మెడల పుత్తెల తాడు కుదువ బెట్టి తాగినట్లు, స్మార్ట్ ఫోన్ అలవాటైనంక గట్లనే జేత్తాండ్లు సామీ! గిప్పుడు లోకంల కల్లు దుకాణాలు, మొబైల్ దుకాణాలకే గిరాకి ఎక్కువున్నది సామీ! ఔ గనీ మర్సే పోయిన.”
“మన రంబానీ సారు మాంచి ఖుషీ గున్నడు. ఇయ్యేడు మీ జన్మ దినానికి ‘పుష్పక విమానం’ కానుకగా సమర్పిస్తనని చెప్పమన్నడు సామీ !” అమీర్ భాయి
“అచ్చా! అంతా అనుకున్నట్లే సంతృప్తికరంగా జరుగుతుందన్న మాట. “రాజు సంతృప్తిగా నవ్విండు.
“ఇప్పుడు రాజ్జెంల ఎక్కడన్న సణుగుడు, గునుగుడు ఇనబడుతాందా ?”- రాజు
“మారే ! ఇప్పుడు గంత ఓపిక ,తీరిక ఎవలకున్నది సామీ ! ఎవల ఫోను సగబెట్టుడు వాళ్లకే సరిపోతాంది.”- అమీర్ షా .
కొన్నాళ్లు బోయినంక అంతా నిశ్శబ్దం. ఎక్కడా గొణుగుడు లేదు, సణుగుడు లేదు.
రాజుల వారికి ఓసారి రాజ్జెంల పరిస్థితి ఎట్లున్నదో ? ప్రజలు ఎట్లున్నరో స్వయంగా చూడాలనిపించింది. తాను తలపెట్టిన గొప్ప యాగానికంటే ముందే ఈ పర్యటన చేయాలని నిర్ణయించుకున్నడు.
అయితే మారువేశంలో పోవుడు ఎనుకటి ముచ్చట అట్ల వద్దను కున్నడు.
మంత్రిని ఎంటబెట్టుకుని మందీ మార్బలం తోటి ఆధునిక పద్దతుల్లో రోడ్ షో చేయాలనుకున్నడు.
వెంటనే మంత్రిని సంప్రదించి పథక రచన చేసిండు.
ఓ శుభ ముహూర్తాన పర్యటన ప్రారంభించిండు.
ముందట కొందరు భటులు నడుస్తుండగా కొంత దూరంలో భైరి గడ్డపు రాజు, తనకొక పక్క మంత్రీ అమీర్ భాయి, మరో పక్క ఆస్థాన కవయిత్రి మనుశృతి నడుస్తుండగా ఎనుకంతా నల్ల పిల్లులు నడుస్తున్నయి.
కొంత దూరం పోయాక వీది మలుపు వద్ద ఓ పెద్ద సమూహం నిలబడి వుంది. అంతా పెద్ద పెద్ద సదువులు చదివిన ప్రొఫెసర్లు, పత్రిక సంపాదకులు, మీడియా అధిపతుల్లాగున్నరు.అక్కడాగి వాళ్ల వైపు తిరిగిండు. తేరిపార జూసిండు.
వాళ్లను ఉద్దేశించి
” రెండు రెండ్లు ఆరు అవునా ? కాదా ?” అని అడిగిండు.
గుంపు ఒక్కసారే “అవునూ ,అవునూ! మీరు జెప్పినంక ఆరు గాక మరోటెట్లయితది ? మహారాజా” అని జవాబిచ్చింది.
‘ఇంకా గట్టిగ జెప్పుండ్లి’ మూడుసార్లడిగిండు.
మూడు సార్ల అదే జవాబిచ్చింది – గుంపు
ముసి ముసిగా నవ్వుకొని గడ్డం బర బర గోకి ముందుకు కదిలిండు.
మరో మూల మలుపు దగ్గర ఆగిండు. అక్కడున్నోల్లందరూ వస్తాదుల్లా అట్టకట్ట ఉన్నరు.ఆ గుంపుకేసి తిరిగిండు.
పక్కనున్న గోడ కేసి కుడి చేయి చూపుడు వేలుతో చూపెట్టి
“ఆ గోడ ఉయ్యాల లాగా ఊగుతున్నది .నిజమా ? కాదా ? “అడిగిండు, “నిజమే,నిజమే మీరు జెప్పినంక ఊగకుండ ఉంటదా మహరాజా! “-గుంపు
ఈసారి మంత్రి అమీర్ భాయి వైపు జూసిండు మెచ్చుకోలుగా, ఎప్పుడూ నవ్వనోల్లు ఇద్దరూ నవ్వుకున్నరు.
ముందుకు సాగింది రోడ్ షో.
రోడ్డు పక్కన ఓ చెట్టు కింద రెండు కండ్లు లేని ఓ గుడ్డాయన కూర్చున్నడు. ముందట ఓ బిచ్చపు పాత్ర ఉన్నది. ఆ దారిన పోయేటోల్లు ఆ పాత్రలో చిల్లర పైసలేత్తాండ్రు.
రాజుల వారు అక్కడ ఆగిండ్రు.
‘ఓ పెద్ద మనిషీ ! రెండు రెండ్లు ఆరు అవునా ? కాదా ?’ అని అడిగిండు.
‘బలే వాడివయ్యా! నువ్వెవరో గానీ కండ్లు లేనంత మాత్రాన గంత ఎడ్డోని లెక్క గనబడుతాన్నా? రెండు రెండ్లు ఆరెట్లయితయి ? నాలుగయితయి గనీ “.- గుడ్డాయన.
రాజు ఎగిరి పడ్డడు “బ్లాక్ క్యాట్, క్యాచ్ హిమ్ ” ‘మనిషీ మనిషీ’ పెద్దగా అరిసిండు. నొసటి మీదంతా చెమట పట్టింది.
అమీర్ భాయి, మనుశృతి ఇద్దరూ రాజు అవస్థ జూసి కొంత గాబరా పడ్డరు.
గ్లాసెడు నీల్లు తాగి కొద్దిగా కుదుట పడ్డడు రాజు.
అప్పటికే నల్ల పిల్లులు ఆ గుడ్డాయనకు బేడీలేసి జైలుకు పంపే ఏర్పాటు జేసిండ్రు.
రోడ్ షో మళ్లీ ముందుకు సాగింది.
ఓ ఇంటి ముందర అరుగు మీద ఓ యువకుడు కూర్చుని ఉన్నడు.అతనికి చిన్నప్పుడే పోలియో మూలంగా రెండు కాళ్ళు పీలబడి పోయి ఉన్నయి. చేతుల సహాయంతో శరీరాన్ని ఈడుస్తూ కదులు తున్నాడు.
ఆ యువకుడి దగ్గర ఆగాడు రాజు.
‘ఏయ్ అబ్బాయ్ ! అక్కడ కనబడుతుంది చూడు ఆ గోడ ఊగుతున్నది నిజమేనా ? కాదా ? చెప్పు – రాజు
యువకుడు – “బలే వారు సార్ ! అదేమన్న జీవ పదార్దమా ఊగడానికి ? గోడ ఘన పదార్థం సార్ ఊగది. జర కండ్ల పరీక్ష చేయించుకోండ్లి “.
రాజు మళ్లీ అదిరి పడ్డాడు. ‘మనిషీ .. మనిషీ . . బహుత్ డేంజర్ మనిషీ ‘బ్లాక్ క్యాట్, క్యాచ్ హిమ్’ అరిసిండు.
నల్ల పిల్లులు యువకునికి బేడీలు వేసి జైలు వాహనం ఎక్కించిండ్రు.
ఈసారి రాజుకు ఒళ్లంతా సెమటలు బట్టినయి.
యాత్ర సాలించిండు.దర్బారుకు తిరుగు ప్రయాణమయిండ్రు .
రాజ దర్బారులో ముగ్గురు కూసున్నరు.
మనుశృతి మెల్లగా అడిగింది ?
‘గా వస్తాదుల్లాంటోల్ల గుంపును జూసి దడుసు కోని రాజుల వారు గా గుడ్డోళ్లను, కుంటోల్లను జూసి ఎందుకంత దడుసుకున్నట్టూ ? ‘ అని
దానికి రాజుల వారు చిన్నగ నవ్వి
‘వస్తాదుల్లాంటోల్ల బుర్రల ‘ఆలోచన ‘లేదు భయమున్నది. ఇసొంటోల్లు ఎంతమందున్నా నో డేంజరు. వాళ్లు మనుషుల్లా తిరిగే శవాలు అంతే. కుంటోల్లు, గుడ్డోల్లయినా వాళ్ల బుర్రల్లో భయం లేదు ‘ఆలోచన ‘ ఉన్నది. ‘ఆలోచించే మనిషి’అణు బాంబు కంటే మహా ప్రమాదకరం. అసొంటోడు ఒక్కడున్నా రాజ్యానికి మహా ప్రమాదం’
రాజతంత్రం మర్మం ఇప్పి చెప్పిండు బైరి గడ్డం రాజు.
మనుశృతి అర్థమైందన్నట్లు తలూపింది.
‘అమీర్ భాయి ఇలాంటి మనుషులు మన రాజ్జెంల ఇంకా ఎందరుంటరంటవ్ ? ‘ బైరి గడ్డం
‘లేరు సామీ అసొంటోల్లందరిని ఎప్పుడో శ్రీ కృష్ణుని జన్మ స్థానానికి పంపించిన. వీళ్లెట్లనో తప్పి పోయిన పరిగె లాంటోల్లు అంతే ‘- బరోసా ఇచ్చిండు మంత్రి.
అయితే మరి మన ప్రకటనకు ముహూర్థం (1825 -నెల -తారీకు ) నిర్ణయిద్దాం. ఆలోగా నువ్వు మిగిలిన పరిగె కూడా ఏరేసే పని పూర్తి చెయ్యి -రాజుల వారి ఆజ్ఞ.
కొన్నాళ్ల తర్వాత రాజ్యంలో ఎటు జూసినా నిశ్శబ్దం, ఎక్కడా సనుగుడూ లేదూ, గుణుగుడూ లేదూ. అసమ్మతీ లేదూ, భిన్నాభిప్రాయమూ లేదూ. విమర్శా లేదూ, విపక్షమూ లేదూ. అంతా స్వపక్షమే, అంతా ఏక పక్షమే.
ఒకే రాజ్యం, ఒకే రాజా, ఒకే మాట, ఒకే భాష, ఒకే వేశ బూశ, ఒకే బాట, ఒకే బాణం, ఒకే రకం ‘మనషులు’, ఒకే రకం గుళ్లు, ఒకే రకం విగ్రహాలు, ఎటు జూసినా అంతా ఏకత్వమే. అంతా ఏకాత్మే.
తయారీలన్నీ పూర్తయినట్టు మంత్రిగారి సూచన.
శుభ గడియ రానే వచ్చింది.
రాజుగారి ‘ ప్రకటన ‘ కోసం మహా కుంభమేళ ఏర్పాటయింది.
దిక్కులు పిక్కటిల్లేలా హర హర ‘భైరి గడ్డం దేవ ‘ అనే నినాదాల హోరు మద్య రాజు వేదిక నెక్కిండు .
ఎడమ చేత్తో మైకు అందుకున్నడు. తిరగేసి గడియారం ధరించిన కుడి చేయి ప్రజల వైపు చాచి ఓరగంట గడియారం వైపు ఓ దొంగ చూపు చూసిండు. సరిగ్గా ముహూర్తానికి టైం అయిందని నిర్దారించుకున్నడు.
‘ ప్రజలారా ! నా కుటుంబ సభ్యులారా ! నేను అసొంటి ఇసొంటి రాజును గాను. నేను తలుచు కుంటే అందరికీ చిక్కటి చాయి తాగించగలను, లేదంటే ఏడు చెర్ల నీళ్లు కూడా తాగించగలను. నా నోట ఏదన్నా చెప్పిన్నంటే అది గ్యారెంటీగా చేసే చూపెడుతా. ఇదే భైరిగడ్డం గ్యారెంటీ.
మీకందరికీ గుర్తున్నదో లేదో ! నేను గద్దె నెక్కిన రోజు మీ అందరి ముందు ఒక్క మాట జెప్పిన.నా రాజ్జెంలో ఎలాంటి తేడాలు లేకుండా అందర్నీ’ ఒకే కుటుంబం లాగా ‘ పరిపాలిస్త.
అని చెప్పానా లేదా ? మూడు సార్ల అదే ప్రశ్న సభను అడిగిండు.
అంతకంతకు మరింత గట్టిగా సభ నుండి చెప్పావు. . . చెప్పావు అని గావు కేకలు వినబడ్డాయి.
మరి ఇప్పుడో – -(చేశానా ? లేదా ? అని తాను ప్రశ్నించలేదు ) అన్నాడు అంతే, సభ నుండి “చేశావు – చేశావు “అని కేకలు
‘మరి అదీ నా గ్యారెంటీ ‘ తడాఖా అంటే అన్నాడు.
ఇక నుండి మనదంతా ఒకటే “వసుదైక కుటుంబకం “. అని ముగించిండు.
రాజు ఇప్పుడు నిశ్చింతగా ,నిర్రందిగా రోజుకు 8 గంటలే పని జేత్తాండు.16 గంటలు పండుకుంటాండు.
రాజ భవనంలో పూల పానుపు మీద బండుకున్న రాజుకు తాను జేసిన ఘన కార్యాలన్నీ ఒక్కటొక్కటిగా గుర్తుకొస్తాంటే ఎక్కడ లేని సంతోషంతో గుండె ఉప్పొంగుతాంది. ‘చప్పన్ ఇంచుల చాతీ ‘పగిలిపోయి అండ్లకేలి లావా లెక్క గుండె బయటికొత్తదా ఏంది ? అన్నట్టుగుంది రాజు పరిస్థితి.
అప్పుడే నిన్న రాజ వైద్యుడు జెప్పిన మాట యాది కొచ్చింది.
‘ రాజా! మీకు అమితానందం అచ్చిరాదు, ప్రాణ గండం’
రాజుకు ఒళ్లంతా చెమటలు పట్టినయి.
(అయిపోయింది)
రచనా కాలం – ఎప్రిల్/2024




