జీరం ఘాటీ ఆదివాసీల మరణశిక్ష,సీల్ధా ఆదివాసీల జీవిత ఖైదు శిక్షలను రద్దు చేయాలి.
అన్ని జైళ్ళలోని రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి.
2013 సంవత్సరం,ఛత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు చేసిన దాడిలో సల్వాజుడుం నేతతో సహా 29 మంది కాంగ్రెస్ నాయకుల మరణానికి కారకులంటూ ఈ దాడితో ఏ విధమైన సంబంధం లేని పది మంది ఆదివాసీ దోషులకు జగదల్ పూర్ లోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు సెప్టెంబర్ 16 న మరణ శిక్షను ఖరారు చేసింది.వీరిలో ఒకరు ఇంతకుముందే మరణించారు. మిగిలిన వారు హైకోర్టుకు అప్పీలు చెసుకునే అవకాశం ఉన్నా ఇప్పటికే 13 సంవత్సరాల జైలు జీవితం గడిపి ఆర్ధికంగా,మానసికంగా కుంగిపోయిన ఈ అమాయకపు ఆదివాసీ జీవితాలు ప్రస్తుత తీర్పు వల్ల అర్ధాంతరంగా ముగియనున్నాయి.
ఈ పది మంది జీరం ఘాటీ దాడిని ఆలోచించి,ప్రణాళిక రూపొందించి లేదా ఆదేశించారని ప్రాసిక్యూషన్ కూడా ఆరోపించడం లేదు. దాడి ప్రణాళిక,దిశా నిర్దేశం సీనియర్ మావోయిస్టు నాయకులదేనని ప్రాసిక్యూషన్ కేసు స్వయంగా పేర్కోంటుంది. ఈ కేసు ప్రస్తుత విచారణలో వారిలో ఎవరినీ విచారణకు తీసుకురాలేదు. ఉరిశిక్షను ఎదుర్కొంటున్న వ్యక్తులు,ప్రాసిక్యూషన్ స్వయంగా దాడికి ప్రధాన రూప కర్తలుగా పేర్కోన్నవారు కాదు. అయినా వీరి పై శిక్ష విధించింది కోర్టు. చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలోనే అనేక ఆపరేషన్లలో భాగంగానే ఈ అరెస్టులు జరిగాయి. నేడు ఆ ఉద్యమమే లేదని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. కొంత మంది మావోయిస్టులు,సానుభూతిపరుల పై ఉన్న కేసులను విచారించకుండా విడుదల చేసి అనేక మందిని శిక్షించడానికి పూనుకోవడం కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే జరుగుతుందని దేశ వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు ఇదే సెప్టెంబర్ లో ఛత్తీస్ ఘడ్ లోని కాంకేర్ జిల్లాలో కోర్టు పీలురామ్ ఆచ్లాకు యావజ్జీవ శిక్ష విధించింది. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం కోర్టు దేవేంద్ర,శిల్పా,స్వప్నలకు ఐదేండ్ల జైలుశిక్ష విధించగా బల్మూరి నారాయణరావు, రాజేలకు ఏడేళ్ల జైలుశిక్ష, విధించింది. మరికొంత మందికి కూడా ఇదే విధంగా కోర్టులు శిక్షలు వేసే అవకాశం ఉంది. అరెస్టులు, శిక్షలకు గురవుతున్న వారిలో అత్యధికులు ఆదివాసీలే. ప్రభుత్వం ప్రకటించినట్లుగా మావోయిస్టు ఉద్యమ ప్రాంతాల్లో ‘సుస్థిర శాంతి నెలకొని, సమగ్రాభివృద్ధి’ జరుగాలంటే ఉద్యమకారులతో పాటు,ఈ అమాయక ఆదివాసీల పై విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలి. అదే విధంగా 23 మంది సీల్ధా (పశ్చిమ బెంగాల్) కేసు దోషుల పై విధించిన జీవిత ఖైదు శిక్షను, ఇంకా వివిధ రాష్ట్రాలలో గతంలోనూ, ఇటీవల శిక్షలు ఖరారు చేయబడ్డ వారందరి శిక్షలను రద్దు చేసి, జైళ్ళలో నిర్భంధించబడ్డ రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి.
అన్ని దేశాల్లో మరణశిక్ష అనేది వ్యవస్థీకృత హత్యతో సమానం. ఇది జీవించే హక్కును హరించే ఒక అమానుషమైన, క్రూరమైన శిక్షా విధానం. జీవిత ఖైదుకన్నా ఇది నేరాలను మరింత ప్రభావవంతంగా అరికట్టలేకపోతున్నదని ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు తెచ్చిన ఒత్తిడి కల్పించిన స్పృహతో 2025 నాటికి 114 దేశాలు మరణశిక్షను రద్దు చేశాయి. 23 దేశాలు మరణశిక్షను చట్టంలో ఉంచినప్పటికీ గత పది సంవత్సరాలుగా అమలు చేయడం లేదు. ఉరిశిక్షను అమలు చేయబోమని విధానపరమైన నిర్ణయం తీసుకున్నాయి. అతి పెద్ద ప్రజాస్వామిక దేశమని, శాంతికాముక దేశమని చెప్పబడుతున్న దేశంలో అమాయక ఆదివాసీల ఉరిశిక్షను రద్దు చేయలేమా. గతంలో సుఫ్రీం కోర్టు ప్రకటించినట్లు మన పిల్లలను మనమే చంపుకుందామా. ఉరిశిక్ష అమలు జరుగుతున్న మన దేశంలో నేరాలు పెరుగుతున్నాయి గానీ తగ్గడం లేదు. నేరాలకు గల సామాజిక మూలాలను మార్చనంత వరకూ ముఖ్యంగా సామూహిక లక్ష్యాల సాధనకు వ్యతిరేకంగా గురిపెట్టే ఉరిశిక్షల వల్ల మార్పును సాధించలేమనే వాస్తవాన్ని పాలకులు గ్రహించాలి.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టులు, ప్రజా సంఘాల నేతలు, ప్రజాస్వామికవాదులు మరియు సానుభూతిపరులుగా వేల మంది అక్రమంగా అరెస్టు చేయబడ్డారు. ఉపా చట్టంతో పాటు అనేక కేసులు మోపబడ్డాయి. తెలంగాణ జైళ్ళలో 50 మంది ఆంధ్ర ప్రదేశ్ జైళ్ళలో 50 మంది, ఛత్తీస్ ఘడ్ జైల్లో 1200 మంది, ఝార్ఖండ్ జైల్లో 1200 మంది, ఇంకా ఇతర రాష్ట్రాలలో కూడా పదుల సంఖ్యలో అరెస్టు చేయబడి విచారణ, శిక్షలు లేకుండానే సంవత్సరాల తరబడి అమానవీయ పరిస్థితుల్లో దుర్భర జీవితాలను గడుపుతున్నారు. విచారణలోని జాప్యం,బెయిల్ నిరాకరణ మరియు పదే పదే అరెస్టుల వల్ల శ్రమజీవులైన ఈ ఖైదీల కుటుంబాలు చిన్నాభిన్నమౌతున్నాయి.
జైళ్ళలోని అమానవీయ పరిస్థితులను ముఖ్యంగా మావోయిస్టు ఖైదీలు, ప్రజాస్వామికవాదుల పట్ల రాజ్యం పవర్తించే కక్ష్య సాధింపు చర్యలను దృష్టిలో పెట్టుకొన్నప్పుడు జైళ్ళు పరివర్తనా కేంద్రాలు అనే ప్రచారం వట్టి బూటకం. అనేక సంవత్సరాల తరబడి విచారణలోనున్న ఖైదీలుగా జీవితాలను గడిపి నిర్దోషులుగా విడుదలైన తరువాత ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మలచడమే మన దేశపు జైళ్ళు చేసే పని. ఇందుకు ప్రొఫెసర్ సాయిబాబా ఉదంతం ఇటీవల సాక్ష్యం. ఈ వరుసలో వందల వేల మంది ఖైదీలు ఉన్నారు. 22 కేసులు మోపబడి, పదే పదే బెయిల్ తిరస్కరణకు గురౌతూ విచారణలోనున్న ఖైదీగా ఓడిశాలోని చౌద్వార్ సర్కిల్ జైల్లో ఆరున్నర సంవత్సరాల నా జైలు జీవితానుభవం కూడా ఇదే. బెయిల్ నియమం, జైలు అనేది మినహాయింపు అనే సుఫ్రీంకోర్టు సూత్రం ఎక్కడా అమలు కావడం లేదు. విచారణ లేకుండా సంవత్సరాల తరబడి నిర్భంధించడం ఇక్కడ సర్వసాధారణం. మన దేశపు జైళ్ళు నిశ్శబ్ద హత్యల, చిత్ర హింసల కేంద్రాలు. ఈ జైళ్ళు అనబడే నిర్భంధ కేంద్రాల్లో ముఖ్యంగా మావోయిస్టు మరియు సానుభూతి పరులుగా జైలు జీవితాలను గడుపుతున్న వారి దుస్థితి ఎంతో దుఃఖ దాయకం. వయసుడిగి, ప్రాణాంతక రోగాల బారినపడి, వసతులలేమితో పాటు స్వేచ్ఛాయుతమైన, ప్రజాస్వామికవాతావరణం లేకుండా, అనునిత్యం అభద్రతలో గడిపే ఖైదీల జీవితాలు వర్ణనాతీతం. కనీసం బయటి నుండి పలకరించే వారు లేక సంవత్సరాల తరబడి జైళ్ళలోని ఒంటరి గదుల్లో కొందరినైతే ఒక్కోసారి బేడీలు వేసి బంధించబడె ఖైదీల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవల పౌర,మానవ హక్కుల సంఘాలు ప్రకటిస్తున్న సమాచారాన్ని బట్టి మధ్యప్రదేశ్, ఓడిశా, యూపి, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్ర, డీల్లీ మొదలగు ప్రాంతాలలో అనేక వందల మంది విచారణ లేకుండా జైళ్ళలో అక్రమంగా నిర్భంధించబడ్డారు. వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాథమికమైనదని, వేగవంతమైన విచారణ అత్యవసరమని, అనవసరమైన న్యాయ జాప్యం వ్యక్తి స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు చెపుతున్నా ఆచరణలో అమలుకావడం లేదు. దేశ ప్రజల అభివృద్ధి, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, శాంతి, సమానత్వం మొదలగు ఉన్నతాశయాలతో పోరాడుతున్న వారిని అక్రమంగా అన్యాయంగా నిర్భంధించి మన సమాజం సాధించేదేమీ లేదని పాలకులు గ్రహించి శిక్షలన్నింటినీ రద్దు చేసి రాజకీయ ఖైదీలందరినీ వెంటనే విడుదల చేయాలి.
సెప్టెంబర్, 2026.




