చౌసా – గాజా కవిత్వం

తెలుగు నుండి ఆంగ్లంలోకి ‘బిసాన్ ఓవ్ డా’ పేరిట అనువదించారు,

పెట్టుడు రెక్కలు కథా సంపుటి,

సైరా మా బళ్ళారి పాటల సంపుటి,నెర్రెలు -రాయలసీమ కరువు పై కవితా సంపుటి,

అద్దంలో బొమ్మలు కథా సంపుటి,

అక్షరకాంతులు (విమర్శ వ్యాసాలు),నా తొలి జీవితం … ఫెడల్ కాస్ట్రో ,నా స్మ్రుతిలో చెగువేర  …  ఫెడల్ కాస్ట్రో ( అనువాదం) ,

చౌసా – గాజా కవిత్వం

తెలుగు నుండి ఆంగ్లంలోకి ‘బిసాన్ ఓవ్ డా’ పేరిట అనువదించిన

రచయిత, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు మాట్లాడే పుస్తకాల గురించి చెప్పిన విశేషాలు…

1. మీకు పుస్తకాలు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా పరిచయం అయ్యాయి?

పుస్తకాలు నాకు మా ఇంట్లోనే పరిచయమయ్యాయి. కర్నూలు బి.క్యాంపు గ్రంథాలయం నుండి ఇంట్లో పెద్దవాళ్ళకు పుస్తకాలు తెచ్చి ఇచ్చే క్రమంలో అక్కడ చందమామ, బాలమిత్ర పుస్తకాలను చూడడం జరిగింది. మొదట వాటిలోని ఒక పేజీ కథలను చదవడం తరువాత పెద్ద కథలనూ చదవడం అలవాటయింది. తరువాత వారపత్రికలు చదవడం, సితార, జ్యోతి చిత్ర సినిమా పుస్తకాలు, ఆ తరువాత ఇంటరు సెలవుల్లో డిటెక్టివ్ పుస్తకాలు, తరువాత నవలలు ఇలా సాగింది క్రమం. ఆ తరువాత సాహిత్యం పరిచయమైన తరువాత ఇవి కదా అసలైన పుస్తకాలు అని తెలిసొచ్చింది. ఏమైనా పుస్తక పఠనంలోకి లాగిన పుస్తకాలని మరచిపోలేదు, అందుకే  వాటిగురించి ప్రస్తావించకుండా ఉండలేను.

2. మీరు పుస్తకాలను ఎంపిక చేసుకునే పద్ధతి, సేకరించే విధానం గురించి, భద్రపరిచే పద్ధతుల గురించి.

పుస్తకాలను ఎంపిక చేసుకునే విధానం మన అభిరుచినిబట్టి ఉంటుంది. మొదట్లో కవిత్వం, కథలతో, నవలలతో మొదలైనా తరువాత విమర్శ, అనువాద పుస్తకాలను కొనడం అలవాటైంది. వామపక్ష భావజాలంగల పుస్తకాలు కూడా మొదటినుండి తీసుకోవడం అలవాటు. ఇతర అభ్యుదయ సాహిత్యం కూడా ఇష్టం.

ప్రజాశక్తి, విశాలాంధ్ర, నవోదయ పబ్లిషర్స్ ఇలా ఎక్కడ పుస్తకాల షాపులు కనిపించినా ఆగి కొనడమే. కర్నూలుకు విశాలాంధ్ర, ఎమెస్కో మొదలైనవారి బస్సులు వస్తూ ఉంటాయి. అవేకాక పుస్తక ప్రదర్శనలకు పోవడం అలవాటు. ఇప్పుడు ఆన్ లైనులో కూడా తెప్పించుకుంటున్నాము. శతజయంతులు లాంటి, మరికొన్ని ప్రత్యేక సందర్భాలలో వేసే పుస్తకాలు, ఇతర రచయితలు పంపించే పుస్తకాలు కూడా చాలా ఉంటాయి.

పుస్తకాలను భద్రపరచే విషయంలో పూర్తిగా సఫలం కాలేదు. ఇంట్లో ఒక పెద్ద గది ప్రత్యేకంగా కట్టించుకొని అందులో గూళ్ళు కట్టించడం జరిగింది కాని వాటికి అద్దాలు వేయించాలని అనుకున్నా ఆ పని జరగలేదు. ప్రత్యేకంగా పుస్తకాల ర్యాకులు కొనాలి కూడా. అప్పుడు పుస్తకాలు ఎక్కువరోజులు మన్నుతాయి. పుస్తకాలు కొనడం మీద, చదవడం మీద ఉన్న ధ్యాస వాటిని భద్రపరచడంలో కాస్త తక్కువేనని ఒప్పుకోవాలి. అలాగని వాటిని అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగానే పెట్టుకుంటున్నాను.

3. మీరు చదవాలనుకుని చదవలేకపోయిన లేదా సేకరించాలనుకుని సేకరించలేకపోయిన పుస్తకాల గురించి

మొదట చెప్పుకోవలసింది తెచ్చుకొనికూడా చదవని, చదవలేకపోయిన పుస్తకాలు చాలా ఉన్నాయి. అంటే పుస్తకం మొత్తం చదవకపోయినా అవసరమనుకున్న, ఆసక్తికరమైన అంశాలు చదవడం జరిగింది.

సేకరించాలనుకుని సేకరించలేకపోయిన పుస్తకాల జాబితా కూడా పెద్దగానే ఉంది.

పై రెండు ప్రశ్నలకు కలిపి నాతోపాటు అందరికీ సూచన ఏమిటంటే చదవడానికి ఒక ప్రణాళిక వేసుకోవడమన్నది. ఇది ఎవరికివాళ్ళు చేసుకోవలసిన ఆత్మపరిశీలన. నేను కూడా.

ఇక్కడే ఒకమాట చెప్పుకోవాలి, సాహిత్య సృజన, సాహిత్య కార్యక్రమాల మధ్య ఈ అధ్యయనం అన్నది చాలా ముఖ్యమైనది. కొందరు చాలా పుస్తకాలు చదివిన మిత్రులున్నారు. ఎక్కడ ఏవిషయం అడిగినా టక్కున చెప్పేస్తారు. వారు చదవడాన్ని మాత్రమే ఒక తపస్సులాగా చేస్తున్న వాళ్ళు. సాహిత్య జీవితంలో చదవడంపైన శ్రద్ధను పెంచే ప్రశ్నలు వేశారు మీరు.

4. ఎంతో ఇష్టమైన, మీరు పోగొట్టుకున్న పుస్తకాల గురించి.

బాధకు గురిచేసే ప్రశ్న ఇది. స్కిప్ చేస్తున్నాను.

5. మీకు ప్రాణ సమానమైన పుస్తకాల గురించి.

జాబితా పెద్దది. కుదించి కొన్ని చెబుతాను.

ఏడు తరాలు, అమ్మ, మార్క్సిస్టు సాహిత్యం.

చదువు నవల, ఖడ్గసృష్టి కళాశాలలో పాఠ్యాంశాలు.

జాషువ సాహిత్యం ముఖ్యంగా నాకథ, గబ్బిలం, కరుణశ్రీ రచనల్లోన పుష్పవిలాపం, గురజాడ రచనలు,  మహాప్రస్థానం, ప్రేమ్ చంద్ కథలు, కొకు, గోర్కీ, బుచ్చిబాబు వ్యాసాలు, ఆదివిష్ణు, ఎర్రంసెట్టి సాయి, గుడిపూడి శ్రీహరి, శ్రీరమణ, జంధ్యాల హాస్యరచనలు.

6. ఏ సమయంలో ఎలా ఎక్కడ మీరు పుస్తకాలను చదివే పద్ధతుల గురించి.

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ లో పనిచేసి గత ఆగస్టులో ఉద్యోగవిరమణ చేశాను. మాకు ఐదురోజులే పనిదినాలు. రోజూ కొద్దిగా చదివినా శని ఆదివారాల్లో చదివే వీలుంటుంది. ఇప్పుడు చదవడానికి సమయం బాగానే ఉందికాబట్టి అవసరం, అవకాశాన్నిబట్టి చదువుతున్నాను. సయయం, స్థలం ఎక్కువగా ఇంట్లోనే. పి.డి.ఎఫ్ లో ఉన్నవి ఎక్కడైనా చదువుతా. ఎలా అన్నప్పుడు, అధ్యయనం కోసం చదివే పుస్తకాలు మాత్రం అండర్ లైన్ చేసుకుంటూ, నోట్స్ రాసుకుంటా.

7. మీలో, మీ జీవితంలో పుస్తకాలను చదవడం వల్ల వచ్చిన మార్పుల గురించి.

పుస్తకాలు ఒక కొత్త ప్రపంచాన్ని చూపాయి. తిన్నామా, పడుకున్నామా… లాగ సాగుతున్న జీవితంలో, అరే, జీవితంలో ఇంకో జీవితం ఉంది అది పుస్తకాల్లో ఉంది అన్న విషయం తెలిశాక ఇక వాటితో సాంగత్యం వీడలేదు. ఇప్పుడు జీవితంలో ఒక భాగం పుస్తకాలా, లేక పుస్తకాల్లో జీవితం ఒక భాగమా అనేంతగా పుస్తకాలు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించాయి. ఒక వయస్సు వచ్చాక మనిషిని తీర్చిదిద్దే పుస్తకాలే స్నేహితులుగా మారిపోయాయి. జీవితంలో ప్రతి సమస్యకు అవి పరిష్కారాల్ని చూపాయని చెప్పలేము కాని జీవితాన్ని ఎదుర్కోవడంలో, జీవితాన్ని జీవించడంలో నాతో పాటు పుస్తకాలు ఉన్నాయన్న భరోసా ఉన్నందువల్ల జీవితం చక్కగా నడుస్తోంది.

Leave a Reply