పోటీ మొదలైంది 
అక్షరాలు మొలకెత్తాల్సిన పేపర్లమీద
నెత్తుటి మందారాల రంగు పూస్తుంది

రణధూళి పొరల మధ్య
పిల్లల ఆకలి ఏడుపుల మధ్య
ఈ సంధి విలువెంత ?

శిథిల యినుప ఊసకు
వేలాడిన బిడ్డ
తల్లి అరుపుల శోకం మధ్య
ఈ సంధి విలువెంత?

ఎత్తయిన హర్మ్యాల నాగరికతల
సాంకేతికత
నేలచూపులు చూసిన
అనాగరిక దూరచూపు వర్తమానమెంత?

ఇప్పుడు
ఇక్కడ ఏ పాఠశాల
గోడను ముట్టుకున్నా
కేరింతల్లాగిన పిల్లల కుర్చీలు
కదలాడుతాయి.

దేహం నుంచి వేరైన చేతులు
బలపాల కోసం వెతుకుతాయి.

రంగురంగులతో తడవాల్సిన
పుస్తకాలిప్పుడు
నెత్తుటిరంగుతో హోళీ చేసుకుంటున్నాయి
హాయిగా నిద్రపోతున్న దేహాలిప్పుడు
మృతదేహాలయ్యాయి
ఇప్పుడు ఏ తూనీగ ఇక్కడ ఎగరదు
ఏ కోయిలా కూజితాలు
పలకదిప్పుడు

ఈవేళ
నీకు
హార్మూజ్ మార్గమిచ్చేస్తా
ఇంధన బావులిచ్చేస్తా
ఓడల్లో క్రూడాయిల్ నింపేస్తా
ఇంకా ఏదయినా ఎంతైనా
ఇచ్చేస్తా ..!

నాకు మాత్రం ఒక సంధి కావాలి
శిథిలాల మధ్య ఆగిన
చిన్నారి చిరునవ్వు
తిరిగి ఇస్తావా?

(ఒక పాఠశాల విద్యార్ధుల మీద అమెరికా బాంబు వేసినప్పుడు సందర్భం)

Leave a Reply