గత అక్టోబర్‌లో 85 ఏళ్ల విప్లవ కవి వరవర రావు పన్ను శస్త్రచికిత్స కోసం తన స్వస్థలమైన హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతించాలని కోర్టును కోరినప్పుడు, కోర్టు నిస్సిగ్గుగా నిరాకరించింది. 2018లో అరెస్టయిన తర్వాత తలోజా జైలులో రెండన్నరేళ్లు గడిపిన అనంతరం వరవర రావుకు ముంబై దాటి వెళ్లకూడదనే షరతుతో మెడికల్ బెయిల్ మంజూరైంది, కుఖ్యాత భీమా కోరేగావ్ కేసుకు సంబంధించి ఏళ్ల తరబడి జైలులో గడిపి బెయిలుపై విడుదలైన వారందరిపైనా దాదాపు ఇదే విధమైన ఆంక్షలు ఉన్నాయి.
కానీ, ఈ ఏడాది మార్చి 13న ఒక కుట్రపూరిత ఉపా కేసులో అరెస్టయిన అమెరికా పౌరుడు మాథ్యూ వాన్ డైక్, ఆరుగురు ఉక్రెయిన్ పౌరులు తమ ఇళ్లకు వెళ్లేందుకు అంటే వరుసగా అమెరికా, ఉక్రెయిన్‌లకు వెళ్ళడానికి సెప్టెంబర్ 24న ఒక ఢిల్లీ కోర్టు అనుమతించింది. విశేషమేమిటంటే, దీనికి ముందే వారిపై ఉన్న కేసు నుండి ఉపా సెక్షన్లను తొలగించారు; నిర్ణీత సమయంలోగా ఎన్ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో విఫలమవడంతో, వారు డిఫాల్ట్ బెయిల్ పొందగలిగారు.
వారిపైన నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో మోపిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. వారందరూ ఎలాంటి చట్టపరమైన పత్రాలు లేకుండా భారతదేశంలోకి, ఆ తర్వాత మిజోరాంలోకి ప్రవేశించారని; ఈశాన్య రాష్ట్రాల ఉగ్రవాదుల సహాయంతో పొరుగు దేశమైన మయన్మార్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటుదారులకు డ్రోన్లు; ఇతర ప్రాణాంతక ఆయుధాలను సరఫరా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అలాగే వారు ఈ తిరుగుబాటుదారులకు శిక్షణ కూడా అందించినట్లు సమాచారం. కొద్దికాలం క్రితం, భారతదేశంలో పూర్తిగా నిషేధించబడిన స్టార్‌లింక్ (Starlink) పరికరాలు ఈశాన్య ప్రాంతంలోని ఉగ్రవాదుల వద్ద దొరికినట్లు సమాచారం.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, భారతదేశంలో అరెస్టవడానికి కేవలం కొన్ని రోజుల ముందు, మాథ్యూ వాన్ డైక్ లిబియా”విముక్తి”కి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తన ఎక్స్ (X) ఖాతాలో రాస్తూ, తాను ప్రస్తుతం మరో రహస్య మిషన్‌లో ఉన్నానని, అయితే భద్రతా కారణాల దృష్ట్యా తన స్థానాన్ని వెల్లడించలేనని పేర్కొన్నాడు. ఆ సమయంలో ఆయన భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నాడని, తన ఆరుగురు ఉక్రెయిన్ సహచరులతో కలిసి ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నాడని ఇప్పుడు స్పష్టమైంది. మాథ్యూ వాన్ డైక్ గతంలో లిబియా, ఉక్రెయిన్, మధ్యప్రాచ్యం తదితర ప్రాంతాలలో అమెరికా ప్రాయోజిత ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నాడు.
ఇది దేశ భద్రతకు సంబంధించిన అత్యంత తీవ్రమైన అంశం. అయినప్పటికీ, మోడీ ప్రభుత్వ చొరవ వల్ల, వారు అరెస్టయిన కేవలం ఏడు నెలల్లోనే అమెరికా, ఉక్రెయిన్‌లోని తమ స్వస్థలాలకు చేరుకున్నారు. దీనికి విరుద్ధంగా, ‘జీరమ్‌ ఘాటి దాడి కేసు’ను పరిశీలిస్తే, ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యాలు లేకపోయినా 10 మంది ఆదివాసీలకు, (ఇద్దరు మహిళలు) మరణశిక్షను విధించారు. మరణశిక్ష పడేనాటికే వారు జైలులో 13 సంవత్సరాలు గడిపారు.
ప్రభుత్వ ప్రత్యక్ష ఒత్తిడికి తలొగ్గి కోర్టులు, భద్రతా సంస్థలు ఎలా పనిచేస్తాయో అనడానికి ఇది నిదర్శనం. అంతకంటే ముఖ్యంగా, మోడీ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి ఏ స్థాయిలో తలొగ్గుతుందో ఇది స్పష్టం చేస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అది అమెరికా కాళ్లమీద పడింది.
అమెరికా గతంలో భారతీయులను చేతులు, కాళ్లకు బేడీలు వేసి అత్యంత అమానుషమైన రీతిలో తిరిగి భారతదేశానికి పంపిన తీరును మనం గుర్తుచేసుకోవచ్చు. కానీ ఇప్పుడు, అంతటి తీవ్రమైన ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా, ఉక్రెయిన్ దేశస్తులను మనం ఎంతో గౌరవంగా వారి ఇళ్లకు సాగనంపుతున్నాము.
‘ది వైర్’ తన ఒక నివేదికలో, భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్, మాథ్యూ వాన్ డైక్ పరిస్థితి గురించి అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతోనూ, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో మాట్లాడినట్లు వెల్లడించింది. ఈ ఒక్క అంశమే ఈ విషయంలో అమెరికాకు ఉన్న “డీప్ స్టేట్” (రహస్య రాజ్యం) పాత్రను సూచిస్తోంది. ‘న్యూస్‌18’ నివేదిక ప్రకారం, మయన్మార్-భారత్ సరిహద్దులో మాథ్యూ వాన్ డైక్, ఆరుగురు ఉక్రేనియన్ పౌరుల కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని రష్యా భద్రతా ఏజెన్సీ భారత భద్రతా సంస్థలకు అందజేసింది. ఇది భారత నిఘా సంస్థల వైఫల్యంపైన కూడా ప్రశ్నలను లేవనెత్తుతోంది.

ఈ విశ్లేషణను ముందుకు తీసుకెళ్లడం కష్టం కాదు. ఈ సమాచారం ఆధారంగా, ఏ వారిని ఎన్ఐ అరెస్టు చేసినప్పుడు, వారు సిఐఏ సూచనల మేరకు పనిచేస్తున్నట్లు కనుగొన్నట్లు సమాచారం. ఆపై, అమెరికా ఒత్తిడి కారణంగా, వారిని విడుదల చేయాల్సి వచ్చింది.
ఇది అంతకంటే తీవ్రమైన మరో విషయాన్ని కూడా వెల్లడించింది: భారతదేశాన్ని లేదా దాని భద్రతా సంస్థలను విశ్వాసంలోకి తీసుకోకుండానే అమెరికా భారత భూమిపైన ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోంది. అంటే అమెరికాకు భారతదేశంపై కనీస గౌరవం లేదా చింత లేదు. స్పష్టంగా చెప్పాలంటే, ఇది మోడీ అనుసరిస్తున్న సిగ్గుమాలిన అమెరికా అనుకూల విధానాల ఫలితమే.

మయన్మార్‌లోని సైనిక పాలనకు చైనా పూర్తి మద్దతు ఇస్తుండగా, సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సాయుధ తిరుగుబాటుదారులకు అమెరికా మద్దతు ఇస్తున్నట్లు మనకు తెలుసు. వాన్ డైక్, ఆరుగురు ఉక్రేనియన్ పౌరులు ఈ అమెరికన్ ప్రాజెక్ట్‌లో భాగమే. అయితే, ఈ కార్యకలాపాల కోసం భారత భూభాగాన్ని ఉపయోగిస్తున్నారనేది ప్రమాదకరమైన విషయం —గత మూడేళ్లుగా జాతి హింసతో అట్టుడుకుతున్న భూభాగం ఇది.

చైనాతో భారతదేశ సంబంధాలు అత్యంత కష్టకాలంలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో, ఈ రకమైన ఘటనలు భారత్-చైనా సంబంధాలను మరింత ప్రమాదకరమైన స్థాయికి తీసుకెళ్లగలవు. అవి యుద్ధ పరిస్థితిని కూడా సృష్టించవచ్చు. మోడీ తప్పుదారి పట్టించిన విదేశాంగ విధానం కారణంగా, చైనాతో, మన ఇతర పొరుగు దేశాలన్నింటితో సంబంధాలను దెబ్బతీసుకుంటూ, చైనాను నిరోధించే అమెరికన్ వ్యూహాంలో మనం ఇప్పటికే భాగమయ్యాము.
We should remember what Henry Kissinger once said: “It may be dangerous to be America’s enemy, but to be America’s friend is fatal.”

అఫ్ఘానిస్తాన్‌ను అస్థిరపరచడానికి అమెరికా పాకిస్తాన్ భూభాగాన్ని ఎలా ఉపయోగించుకుందో, ఆ తర్వాత పాకిస్తాన్‌కు ఏమైందో మనం మరచిపోకూడదు. అలాగే, మణిపూర్‌లో కుకీ తిరుగుబాటుదారులకు ఒక మాజీ అమెరికన్ సైనికుడు డేనియల్ స్టేఫాన్ కోర్ట్నీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, డ్రోన్‌లను పంపిణీ చేస్తున్నట్లు ఉన్న 2023 నాటి వైరల్ వీడియోను కూడా మనం గుర్తుంచుకోవచ్చు.

వాస్తవానికి, వాన్ డైక్, ఆరుగురు ఉక్రేనియన్ పౌరుల ఉదంతం సాధారణమైనది కాదు. ఇది భారతదేశ వైఫల్యాలన్నింటికీ ఒక ప్రతీక. లేదా మరో మాటలో చెప్పాలంటే, భారతదేశం అమెరికాకు ఒక “సాటిలైట్” (ఉపగ్రహ దేశం) లాగా మారుతుందనడానికి ఇది ఒక నిదర్శనం.

హెన్స్రీ కిస్సింజర్ ఒకసారి చెప్పిన మాటను మనం గుర్తుంచుకోవాలి: “అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరమేమో గానీ, అమెరికాకు స్నేహితుడిగా ఉండటం ప్రాణాంతకం.”


https://countercurrents.org/2026/09/the-release-of-van-dyke-and-six-ukrainian-citizens-symbolises-the-indian-governments-shameless-surrender/


తెలుగు : కె. పద్మ

Leave a Reply