ఎన్ని వేల ప్రయోగాలు
ఈ నేల మట్టి నుంచి విరబూస్తే
మనమీరోజు హరితగీతాలమై ప్రవహిస్తున్నాం
తెల్లని బువ్వ పాటలు పాడుకుంటున్నాం
ఎన్ని లక్షల శరీరాలకు
వానచినుకులు తూట్లు పొడిస్తే
ఎండ నిప్పుల కొర్రాయితో మలాము పూస్తే
తలమీద ఇంత నీడను కప్పుకున్నాం
ఎంతమంది మన తాతలు
ప్రయోగాల ప్రమాదాల మధ్య గ్రీజుగా నుజ్జు నుజ్జయితే
మన ఇంట్లోని వస్తువులనుంచి
హాయిగా సుఖాన్ని పిండుకుంటున్నాం
ఎంతమంది శాస్త్రవేత్తలు
నెత్తురును చెమట చుక్కలుగా ధారబోస్తే
భోగోళాన్ని బంతిలా చేసుకొని పిట్టల్లా వాలి
మూలమూలల్లోనూ గూళ్ళు కట్టగలుగుతున్నాం
ఎన్ని మెదళ్లను
సైన్సు ఆకురాయి మీద సానపడితే
చంద్రుని మీద మన జెండా నాటగల్గుతున్నాం
మంత్రాలకు చింతకాయలు రాలలేదు
విజ్ఞాన శాస్త్రం మెట్లు లేకుండా
చంద్రుని చల్లని కౌగిలింతలు దక్కలేదు
భూమి మీదనయినా
చంద్రుని మీదనయినా
మనిషి విజయమెప్పుడు
సైన్సు విజయమే!
-తోకల రాజేశం




