మరణశిక్ష అనేది ప్రాథమిక జీవించే హక్కును ఉల్లంఘించడమే కాకుండా, అత్యంత క్రూర, అమానుష, అవమానకరమైనది. నిందితుడు ఎవరైనా, నేర స్వభావం ఎలాంటిదైనా, వారు దోషులైనా లేదా నిర్దోషులైనా—మినహాయింపు లేకుండా అన్ని కేసులలోనూ మరణశిక్షను వ్యతిరేకిస్తాం. మరణశిక్ష పద్ధతులు అన్నీ అమానుషమైనవి, ఆమోదయోగ్యం కానివి. మరణశిక్షను పూర్తిగా రద్దు చేయాలనేదే మా వాదన.

ఇతర రకాల శిక్షలు వేసినప్పటి కంటే మరణశిక్ష వేయడం వల్ల ఎక్కువగా నేరాలను నివారించలేదు అని ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలు నిరూపించాయి. చాలా తరచుగా, ఇది ప్రభుత్వ నియంత్రణకు ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది; పాలకుల అపరిమిత అధికారాలను విస్తరించడమూ; రాజ్య వ్యతిరేకతను అణచివేయడమూ దీని ఉద్దేశ్యం. కొన్ని నిర్దిష్ట సముదాయాలను ప్రమాదకరమైన ముప్పు కలిగించేవిగా ముద్రవేసి, రాజ్యం తన పూర్తి బలంతో అణచివేయాల్సిన అవసరం ఉందని చెప్పే; తప్పుదోవ పట్టించే ప్రజా భద్రతా కథనాలలో భాగంగా కూడా మరణశిక్షను ఉపయోగించవచ్చు. ఇది ఎవరినీ రక్షించదు; పైగా దీని ఉపయోగం ప్రజల హక్కులకు, భద్రతకు మరింత ముప్పును కలిగిస్తుంది.

అయినప్పటికీ, ఇంకా ఆశ ఉంది. 1977లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ అంశంపైన ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు, కేవలం 16 దేశాలు మాత్రమే మరణశిక్షను రద్దు చేశాయి. ఇప్పుడు ఆ సంఖ్య 113కి చేరుకుంది. గత దశాబ్దంలోనే, 14 దేశాలు మరణశిక్షను పూర్తిగా రద్దు చేయడం ద్వారా తమ మానవ హక్కుల నిబద్ధతను చాటుకున్నాయి; మరెన్నో దేశాలు ఆ బాటలోనే పయనిస్తున్నాయి.
మరణశిక్షను ఎందుకు రద్దు చేయాలి?
• మానవ హక్కులను ఉల్లంఘిస్తుంది
• ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని అణచివేయడానికి, భయాన్ని కలిగించడానికి; నియంత్రణను ప్రదర్శించడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది
• వివక్షపూరితమైనది, అల్ప సంఖ్యాత సముదాయాల పైన, బలహీనమైన సామాజిక-ఆర్థిక నేపథ్యం ఉన్నవారిపైన తీవ్ర అసమతుల్య ప్రభావాన్ని చూపుతుంది

ముఖ్యంగా జీవించే హక్కు, హింస లేదా ఇతర క్రూరమైన, అమానుషమైన లేదా అవమానకరమైన వ్యవహారం లేదా శిక్ష నుండి విముక్తి పొందే హక్కుకు భంగం కలిగిస్తుంది. ఇతర హక్కులతో పాటు, సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన తదితర అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా ఈ హక్కులకు రక్షణ ఉన్నది.

కాలక్రమేణా, అంతర్జాతీయ సమాజం మరణశిక్ష విధించడాన్ని నిషేధించే అనేక ఒప్పందాలను (ఇన్‌స్ట్రుమెంట్స్‌ను) ఆమోదించింది. అవి:

మరణశిక్ష రద్దు లక్ష్యంగా పౌర, రాజకీయ హక్కులపైన అంతర్జాతీయ ఒడంబడికలోని రెండవ ఐచ్ఛిక ప్రోటోకాల్.
• మరణశిక్ష రద్దుకు సంబంధించి మానవ హక్కులపైన యూరోపియన్ కన్వెన్షన్‌కు సంబంధించిన ప్రోటోకాల్ నం. 6; అన్ని పరిస్థితులలో మరణశిక్ష రద్దుకు సంబంధించి యూరోపియన్ కన్వెన్షన్‌కు సంబంధించిన ప్రోటోకాల్ నం. 13.
• మరణశిక్షను రద్దు చేయడానికి మానవ హక్కులపై అమెరికన్ కన్వెన్షన్‌కు సంబంధించిన ప్రోటోకాల్.

భయపెట్టడానికి, నియంత్రణకు సాధనంగా మరణశిక్ష
కొన్ని దేశాలలో, భయపెట్టడానికి, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే గొంతులను అణచివేయడానికి మరణశిక్షను ఉపయోగించారు. తమ రాజకీయ ప్రత్యర్థులను లేదా ఇతర విమర్శనాత్మక గొంతులను భద్రత పేరుతో ప్రభుత్వాలు మరణశిక్షకు గురిచేస్తాయి. ప్రజా భద్రతకు ఎదురయ్యే నిజమైన లేదా ఊహాజనిత ముప్పులకు ప్రతిస్పందనగా కూడా మరణశిక్షను ఉపయోగించడం వల్ల తరచుగా అణగారిన వర్గాలు ఆ శిక్షకు లక్ష్యంగా మారుతాయి. ఇది ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది, దీనివల్ల ప్రజలు మాట్లాడటానికి లేదా అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించడానికి భయపడతారు. సాధారణంగా ఇది మానవ హక్కులపైన విస్తృతమైన అణచివేత జరిగే సందర్భాలలో జరుగుతుంది.

ఇటువంటి నియంతృత్వ పద్ధతులు తరచుగా పారదర్శకతను, జవాబుదారీతనాన్ని కప్పిపుచ్చే అస్పష్టమైన చట్టపరమైన వ్యవస్థలపైన ఆధారపడతాయి. అన్యాయంగా, అత్యవసరంగా, రహస్యంగా లేదా హింస ద్వారా లేదా ఇతర దుర్వినియోగం ద్వారా సాధించిన “వాంగ్మూలాల” ఆధారంగా విచారణలు జరగవచ్చు. ఈ పద్ధతులు మరణశిక్ష వాడకాన్ని పరిమితం చేసే అంతర్జాతీయ రక్షణలను పక్కన పెడతాయి; చట్టబద్ధమైన పాలనను బలహీనపరుస్తాయి; ప్రభుత్వాలు మరణశిక్షను నియంత్రణ సాధనంగా ఉపయోగించడానికి అనుమతిస్తాయి.

ఇది పౌర సమాజ భాగస్వామ్యాన్ని నిరుత్సాహపరిచే, ప్రాథమిక స్వేచ్ఛలను హరించే ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది.

మరణశిక్ష వివక్షపూరితమైనది
మరణశిక్ష భారం అసమానంగా బలహీనమైన సామాజిక-ఆర్థిక నేపథ్యం ఉన్నవారు; మైనారిటీ వర్గాల మీద పడుతుంది.

తరచుగా, తక్కువ ఆర్థిక వనరులు ఉన్న వ్యక్తులు సమర్థవంతమైన, చట్టపరమైన ప్రాతినిధ్యాన్ని పెట్టుకోలేరు. ఈ స్థితి వారిని తప్పుడు దోషనిర్ధారణలకు మరింత హాని కలిగించేలా చేస్తుంది. జాతి, తెగ, మతపరమైన అల్ప సంఖ్యాకులు కూడా నేర న్యాయ వ్యవస్థలో వ్యవస్థాగతమైన పక్షపాతాన్ని ఎదుర్కొంటారు.

ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షను ఎలా ఉపయోగిస్తున్నారు?

2025లో అత్యధికంగా మరణశిక్షలు అమలు చేసిన దేశాలు వరుసగా—చైనా, ఇరాన్, సౌదీ అరేబియా, యెమెన్, అమెరికా.

ప్రపంచంలోనే అత్యధికంగా మరణశిక్షలు అమలు చేస్తున్న దేశంగా చైనా మొదటి స్థానంలో ఉంది. అయితే, అక్కడి డేటాను ప్రభుత్వ రహస్యంగా ఉంచాల్సినదిగా పరిగణించడం వల్ల మరణశిక్షల వాస్తవ సంఖ్య ఎంతనేది వెల్లడి కాలేదు; ప్రపంచవ్యాప్తంగా నమోదైన కనీస సంఖ్య 1,158 అయినప్పటికీ, అక్కడ వేలాదిగా జరిగినట్లు భావిస్తున్న మరణశిక్షలను ఇందులో చేర్చలేదు.
చైనాను మినహాయిస్తే, నివేదించబడిన మొత్తం మరణశిక్షలలో 87 శాతం కేవలం రెండు దేశాలలోనే జరిగాయి – అవి ఇరాన్, సౌదీ అరేబియా.

గత సంవత్సరంలో మరణశిక్షల వినియోగానికి సంబంధించిన వివరాలతో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రతి సంవత్సరం ఒక నివేదికను ప్రచురిస్తుంది. 2025 సంవత్సరంలో అత్యధికంగా మరణశిక్షలు అమలు చేసిన దేశాలు వరుసగా—చైనా, ఇరాన్, సౌదీ అరేబియా, యెమెన్, అమెరికా.

ఏ రకమైన మరణశిక్ష పద్ధతులను ఉపయోగిస్తున్నారు?
మరణశిక్ష అమలు చేసే పద్ధతులు దేశాన్ని బట్టి మారుతుంటాయి. అన్ని పద్ధతులు సహజంగానే క్రూరమైనవి; అవమానకరమైనవి. కొన్ని పద్ధతులు సుదీర్ఘకాలం పాటు బాధను కలిగిస్తాయి. ఈ పద్ధతులు చిత్రహింసల సంపూర్ణ నిషేధాన్ని ఉల్లంఘిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి నిపుణులు కనుగొన్నారు. కొన్ని సందర్భాల్లో, స్వతంత్ర పర్యవేక్షణను నిరోధించడానికి మరణశిక్షలను రహస్యంగా అమలు చేస్తారు.

వివిధ దేశాలలో ఉపయోగించే వివిధ మరణశిక్ష పద్ధతులలో తల నరకడం (Beheading); ఉరితీయడం (Hanging); ఘాతుక ఇంజెక్షన్ (Lethal injection); కాల్చి చంపడం (Shooting); నైట్రోజన్ గ్యాస్ ఆస్ఫిక్సియేషన్ (Nitrogen gas asphyxiation – శ్వాస ఆడకుండా చేయడం) ఉన్నాయి

వీటిని నిరంతరం ఉపయోగించడం వల్లనే, మరణశిక్షను మానవ హక్కుల సూత్రాలతో ఎప్పటికీ సమన్వయం చేయలేమని రుజువవుతోంది.
మరణశిక్షను రద్దు చేయడానికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏం చేస్తోంది?
ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షను రద్దు చేయడానికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గత 45 ఏళ్లుగా ప్రచారం చేస్తోంది.

అత్యంత క్రూరమైన, అమానుషమైన, అవమానకరమైన ఈ శిక్షను కొనసాగిస్తున్న ప్రభుత్వాలను ఎండగట్టడానికి; వాటిని జవాబుదారీగా చేయడానికి అన్ని దేశాలు దీనిని ఏ విధంగా ఉపయోగిస్తున్నాయో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ పర్యవేక్షిస్తుంది. ప్రతి సంవత్సరం ఒక నివేదికను ప్రచురిస్తుంది, అందులో ప్రతి దేశానికి సంబంధించిన గణాంకాలు; ధోరణుల విశ్లేషణ ఉంటుంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తాజా నివేదిక “డెత్ సెంటెన్సెస్ అండ్ ఎగ్జిక్యూషన్స్ 2024″ను 2025 ఏప్రిల్ లో విడుదల చేసింది.

మరణశిక్షను వ్యతిరేకించే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మరణశిక్షకు వ్యతిరేకించడానికి చేసే పని లక్షిత, వాదనలు; ప్రచార ఆధారిత ప్రాజెక్ట్‌ లతో సహా వివిధ రూపాల్లో ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలను బలోపేతం చేయడం ద్వారా; మరణశిక్ష వాడకంపైన తాత్కాలిక నిషేధం విధించాలనే తీర్మానాలు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆమోడం పొందడానికి మద్దతు ఇవ్వడం ద్వారా; అలాగే తక్షణ మరణశిక్షను ఎదుర్కొంటున్న వ్యక్తుల తరఫున ఒత్తిడి తెవడం ద్వారా ఉపసహారా ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, అమెరికాస్, యూరప్, మధ్య ఆసియా, మధ్యప్రాచ్య – ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలలో పలు రూపాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. జాతీయ, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలలో రద్దు ఉద్యమం చేపడుతున్న చర్యలకు, కార్యకలాపాలకు కూడా మద్దతునిస్తుంది.

1977లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తన పనులను ప్రారంభించినప్పుడు, కేవలం 16 దేశాలు మాత్రమే మరణశిక్షను పూర్తిగా రద్దు చేశాయి. నేడు ఆ సంఖ్య 113కి పెరిగింది – ఇది ప్రపంచంలోని దేశాలలో సగం కంటే ఎక్కువ. రెండవ వంతు కంటే ఎక్కువ దేశాలు చట్టపరంగా లేదా ఆచరణలో మరణశిక్షను రద్దు చేశాయి.

https://www.amnesty.org/en/what-we-do/death-penalty/

Leave a Reply