భారతదేశ ప్రస్తుత రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాలను రాజ్య స్వభావంలో వస్తున్న ప్రమాదకరమైన మార్పులను అర్థం చేసుకోవాలంటే కేవలం ఉపరితల బూర్జువా ఎన్నికల రాజకీయాలను విశ్లేషిస్తే సరిపోదు. ఈ వ్యవస్థాగత సంక్షోభం వెనుక ఉన్న అసలైన వర్గ ప్రయోజనాలు, దళారీ పెట్టుబడిదారీ కుట్రలను బట్టబయలు చేయాలి. నేడు దేశంలో రాజ్యమేలుతున్న హిందుత్వ శక్తుల ఆధిపత్యాన్ని విడి సంఘటనగానో, కేవలం మతపరమైన ఉన్మాదంగానో చూడకూడదు. భారతదేశం నయా ఉదారవాద సంక్షోభం నుండి ఉద్భవించిన భయంకరమైన ‘బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం’ పిడికిలిలో చిక్కుకుందనే చారిత్రక సత్యం స్పష్టమవుతుంది. ఇది బూర్జువా ప్రజాస్వామ్య వ్యవస్థను లోపలి నుండే నిర్వీర్యం చేస్తూ, రాజ్యాంగ స్వభావాన్ని శాశ్వతంగా మార్చివేస్తున్న వ్యవస్థాగత ఫాసిస్టు మార్పు.
పునాది-పైకప్పు సిద్దాంతాన్ని భారతీయ నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించి చూస్తే, అదానీ-అంబానీ లాంటి గుత్త పెట్టుబడిదారుల లాభాల దాహం అనేది ఇక్కడి ‘ఆర్థిక పునాది’ కాగా, ఆ దోపిడీని కప్పిపుచ్చడానికి, కార్మిక వర్గాన్ని విభజించడానికి పాలకులకు అవసరమైన సైద్ధాంతిక కవచమే ల ‘పైకప్పు’, ఇదే ఈ హిందుత్వ మితవాద ఉగ్ర జాతీయవాదం. ఈ రెండింటి కలయికే నేటి కార్పొరేట్-మతోన్మాద ఫాసిస్టు రాజ్యం.
ఈ ఫాసిస్టు రాజ్య ఆవిర్భావానికి గల భౌతిక పరిస్థితులను విశ్లేషణ చేయాలి. 1990ల తర్వాత భారతదేశంపై రుద్దబడిన నయా ఉదారవాద ప్రపంచీకరణ విధానాలు నేడు తీవ్రమైన చారిత్రక సంక్షోభంలో కూరుకుపోయాయి. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వ్యవసాయ సంక్షోభం మున్నెన్నడూ లేని స్థాయిలో పెరిగిపోయాయి. సంపద అంతా కేవలం ఒక శాతం కుబేరుల చేతుల్లో కేంద్రీకృతమైంది. పెట్టుబడిదారీ వ్యవస్థ లాభాల రేటు పడిపోతున్నప్పుడు, అది తన మనుగడ కోసం దేశ వనరులను, అడవులను, ప్రభుత్వ రంగ సంస్థలను మరింత క్రూరంగా దోచుకోవాల్సి వస్తుంది. ఈ నగ్నమైన ఆర్థిక వైఫల్యాల వల్ల ప్రజల్లో, ముఖ్యంగా కార్మికులు రైతాంగంలో రగులుకునే అసంతృప్తి వర్గ పోరాటంగా మారకుండా అడ్డుకోవడానికి గుత్త పెట్టుబడిదారీ వర్గానికి కొత్త సైద్ధాంతిక ఆయుధం అవసరమైంది. ఆ చారిత్రక అవసరం నుండే ‘నియో-ఫాసిజం’ పుట్టుకొచ్చింది.
లాభాలను రక్షించుకోవడానికి కార్పొరేట్ శక్తులు, తమ మతతత్వ అజెండాను అమలు చేయడానికి హిందుత్వ శక్తులు వ్యూహాత్మక కూటమిగా ఏర్పడ్డాయి. కార్పొరేట్లు ఎన్నికల బాండ్ల ద్వారా, మీడియా ఆధిపత్యం ద్వారా ఫాసిస్టు శక్తులకు ఆర్థిక, ప్రచార దన్ను ఇస్తుంటే, దానికి ప్రతిఫలంగా ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ, పర్యావరణ చట్టాలను నీరుగార్చుతూ కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలను అడ్డగోలుగా అమలు చేస్తోంది. ఇది 1930ల నాటి క్లాసిక్ ఫాసిజం లాగా ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి మిలటరీ నియంతృత్వాన్ని తేలేదు, కానీ ఎన్నికలు, పార్లమెంటు అనే ప్రజాస్వామ్య ముసుగును అలాగే ఉంచుతూనే రాజ్యాంగ సంస్థలన్నింటినీ లోపలి నుండి కొల్లగొట్టి, పౌర హక్కులను ఉక్కుపాదంతో అణచివేస్తోంది. దేశభక్తి పేరుతో అసమ్మతిని అణచివేయడం, ప్రశ్నించే మేధావులను ఉపా లాంటి చట్టాల కింద దేశద్రోహులుగా జైళ్లలో మగ్గబెట్టడం ఈ నయా ఫాసిజం వర్గ స్వభావాన్ని నగ్నంగా బయటపెడుతోంది.
ఈ ఫాసిజం దశాబ్దాల తరబడి పౌర సమాజంలో వేళ్లునుకుని విస్తరించిన నెమ్మదైన, కానీ అత్యంత ప్రమాదకరమైన చారిత్రక ప్రక్రియ. ఇటాలియన్ మార్క్సిస్టు ఆంటోనియో గ్రామ్షీ సిద్ధాంతాలను భారతీయ పరిస్థితులకు అన్వయిస్తే, పౌర సమాజంపై ఆర్.ఎస్.ఎస్ సాధించిన ‘సాంస్కృతిక ఆధిపత్యం’ అర్థమవుతుంది. ఫాసిజం కేవలం రాజ్య యంత్రాంగం ద్వారా మాత్రమే మనుగడ సాగించలేదు. అది ప్రజల మనస్సులను, వారి దైనందిన ఆలోచనా విధానాన్ని కలుషితం చేయాలి. గత వందేళ్లుగా శాఖలు, విద్యాసంస్థలు, సాంస్కృతిక సంస్థల ద్వారా ఆర్.ఎస్.ఎస్ బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలాన్ని మెజారిటీ ప్రజల మెదళ్లలోకి విజయవంతంగా ఎక్కించింది. రాజ్యాధికారాన్ని నేరుగా చేజిక్కించుకోకముందే, న్యాయ వ్యవస్థ, బ్యూరోక్రసీ, పోలీసు, మీడియా, విద్యా వ్యవస్థల్లోకి సూక్ష్మస్థాయిలో చొచ్చుకుపోయింది. అందుకే నేడు ఏ రాజ్యాంగ సంస్థా నిష్పాక్షికంగా పనిచేయడం లేదు. ఈ సాంస్కృతిక ఆధిపత్యం ఎంత భయంకరమైనదంటే, ప్రజలు తమ వాస్తవ ఆర్థిక శత్రువును గుర్తించలేని ‘మిథ్యా చైతన్యంలో’ కూరుకుపోయారు.
ఆకలి, నిరుద్యోగం, వ్యవసాయ పతనం లాంటి వాస్తవ సమస్యల కంటే, మతపరమైన ఉద్వేగాలే వారికి ముఖ్యమైనవిగా తోచేలా పౌర సమాజాన్ని మార్చేశారు. హిందూ సమాజంలో అట్టడుగున ఉన్న దళిత, బహుజన, ఆదివాసీ వర్గాల్లో వర్గ చైతన్యం వస్తే అది బ్రాహ్మణీయ-కార్పొరేట్ ఆధిపత్యానికి ముప్పుగా మారుతుంది. ఆ వైరుధ్యాలను కప్పిపుచ్చి, పీడిత వర్గాలందరినీ ఒకే ‘హిందూ’ గొడుగు కిందకు తేవడానికి ఫాసిజానికి బలిపశువు, అంతర్గత శత్రువు అవసరమైంది. నాజీ జర్మనీలో యూదులను ఎలాగైతే శత్రువులుగా చూపి జర్మన్ కార్మికులను ఏకతాటిపైకి తెచ్చారో, నేడు భారతదేశంలో ముస్లింలను, క్రైస్తవులను అలా ఒక అంతర్గత శత్రువుగా సృష్టించి తీవ్రమైన ఇస్లామోఫోబియాను రగిలించారు. దీని ద్వారా ఆర్థిక అసమానతలపై కార్మికులు, రైతులు ఏకమై వర్గ పోరాటం చేయకుండా వారి మధ్య మతపరమైన చీలికలు తీసుకురావడంలో పాలకుల వ్యూహం సఫలమైంది.
జైరస్ బనాజీ చారిత్రక విశ్లేషణ ఈ పరిణామాలను మరింత లోతుగా, ప్రమాదకరమైన కోణంలో ఆవిష్కరిస్తుంది. యూరోప్ లోని ముస్సోలినీ, హిట్లర్ ల ఫాసిస్టు విధానాలకు, నేటి సంఘ్ పరివార్ అనుసరిస్తున్న వ్యూహాలకు మధ్య స్పష్టమైన సైద్ధాంతిక రక్తసంబంధం ఉంది. జర్మనీలో నూరెంబర్గ్ చట్టాల ద్వారా యూదుల పౌరసత్వాన్ని రద్దు చేసి వారిని ఎలా ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చారో, నేడు భారతదేశంలో పౌరసత్వ సవరణ చట్టం , లవ్ జిహాద్ పేరుతో తెచ్చిన మతాంతర వివాహాల నిరోధక చట్టాలు సరిగ్గా అదే పని చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని అధికారికంగా మార్చకుండానే ఆచరణలో ముస్లింల హక్కులను లాగేసుకుంటున్నారు. ఫాసిజం ఎప్పుడూ తన అణచివేతను కేవలం ప్రభుత్వ బలగాల ద్వారా మాత్రమే చేయదు. అది వీధుల్లోకి వచ్చి ప్రైవేట్ మూక దాడులకు పాల్పడుతుంది. ఇటలీలో బ్లాక్ షర్ట్స్, జర్మనీలో బ్రౌన్ షర్ట్స్ చేసిన విధ్వంసాన్నే నేడు భారతదేశంలో బజరంగ్ దళ్, గోరక్షక దళాలు లాంటి హిందుత్వ మూకలు రాజ్య మద్దతుతో, పోలీసుల అండతో చేస్తున్నాయి. రాజ్యమే స్వయంగా చట్టబద్ధమైన పరిపాలనా హింసకు పాల్పడుతూ, బుల్డోజర్లతో మైనారిటీల ఇళ్లను కూల్చివేస్తోంది.
గుత్త పెట్టుబడిదారీ వర్గం తమ దోపిడీకి అడ్డువచ్చే కార్మిక సంఘాలను, వామపక్ష ఉద్యమాలను అణచివేయడానికి ‘సుప్రీం నాయకుడి’కి బేషరతుగా మద్దతు ఇస్తుంది. అచ్చం ఫాసిస్టు యూరోప్ లో జరిగినట్లే, నేడు భారత కార్పొరేట్ వర్గం నరేంద్ర మోదీ చుట్టూ అల్లబడిన వ్యక్తిగత ఆరాధనకు (Cult అండగా నిలబడి, ఏక వ్యక్తి నియంతృత్వాన్ని ప్రోత్సహిస్తోంది.
అయితే, భారతదేశంలో ఈ ఫాసిజం కేవలం బూర్జువా-పెట్టుబడిదారీ వర్గ దోపిడీకే పరిమితం కాలేదు. అది సమాజంలోని అత్యంత పురాతనమైన, అసహ్యకరమైన ఆధిపత్య వ్యవస్థతో ముడిపడి ఉంది. ఇది ‘బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం’. సాంప్రదాయ మార్క్సిస్టులు కులాన్ని కేవలం సామాజిక పైకప్పుగా మాత్రమే చూస్తే, కులాన్ని ఈ దేశంలో ఒక ‘ఆర్థిక పునాది’ గా విశ్లేషించాలి. కుల వ్యవస్థ ఆధారంగానే భారతదేశంలో వనరుల పంపిణీ, శ్రమ దోపిడీ, భూమిపై ఆధిపత్యం తీర్మానించబడుతున్నాయి.
ఆర్.ఎస్.ఎస్ ప్రతిపాదిస్తున్న ‘హిందూ రాష్ట్రం’ అనేది ముస్లింలకు మాత్రమే వ్యతిరేకం కాదు, అది మూలతత్వంలో దళిత, బహుజన, ఆదివాసీల ఆత్మగౌరవానికి, వారి అభివృద్ధికి వ్యతిరేకం. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను లోపలి నుండే నిర్వీర్యం చేయడం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం ద్వారా దళితులను ఉపాధికి దూరం చేయడం ఈ బ్రాహ్మణీయ ఫాసిజం వ్యూహంలో భాగమే. ఇది అట్టడుగు వర్గాలను ఎప్పటికీ చౌక శ్రామికులుగా అట్టిపెట్టుకోవాలని చూసే అగ్రవర్ణ-కార్పొరేట్ కూటమి కుట్ర.
కేవలం మతపరమైన ఉద్యమం కాదు, ఇది లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర స్వభావాన్ని సమూలంగా మార్చివేసి, దాని స్థానంలో మితవాద ఉగ్ర జాతీయవాద మతరాజ్యాన్ని స్థాపించే చారిత్రక ప్రాజెక్టు. బూర్జువా ప్రజాస్వామ్యానికి ఉండే కనీస లక్షణాలైన భిన్నాభిప్రాయం, స్వేచ్ఛాయుత ఎన్నికలు, సంస్థాగత స్వయంప్రతిపత్తి లాంటి వాటన్నింటినీ ఈ ఫాసిజం శాశ్వతంగా తుడిచిపెట్టేస్తోంది.
దేశం ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభం ఏదో ఒక రాజకీయ పార్టీ వైఫల్యం కాదు. అది పెట్టుబడిదారీ వ్యవస్థ, భూస్వామ్య ఆవశేషాల నిర్మాణాత్మక సంక్షోభం. సామ్రాజ్యవాద శక్తులకు దళారీలుగా వ్యవహరిస్తున్న భారత పాలకవర్గాలు, అటవీ, వ్యవసాయ రంగాలను కార్పొరేట్లకు అప్పగించడానికి ఆదివాసీలపై, రైతాంగంపై రాజ్య హింసను ప్రయోగిస్తున్నాయి. వ్యవసాయ రంగాన్ని లాభదాయకం కానిదిగా మార్చి, రైతులను నగరాలకు కూలీలుగా తరిమేస్తున్నారు. దీన్నే ‘ప్రాథమిక మూలధన సంచయనం’ అంటారు. ఈ దోపిడీని ప్రశ్నించకుండా ఉండటానికే మతం మత్తును ప్రజలకు ఎక్కిస్తున్నారు. దినచర్యగా మారిన మైనారిటీ వ్యతిరేక హింస, బుల్డోజర్ దాడులు, గోసంరక్షణ ఉన్మాదం ఇవన్నీ కార్పొరేట్ శక్తుల ఆర్థిక దోపిడీకి రక్షణగా నిలుస్తున్న సైద్ధాంతిక పొగమంచు మాత్రమే. ఫాసిజం అనేది పెట్టుబడిదారీ వ్యవస్థ చేతిలోని అత్యున్నత, అత్యంత క్రూరమైన అణచివేత సాధనం.
వ్యవస్థ స్వభావంలోనే ఫాసిస్టు మార్పు జరిగినప్పుడు, దానిని కేవలం బూర్జువా పార్లమెంటరీ ఎన్నికల ద్వారా తిప్పికొట్టలేము. ఒక దళారీ పక్షాన్ని ఓడించి, దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న మరో దళారీ బూర్జువా పక్షానికి అధికారం అప్పగించినంత మాత్రాన కార్పొరేట్, బ్రాహ్మణీయ దోపిడీ అంతం కాదు. ఎందుకంటే ఆర్థిక పునాదిలో మార్పు రాకుండా కేవలం రాజకీయ పైకప్పును మారిస్తే ప్రయోజనం శూన్యం. ఈ నయా ఉదారవాద, నియో-ఫాసిస్టు వ్యవస్థను అంతం చేయాలంటే, దాని మూలాలైన గుత్త పెట్టుబడిదారీ, బ్రాహ్మణీయ భూస్వామ్య వ్యవస్థలను సమూలంగా నాశనం చేయాలి. మతం, కులం, ప్రాంతం పేరుతో కృత్రిమంగా విభజించబడిన కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీ పీడిత వర్గాలు తమ ఉమ్మడి శత్రువును గుర్తించాలి. మిథ్యా చైతన్యాన్ని బద్దలు కొట్టి, ఒక నిజమైన వర్గ చైతన్యంతో వారంతా ఐక్య సంఘటనగా ఏకమవ్వాలి.




