వాళ్ళిప్పుడు లేకపోవచ్చు
పూలురాలి పుప్పొడి వెదజల్లబడినట్లుగానే
వాళ్ళు నేలరాలి నెత్తురు ప్రవాహమవ్వొచ్చు
ధారలు ధారలుగా
కన్నీటి పర్యంతమై అడవి చిత్తడి కావొచ్చు
తడి తగిలి అడవి చిగుర్లు వేయక మానదు
వాళ్ళిప్పుడు కనిపించక పోవచ్చు
నది నడక ఆగిపోయినట్లుగానే ఉండొచ్చు
తీరం మీద మైదానం సంభాషణ లేకపోవచ్చు
అల తాకిడి అలికిడి తారసపడకపోవచ్చు
కెరటాలు ప్రవాహలు ఉప్పొంగడాలు
అంతా అడగంటిపోయినట్లుగా ఉండొచ్చు
గోదావరీ
ఇంద్రావతీ
నెత్తురింకి అట్టగట్టుకుపోచ్చు
మది మడుల్లో తడి మాత్రం అట్లాగే ఉంది
ఇప్పుడు అడవి ఖాళీ కావొచ్చు
చెట్లు నేలకూలినట్లుగానే వాళ్ళు
కాలి బాటలన్నీ చదునుకావొచ్చు
కొండగుర్తులన్నీ లింకులు తెగిపోవచ్చు
స్మృతులు స్తూపాలెత్తు నేలకూలొచ్చు
విల్లు బాణం కొడవలి గొడ్డలి
జనచీమల బారు
చెల్లాచెదురు కావొచ్చు
విద్య వైద్యం వ్యవసాయం
శాఖోపశాఖలై ఎదిగిన కొమ్మలన్నీ కొట్టేయబడొచ్చు
జనతన బడిపోరగాండ్ల జేబుల్లో
విరిగిన బలపం ముక్క మాత్రం
ఇవ్వాళ కాకున్నా
రేపైనా ఓ నినాదం రాయడానికి ఎదురుచూస్తుండొచ్చు .




