“గణతంత్రం తన సొంత బిడ్డలను చంపడాన్ని మేము అనుమతించలేము”
జీరమ్‌ఘాటిలో 10 మందికి విధించిన మరణశిక్షలను రద్దు చేయాలి
సిల్డా లో 23 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షలను రద్దు చేయాలి
రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల, ప్రజాస్వామ్య, మానవ హక్కుల సంస్థలకు విజ్ఞప్తి
ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో ఉన్న ప్రత్యేక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐ ఏ) కోర్టు, 2013 జీరమ్ ఘాటి దాడి కేసులో పది మంది మావోయిస్టులు, ఆదివాసీ వ్యక్తులకు విధించిన మరణశిక్షలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ ఘటన జరిగిన పదమూడు సంవత్సరాల తర్వాత, ప్రమీలా మోడియం, సుమిత్రా పూనెం, కోసా కవాసి, ముక్క మాండవి, మార్కమి దేవా, ఐతా మార్కమ్, బంజామి సన్నా, చైతు లేఖం, జోగా మార్కమి, మహాదేవ్ నాగాలకు కోర్టు మరణశిక్ష విధించింది.
అలాగే, పశ్చిమ బెంగాల్‌లో 2010లో ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్స్ శిబిరంపై జరిగిన దాడికి సంబంధించిన సిల్డా కేసులో 23 మంది నిందితులకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షలను కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ రెండు కేసులలో విధించిన సుదీర్ఘ కారాగార శిక్షలు; కఠినమైన తీర్పులు చట్టబద్ధమైన ప్రక్రియ, శిక్షలలో అనుపాతం, రాజకీయ ఖైదీల పట్ల వ్యవహరించే తీరు; నిష్పక్షపాత న్యాయ ప్రక్రియ హక్కుకు సంబంధించిన తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
జీరమ్‌ఘాటీ కేసులో పది మంది నిందితులకు విధించిన మరణశిక్షలను తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే సిల్దా కేసులో 23 మంది నిందితులకు విధించిన జీవిత ఖైదు శిక్షలను రద్దు చేయాలని; రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని కూడా మేము మరింతగా డిమాండ్ చేస్తున్నాము. జీవిత హక్కు పరిరక్షణ, రాజ్యాంగ రక్షణలు; న్యాయం అనేది రాజ్య ప్రతీకార సాధనంగా మారకూడదనే ప్రజాస్వామిక సూత్రంపైన మా వైఖరి ఆధారపడి ఉంది.
జీరమ్‌ఘాటీ దాడికి సంబంధించి జరిపే ఏ విచారణ అయినా అందుకు దారితీసిన విస్తృత రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. మావోయిస్టు తిరుగుబాటును అణచివేసే నెపంతో 2005లో ప్రారంభించబడిన సల్వా జుడుమ్, విస్తృతమైన హింస, నిర్వాసితులుగా మారడానికి, ఆదివాసీ గ్రామాలు; వారి జీవనోపాధి ధ్వంసం కావడానికి కారణమైంది.
సల్వా జుడుమ్‌లో భాగమైన సాయుధ పౌర గుంపులకు మద్దతు ఇవ్వడం ఆపేయాలని 2011లో సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినప్పటికీ, సల్వా జుడుమ్ సిబ్బందిని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్‌లో విలీనం చేయడం, ఆ తర్వాత అమలు చేసిన ఆపరేషన్ గ్రీన్ హంట్, సమాధాన్-ప్రహార్, ఆపరేషన్ కగార్ వంటి ఇలాంటి ఇతర ప్రాజెక్ట్‌లు రాజ్య జవాబుదారీతనంపైనా, ఆదివాసీ ప్రజలపై అమలవుతున్న సైనిక అణచివేత కొనసాగింపుపైన తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి.
దశాబ్దాల తరబడి సాగిన అప్రజాస్వామిక భూసేకరణలు, అడవులపై ఉన్న హక్కులపై ఆంక్షలు, రాజ్య మద్దతుతో కూడిన వనరుల దోపిడీ అభివృద్ధి ఆదివాసీ సముదాయాలను మరింత నిరాశ్రయులను చేశాయి. జీరమ్‌ఘాటీ కేసులో ఉన్న ప్రతి నిందితునికి నిష్పాక్షపాత విచారణను అందించే; ప్రాథమిక హక్కులను రక్షించే తన బాధ్యత నుండి రాజ్యం తప్పుకోలేదు.
కాబట్టి, జీరమ్‌ఘాటీ కేసులో పది మంది వ్యక్తులపై ఉన్న అన్ని మరణశిక్ష అమలు ప్రక్రియలను తక్షణమే నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. పదమూడేళ్ల జైలు జీవితం; సుదీర్ఘ న్యాయపరమైన విచారణల తర్వాత విధించిన ఈ మరణశిక్షలు న్యాయ నిర్వహణపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా విచారణ సమయంలో ఒక నిందితుడు మరణించడం, అలాగే నిందితులపై తప్పుడు కేసులు బనాయించారని, తగిన ఆధారాలు లేవని కుటుంబ సభ్యులు, పౌర హక్కుల సంస్థలు గట్టి ప్రశ్నలు లేవనెత్తడం దీనికి కారణం. ఈ ఆందోళనలను పోగొట్టడానికి పారదర్శకమైన, స్వతంత్రమైన న్యాయ విచారణ జరపడం అవసరం.
2010 ఫిబ్రవరి 15నాడు పశ్చిమ బెంగాల్‌లోని సిల్డాలో ఉన్న ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైఫిల్స్ క్యాంపుపైన సాయుధ మావోయిస్టు దాడి జరగడంతో పలువురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 2024లో కోర్టు 23 మంది నిందితులను దోషులుగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది.
నిందితులు ఇప్పటికే సంవత్సరాల తరబడి కటకటాల వెనుక గడిపారు. వారిపై సాక్ష్యాధారాలు లేకపోవడం, గుర్తింపు ప్రక్రియలు, సుదీర్ఘ కాలం పాటు జైలులో ఉంచడం వంటి తీవ్రమైన అంశాలు వారి దోషి నిర్ధారణపైన సమగ్ర న్యాయ సమీక్ష జరగాలని; వారి జీవిత ఖైదు శిక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
సిల్డా కేసులో జీవిత ఖైదు శిక్షలు భారతదేశంలో రాజకీయ కార్యకర్తలు, అసమ్మతి వాదులపై ప్రయోగిస్తున్న సుదీర్ఘ కారాగార శిక్షల విస్తృత సరళిలో భాగమే. ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ వంటి అనేక మంది తమ విచారణలు పూర్తి కాకుండానే సంవత్సరాల తరబడి జైళ్లలో గడిపారు.
జ్యుడీషియల్ కస్టడీలో మరణించిన ఫాదర్ స్టాన్ స్వామి, పాండు నారోటే, అలాగే సంవత్సరాల తరబడి జైలు శిక్ష అనుభవించి విడుదలైన కొద్దికాలానికే మరణించిన జి.ఎన్. సాయిబాబా వంటి కేసులే ఇటువంటి అమానుష, ప్రజాస్వామ్య వ్యతిరేక కారాగార శిక్షల వల్ల కలిగే తీవ్రమైన మానవ పరిణామాలను నిరూపిస్తున్నాయి.
ఈ కేసులు న్యాయ వ్యవస్థను బట్టబయలు చేస్తున్నాయి, ఇక్కడ ఈ ప్రక్రియే స్వయంగా శిక్షగా మారుతుంది; ముఖ్యంగా రాజకీయ ఖైదీల విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల సిల్డా కేసులోని 23 మంది నిందితులను; రాజకీయ ఖైదీలందరినీ తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే రాజ్యం, రాజకీయ అసమ్మతికి అనిశ్చిత కాలపు జైలు శిక్షతో సమాధానం ఇవ్వలేదు.
గణతంత్రరాజ్యం తన పిల్లలను చంపలేదు: CPI(మావోయిస్ట్) నాయకుడు ఆజాద్, పత్రికా విలేకరి హేమచంద్ర పాండేల ఎన్‌కౌంటర్, అప్రజాస్వామిక వ్యతిరేక హత్యల సందర్భంలో 2011లో సుప్రీంకోర్టు చేసిన “రిపబ్లిక్ తన సొంత పిల్లలను చంపడాన్ని మేము అనుమతించలేము” అనే వ్యాఖ్య, రాజ్యాంగ ప్రజాస్వామ్యంలోని ఒక ప్రాథమిక సూత్రాన్ని వ్యక్తీకరిస్తుంది. అదేమిటంటే, రాజ్యం మానవ గౌరవాన్ని, జీవించే హక్కును రక్షించాలి.
మరణశిక్ష అనేది తిరగరాయడానికి వీలులేనిది. ఒకవేళ తప్పుగా దోషిగా నిర్ధారిస్తే దానిని సరిదిద్దే అవకాశాన్ని అది ఎప్పటికీ ఇవ్వదు. అదే సమయంలో, నిర్మాణపరమైన అసమానతలు, చట్టపరమైన ప్రాతినిధ్యం సరిగ్గా అందకపోవడం వంటివి ఇటువంటి కేసుల ఫలితాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. భారతదేశంలో మరణశిక్ష పడిన వ్యక్తుల సామాజిక-ఆర్థిక బలహీనతలను ప్రాజెక్ట్ 39A డెత్ పెనాల్టీ ఇండియా నివేదిక డాక్యుమెంట్ చేసింది. పేదరికం, సామాజిక ఉదాసీనతలు న్యాయం అందకుండా ఎలా అడ్డుకుంటున్నాయో ఇది నొక్కి చెబుతుంది.
జీవిత హక్కును, ఇతర ప్రాథమిక హక్కులను ఎంపిక చేసుకున్న వాటికే పరిమితం చేయలేము. కాబట్టి ప్రజాస్వామ్య న్యాయ వ్యవస్థ కేవలం చట్టబద్ధతపైనే కాకుండా, నిష్పాక్షపాతత, మానవ గౌరవం, ప్రాథమిక జీవించే హక్కుపైన కూడా ఆధారపడి ఉండాలి.
అందుకని మేం భాతదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ అమలుచేస్తున్న మరణశిక్షను వ్యతిరేకిస్తాం. మరణశిక్ష రద్దును అమలుచేయడానికి నిర్దిష్ట చర్యలను చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
మా డిమాండ్లు
1. జీరమ్‌ఘాటి కేసులో పది మందికి విధించిన మరణశిక్షలను తక్షణమే రద్దు చేయాలి.
2. సిల్డా కేసులో 23 మంది నిందితులకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షలను రద్దు చేయాలి.
3. నిష్పక్షపాత విచారణలు, సమర్థవంతమైన న్యాయ ప్రాతినిధ్యం, అప్పీలుకు సంబంధించిన అన్ని మార్గాలు అందుబాటులో ఉండేలా చూడాలి.
4. రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి.
5. తప్పుడు ఆరోపణలపైన విచారణ జరపాలి. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
6. సల్వా జుడుమ్, ఆపరేషన్ గ్రీన్ హంట్, సమాధాన్-ప్రహార్, ఆపరేషన్ కగార్ వంటి జాతి నిర్మూలన ప్రాజెక్టులతో సహా, ఆదివాసులపైన రాజ్య ప్రాయోజిత హింసపై విచారణ జరిపి, దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలి.
7. మరణశిక్ష రద్దు దిశగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి.




