మే 2026 నీట్ పరీక్ష పత్రం లీకేజీ, సిబిఎస్ఇ, ఆన్-స్క్రీన్ మార్కింగ్ లోపాల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర నిరాశకు ఆందోళనకు లోనయ్యారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వాకంతో  నీట్ పరీక్ష రద్దు కావడం,వైద్య విద్య ప్రవేశం కోసం కన్న కలలు ఆవిరై పోవడంతో, ఎంతోమంది మనస్తాపం చెందిన లేత మనసుల పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇదే సమయంలో మే 15న సుప్రీంకోర్టులో నకిలీ లాయర్ డిగ్రీలకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతనుద్దేశించి బొద్దింకలు, పరాన్నజీవులని  వ్యాఖ్యానం చేశారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో సిజేఐ ఎగతాళిని ఎగతాళి చేస్తూ గంటల వ్యవధిలోనే ఒక సోషల్ మీడియా అకౌంట్ పుట్టింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ ) పురుడు పోసుకుంది. మే 15న ఆన్లైన్ ఉద్యమం మొదలైంది. జూన్ 6 నుండి ఢిల్లీలోని “జంతర్ మంతర్ “బొద్దింకల నిరసనలకు ప్రత్యక్ష పోరాటవేదిక అయింది. ఈ దేశ యువత వినూత్న పద్ధతిలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాకా సృజనాత్మక పోరాట రూపాలతో ఉద్యమాన్ని కొనసాగించింది. నిశ్శబ్దాన్ని ఛేదించి నేటితరం నడిపిన సాహసోపేత పోరాటాన్ని దాని నేపథ్యాన్ని, అనంతర పరిణామాలను మరియు ఉద్యమాన్ని అడ్డుకోవడానికి పాలకులు సాగించిన కుట్రను హింసను, వాళ్ళ విధానాలతో అన్ని ప్రజా రంగాలతో పాటు ధ్వంసమైన విద్యా వ్యవస్థ స్వరూప స్వభావాలను నికార్సుగా చర్చించిన పుస్తకం “క్రాంతి” రాసిన జెన్ జెడ్ భారతం. ప్రగతిశీల ఉద్యమాలతో సంస్థలతో కలసి నడిచిన యువకుడిగా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా, సామాజిక స్పృహ కలిగిన రచయితగా, ఢిల్లీ జంతర్ మంతర్ ఉద్యమ వాస్తవాలను చారిత్రక డాక్యుమెంట్ గా” జెన్ Z భారతం” (నిశ్శబ్దాన్ని ఛేదించిన తరం) విలువైన పుస్తకాన్ని మన ముందుంచాడు.

అశోక్ కుంబం రాసిన ముందుమాట లోతైన ఆలోచనలతో పుస్తకంలోని విషయాలను మరింతగా అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఫాసిస్ట్ రాజకీయాలను వాటి పర్యవసానాన్ని దాన్ని అడ్డుకోవడానికి సాగుతున్న ప్రజా పోరాటాల చైతన్యాన్ని గురించి మనకు  అవగాహనను కలిగిస్తుంది.

“జెన్ జీ” ఉద్యమం ఒక రోజులోనే వచ్చిన నిరసన రూపం కాదని దాని వెనుక దశాబ్ద కాలపు భారత ఫాసిస్టు రాజకీయ చరిత్ర ప్రభావం ఉందన్న వాస్తవాన్ని ఈ పుస్తకంలోని విషయాలు తేట తెల్లం చేస్తాయి. అధికార కేంద్రీకరణ, ప్రశ్నించే స్వరాలపై అణచివేత, భిన్నాభిప్రాయాన్ని దేశద్రోహంగా మార్చే పాలకవర్గ భాష, పౌర హక్కుల హననం వీటన్నింటిని ఈ తరం తమ కళ్ళముందే చూసిందని ఈ పుస్తకం పరిశోధనాత్మకంగా వివరిస్తుంది. చారిత్రాత్మక రైతు ఉద్యమం, షాహిన్ బాగ్ ప్రతిఘటన, విశ్వవిద్యాలయాల్లో వెల్లువెత్తిన పోరాటాల మధ్య పెరిగిన ఈ తరం పొందిన స్ఫూర్తి చోదక శక్తిగా జంతర్ మంతర్ ఉద్యమానికి జవసత్వాలను ఇచ్చింది. ఇట్లా సరియైన సమయంలో ఈ దేశ యువత సరికొత్త  ఆయుధాన్ని అందుకుంది. అందుకై వైవిధ్యంగా ఆలోచించింది. తమ పోరాటాన్ని సృజనాత్మకంగా మలుచుకుందనే విశ్లేషణను పుస్తక రచయిత సోదాహరణంగా వెల్లడిస్తాడు.

జెన్ జీ భారతం లోని రెండు అధ్యాయాలను వాటిలోని అంశాలను, మరింత విశాల దృష్టితో ఆలోచింప జేసేందుకు ప్రేరణ నిచ్చేందుకు, అడవి ఆక్రందనను, కొలంబో నుంచి జంతర్ మంతర్  దాకా సాగిన జెన్ జీ ల తిరుగుబాటును ఎంతో ఆశావహంగా మనం అవలోకిస్తాం. ఈ పుస్తకంలోని చాలా పేజీలు తిప్పుతున్నప్పుడు మన వేలి కొసలకు అంటే తడి, బలవన్మరణం పాలైన జతిన్ నుండి హసీనా దాకా, ఇంతకు  తొమ్మిది సంవత్సరాల ముందే డాక్టర్ కావాలని తను కన్న కలలు భగ్నమై, ఆత్మహత్య చేసుకున్న “అనిత” దాకా, పసితనం ఛాయలు వీడని ఆ పిల్లల ముఖాలు మనల్ని వెంటాడుతాయి.అమానుష రాజ్యముఖమూ మన కళ్ళెదుట నిలుస్తుంది.

మరోవైపు ముస్లింలను దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రచారం కొనసాగుతుంటే, జంతర్ మంతర్ ఉద్యమంలో ఇర్ఫాన్, జునైద్ అనే యువకులు నిర్వహించిన పాత్ర మనల్ని అబ్బురపరుస్తుంది. ఇట్లా ఈ ఉద్యమ సందర్భం లోని అనేక సన్నివేశాలను ఈ పుస్తకం అద్భుతంగా రికార్డు చేసింది. నీట్ పేపర్ లీక్ నుండి ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా సాగిన జెన్ జీ ఉద్యమం, అది దేశవ్యాప్తంగా వేసిన ప్రభావం, పొందిన అనుభవం సాధించుకున్న ఆశావహ వర్తమానం దాకా అనేక విషయాలను, ఈ ఉద్యమ పరిమితులనూ భవిష్యత్తును కూడా రచయిత ఈ పుస్తకంలో విస్తృత పరిశీలనతో చర్చించాడు. దశాబ్దం పైగా ఉక్కపోతను అనుభవించిన దేశ ప్రజలకు ఒక బలమైన ఆశను కలిగించిన ఉద్యమ నేపథ్యాన్ని భావి ఆశా రేఖలను అత్యంత ఆసక్తికరంగా అందించిన ఈ పుస్తకాన్ని తప్పక అందరమూ చదవాల్సి ఉంది. చర్చించాల్సి ఉంది.

Leave a Reply